Tollywood: లుక్‌ చూసుకుందామా!

అభిమాన తారలు తెరపై ఎలా కనిపించారన్నదే ప్రేక్షకుడికి ముఖ్యం. సదరు పాత్రలో ఒదిగిపోయారా లేదా? ఇదివరకు చేసిన పాత్రలకి భిన్నంగా కనిపించారా లేదా? అనే విషయాలకి ప్రాధాన్యం ఇస్తారు.

Updated : 19 Oct 2022 14:25 IST

భిమాన తారలు తెరపై ఎలా కనిపించారన్నదే ప్రేక్షకుడికి ముఖ్యం. సదరు పాత్రలో ఒదిగిపోయారా లేదా? ఇదివరకు చేసిన పాత్రలకి భిన్నంగా కనిపించారా లేదా? అనే విషయాలకి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే నాయకానాయికలు తమ లుక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.  ఇప్పుడు దర్శకులు కూడా ఆ విషయంపై అంతే జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. కథానాయకుల్ని నేరుగా కెమెరా ముందుకు తీసుకెళ్లి యాక్షన్‌ చెప్పడం లేదు. అంతకుముందే వాళ్లకి కొన్ని పరీక్షలు పెడుతున్నారు. సినిమా భాషలో అది... లుక్‌ టెస్ట్‌. ఈమధ్య పాత్ర ప్రధానంగా సాగే కథలే ఎక్కువగా రూపొందుతున్నాయి. ఆయా పాత్రలు అనుకున్నట్టుగా కుదిరాయంటే సినిమా సగం విజయం సాధించినట్టే పరిగణిస్తుంటారు. అందుకే సినిమా మొదలు పెట్టడానికి ముందే తారలకి మేకప్‌ వేసి లుక్‌ టెస్ట్‌లు చేస్తున్నారు దర్శకులు. అందుకోసం సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్స్‌ని తీసుకొచ్చి ప్రత్యేకంగా షూట్స్‌ చేయిస్తున్నారు. అందులో తారలు ఎలా కనిపిస్తున్నారో ముందే చూసుకుని, అవసమైతే మార్పులు చేర్పుల్ని కొనసాగిస్తున్నారు. ఇది ముందు నుంచీ ఉన్నదే కానీ, ఇప్పుడు ఆ విషయానికి మరింత ప్రాధాన్యం లభిస్తోంది. మహేష్‌ (MaheshBabu) - త్రివిక్రమ్‌ (Trivikram) సినిమా తొలి షెడ్యూల్‌కి ముందు లుక్‌ టెస్ట్‌ జరిగింది. అల్లు అర్జున్‌ (Allu Arjun) - సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న ‘పుష్ప2’ (Pushpa 2) కోసం కూడా ఓ ఫొటో షూట్‌ చేశారు. పూర్వ నిర్మాణ పనుల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతుంటాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం ప్రభాస్‌ కూడా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఈ కలయికలో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని