NTR: శతాబ్దపు అద్భుతం.. ఎన్టీఆర్‌

ఆదివారం ఎక్కడకెళ్లినా ఇదే నినాదమే. ఎక్కడ చూసినా ఆయన చిత్రపటాలే. శత జయంతి సందర్భంగా శకపురుషుడిని తెలుగు ప్రపంచం ఘనంగా స్మరించుకుంది.

Updated : 29 May 2023 14:00 IST

ఎన్టీఆర్‌... ఎన్టీఆర్‌... ఎన్టీఆర్‌

- ఆదివారం ఎక్కడకెళ్లినా ఇదే నినాదమే. ఎక్కడ చూసినా ఆయన చిత్రపటాలే. శత జయంతి సందర్భంగా శకపురుషుడిని తెలుగు ప్రపంచం ఘనంగా స్మరించుకుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్‌ తెలుగువారి పౌరుషానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. సినిమా, రాజకీయ రంగాలపై ఆయనది ప్రత్యేకమైన ముద్ర. ఎన్టీఆర్‌ జన్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు చిత్రసీమలో శత జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పించారు. పలువురు సినీ తారలు, దర్శకులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్టీఆర్‌ కీర్తిని గుర్తు చేసుకున్నారు.


‘‘ఆంధ్రుల అభిమానం తెలుగుదనానికి ప్రత్యక్ష రూపం పంచెకట్టిన తెలుగు సంస్కృతి తెలుగు ఆడపడుచుల ధైర్యం పేదవాడి చిరునవ్వు.. రాజకీయ విప్లవం.. నందమూరి తారక రామారావు. శతజయంతి సందర్భంగా ఆ యుగ పురుషుడికి నా శతకోటి వందనాలు. తెలుగు జాతి, తెలుగు సంస్కృతి, తెలుగు భాష ఉన్నంతవరకు నందమూరి తారక రామారావు అమరుడు. ఆ మహానుభావుడి విగ్రహాలు, సంస్థలకి ఆయన పేరు తొలగించినంత మాత్రాన ఆయన కీర్తి తగ్గదు. నందమూరి తారక రామారావు అనేది ఒక పేరు కాదు, అది ఒక శక్తి. భావి తరాలకి తెలుగు భాషని నేర్పించి, వారికి తెలుగు సంస్కృతిని అందించటమే ఆయనకి మనం ఇచ్చే నిజమైన గౌరవం’’. 

 బాలకృష్ణ


* ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌.. తన వైజయంతి పతాకం లోగోలో శ్రీకృష్ణ పాత్రలో తారకరాముడు విజయశంఖం పూరిస్తున్న చిత్రాన్ని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. దీన్ని ప్రకృతి సిద్ధమైన ఆకులు, మణిమాణిక్యాలు, అరుదైన ఆల్చిప్పలతో ప్రముఖ చిత్రకారుడు ఎరిక్‌ సకల్లేరాప్యూలాస్‌ రూపొందించారు.


‘‘నూటికో కోటికో ఒక్కరు... వందేళ్లు కాదు.. చిరకాలం.. కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు ఎన్టీఆర్‌. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన ఎన్టీఆర్‌తో నా అనుబంధం నాకు చిరస్మరణీయం’’

 చిరంజీవి



‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..!’’.

 ఎన్టీఆర్‌



‘‘ఒక శతాబ్దపు అద్భుతం నందమూరి తారక రామారావు. గొప్ప నటుడు, గొప్ప నాయకుడు, గొప్ప మనసున్న మనిషి. శతజయంతి సందర్భంగా ఆయనకి నా ఘన నివాళి’’.

అనిల్‌ రావిపూడి



‘‘తెలుగు జాతి... తెలుగు సినిమా... మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిన మిమ్మల్ని స్మరించుకుంటూ... జోహార్‌ ఎన్టీఆర్‌’’.

 హరీశ్‌ శంకర్‌


‘‘మూడు అక్షరాలు మంత్రాక్షరాలుగా మారిన నామం. తలచుకుంటే తెలుగు జాతి ఛాతీ గర్వంతో ఉప్పొంగే వ్యక్తిత్వం. నటుడిగా...నాయకుడిగా, వ్యక్తిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఆయన బహుముఖ ప్రతిభ నిరుపమానం. జన్మదినమే కాదు, ప్రతి దినం ప్రాతః స్మరణీయం’’.

 శ్రీనువైట్ల


‘‘తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, శకపురుషుడు, తెలుగువారి గుండెచప్పుడు అన్న నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా మహనీయుడికి ఘన నివాళులు’’.

 గోపీచంద్‌ మలినేని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని