Tollywood: ద్వితీయార్ధం..రెట్టింపు పండగ సంబరం
చిత్రసీమ ఎప్పుడూ కొత్త సినిమాలతో సందడిగానే కనిపిస్తుంటుంది. అయితే పండగలొస్తున్నాయంటే ఆ సందడి మరింత రెట్టింపవుతుంటుంది.
దూకుడు పెంచి సిద్ధమవుతోన్న అగ్రకథానాయకులు
చిత్రసీమ ఎప్పుడూ కొత్త సినిమాలతో సందడిగానే కనిపిస్తుంటుంది. అయితే పండగలొస్తున్నాయంటే ఆ సందడి మరింత రెట్టింపవుతుంటుంది. ఎందుకంటే పండగలు.. సినిమాలు.. ప్రేక్షకులకు మధ్య ఓ విడదీయరాని బంధం ఉంది. వరుస సెలవలు దొరకడంతో సినీప్రియులు కుటుంబ సమేతంగా థియేటర్లోకి అడుగుపెట్టేది ఎక్కువగా ఆ రోజుల్లోనే. అందుకే పండగలు, పర్వదినాల విషయంలో చిత్రసీమ ఎప్పుడూ పక్కా ప్రణాళికతోనే వ్యవహరిస్తుంటుంది. ఏడెనిమిది నెలల ముందు నుంచే ఏ పండక్కి ఎవరు రావాలన్నది ముందే నిర్ణయించేసుకుంటుంటారు సినీతారలు. ఇప్పటికే ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోని పండగలన్నీ పసందైన వినోదాలతో కనువిందు చేశాయి. ఇప్పుడు ద్వితీయార్ధంలో అంతకు రెట్టింపు సందడి కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. వినాయక చవితి.. దసరా.. దీపావళి.. ఇలా ఏ పండగ చూసినా ఓ మినీ సంక్రాంతి సీజన్‌నే తలపించేలా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కల్యాణ్, రవితేజ, ప్రభాస్ తదితర అగ్ర తారలంతా ఈ పండగల బరిలో తలపడుతుండటమే దీనికి కారణం.
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత అగ్ర తారల సందడి అంతగా కనిపించలేదు. రవితేజ మినహా మిగిలిన అగ్ర తారల సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉండటంతో వేసవి సీజన్ అంతా మధ్య స్థాయి హీరోల హవానే ఎక్కువ కనిపించింది. అయితే ఈ వేసవి సినీ మారథాన్‌కు ‘ఆదిపురుష్’ రూపంలో ఓ మెరుపులాంటి ముగింపే ఇవ్వనున్నారు ప్రభాస్. ఇక ఆ తర్వాత వచ్చే ఏడెనిమిది వారాలు చిన్న, మీడియం రేంజ్ సినిమాల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. మళ్లీ ఆగస్టు 15 ముందు నుంచే బాక్సాఫీస్ ముందు అగ్ర తారల సందడి కనిపించనుంది. నిజానికిది ఏటా కనిపించే ఆనవాయితీనే. అయితే ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మాత్రం చిత్రసీమకు ప్రత్యేకంగా గుర్తుండిపోనున్నాయి. అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవి తమ కొత్త చిత్రాలతో బాక్సాఫీస్ బరిలో తలపడుతుండటమే దీనికి కారణం. ప్రస్తుతం రజనీ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జైలర్’. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఆ అంచనాలు అంతకంతకూ రెట్టింపవుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ఇక ఆ మరుసటి రోజే ‘భోళా శంకర్’గా థియేటర్లలోకి అడుగు పెట్టనున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
చవితి బరిలో భలే సందడి..
ఏటా వినాయక చవితికి రెండు మూడు సినిమాలైనా బాక్సాఫీస్ బరిలో దిగడం ఆనవాయితీనే. ఈసారి ఆ సందడి రెట్టింపు స్థాయిలో కనిపించనుంది. గణేష్ నవరాత్రులకు సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’తో శ్రీకారం చుట్టనుండగా.. ఆ వేడుకలకు ‘సలార్’తో కొబ్బరి కాయ కొట్టనున్నారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుండగా.. ‘టిల్లు స్క్వేర్’ అదే నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కుతున్న ‘హను-మాన్’ ఇంత వరకు విడుదల తేదీ ఖరారు చేసుకోని సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం వినాయక చవితిని లక్ష్యం చేసుకునే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
క్రిస్మస్‌కు నాని - వెంకీల పోరు..
గతేడాది క్రిస్మస్‌కు రవితేజ ‘ధమాకా’తో.. నిఖిల్ ‘18పేజెస్’తో వినోదాలు పంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ పోరు వెంకటేష్ - నానిల మధ్య కనిపించనుంది. ప్రస్తుతం నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వినూత్నమైన కథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక వెంకటేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్ 2’ లాంటి విజయం తర్వాత శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. వెంకీ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబరు 22న థియేటర్లలోకి రానుంది.
దసరాకు గత ఏడాది లెక్క ఉండదు..
సంక్రాంతి సీజన్ తర్వాత చిత్రసీమకు దొరికే మరో పెద్ద సీజన్ దసరానే. అది ఈసారి మరిన్ని వినోదాలతో సినీప్రియుల్ని ఊరిస్తోంది. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’గా.. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’గా ఈ పండగ బరిలోనే తలపడనున్నారు. వీరితో పాటు రామ్ - బోయపాటిల కొత్త సినిమా.. విజయ్ - లోకేష్ కనగరాజ్‌ల అనువాద చిత్రం ‘లియో’ దసరా రేసులో పోటీ పడుతుండటం విశేషం. వీటిలో ‘లియో’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు అక్టోబరు 20న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ‘భగవంత్ కేసరి’, రామ్ సినిమాల విడుదల తేదీలపైనే స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాలన్నింటి పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
దీపావళికి అనువాదాల పటాకా!
కథానాయకుడు కార్తికి దీపావళి బాగా అచ్చొచ్చిన సీజన్. ఆయన నుంచి వచ్చిన ‘ఖైదీ’, ‘సర్దార్’ చిత్రాలు దీపావళికే బాక్సాఫీస్ బరిలో నిలిచి హిట్టు మాట వినిపించుకున్నాయి. ఆయన ఇప్పుడీ ఆనవాయితీని ‘జపాన్’తో కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. సరికొత్త అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే పండగ బరిలో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’తో పోటీ పడనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం బలంగా వినిపిస్తోంది. ‘భారతీయుడు’కు కొనసాగింపుగా శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కాజల్ కథానాయిక. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. వీలైనంత త్వరగా నిర్మాణాంతర పనులు పూర్తి చేసి.. దీన్ని దీపావళి బరిలో నిలిపేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే తెలుగు నుంచి దీపావళి బరిలో సందడి చేసే చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ‘ఓజి’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ఈ ఏడాది ముగింపులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్లుగానే ఈ సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు పవన్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది దీపావళి బరిలో కనిపించే అవకాశం లేకపోలేదని చిత్ర వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manoj Manchu: మంచు మనోజ్ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి