గెటప్పు ఊసుల ఊరింపు

కొత్త సినిమా కబురు వినిపిస్తే చాలు... ఆయా తారల అభిమానులు, సినీ ప్రేమికులు ప్రత్యేకమైన ఆత్రుతతో ఆరా తీస్తుంటారు. దర్శకుడు ఎవరు? జోడీగా ఎవరు నటిస్తారు?  కథా నేపథ్యం ఏమిటి? ఎప్పుడు విడుదలవుతుంది? ... ఇలా ప్రతిదీ ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అందులో తమ అభిమాన తారలు భిన్నమైన గెటప్పుల్లోనూ కనిపిస్తారనే సంగతి వినిపించిందంటే... ఆత్రుత మరింతగా పెరిగిపోతుంది.

Updated : 25 May 2021 04:14 IST

కొత్త సినిమా కబురు వినిపిస్తే చాలు... ఆయా తారల అభిమానులు, సినీ ప్రేమికులు ప్రత్యేకమైన ఆత్రుతతో ఆరా తీస్తుంటారు. దర్శకుడు ఎవరు? జోడీగా ఎవరు నటిస్తారు?  కథా నేపథ్యం ఏమిటి? ఎప్పుడు విడుదలవుతుంది? ... ఇలా ప్రతిదీ ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అందులో తమ అభిమాన తారలు భిన్నమైన గెటప్పుల్లోనూ కనిపిస్తారనే సంగతి వినిపించిందంటే... ఆత్రుత మరింతగా పెరిగిపోతుంది. లుక్‌ ఎలా ఉంటుంది? ఒకటా... రెండా? రెండు కోణాల్లో కనిపిస్తారని తెలిశాక ఒక లుక్‌ బయటికొచ్చినా సరే...  కనిపించని మరొక ఆ అవతారం ఎలా ఉంటుందో అంటూ ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులతో ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు కూడా అదే తరహాలో గెటప్పుల ఊసులతో ఊరిస్తున్నారు మన హీరోలు.

తేడాది చిరంజీవి గుండుతో ఓ గెటప్‌ని ప్రయత్నించి చూసుకున్నారు. అది ‘వేదాలం’ రీమేక్‌ కోసమే. అప్పట్నుంచి ఆయన గుండు బాస్‌గా ఎలా సందడి చేస్తారా అంటూ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త రకమైన వేషధారణలతో కనిపించడం కథానాయకులకి కొత్తేమీ కాదు. కథల మాటెలా ఉన్నా... కనిపించే విధానంలోనైనా కొత్తదనం చూపించాలనేది వాళ్ల తాపత్రయం. అందుకే అప్పుడప్పుడు ఇతర పరిశ్రమలకి చెందిన మేకప్‌ నిపుణుల్ని కూడా ఆహ్వానించి కొత్త లుక్‌లు ప్రయత్నిస్తుంటారు. ఇక కథలు కూడా డిమాండ్‌ చేశాయంటే... వేషధారణలపై మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. కొన్నిసార్లు ఒకే సినిమాలో రెండు మూడు కోణాల్లో కనిపించాల్సి వస్తుంటుంది. అందుకోసం కథానాయకులు ప్రత్యేకమైన కసరత్తులు కూడా చేసి, పాత్రలకి తగ్గట్టుగా సిద్ధమవుతుంటారు.

పవన్‌కల్యాణ్‌... ప్రభాస్‌

‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్‌కల్యాణ్, ‘సలార్‌’లో ప్రభాస్‌ గెటప్పుల గురించి బయటికొస్తున్న విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. మొఘల్‌ కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ మూడు రకాల లుక్స్‌లో కనిపిస్తారని సమాచారం. అందుకోసం కథానాయకుడు పవన్‌కల్యాణ్, ఇతర చిత్రబృందం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నారు. ప్రభాస్‌ ‘సలార్‌’లోనూ రెండు కోణాల్లో కనిపిస్తారని సమాచారం. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’లోని గ్యాంగ్‌స్టర్‌ లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. దానికి భిన్నమైన మరో లుక్‌ కూడా సినిమాలో ఉంటుందని, ఆ లుక్‌లోనే ఆయన సిక్స్‌ ప్యాక్‌ దేహంతో సందడి చేస్తారని సమాచారం. ఆ మేరకు ప్రభాస్‌ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలిసింది.


వీళ్లే కాదు.. అగ్ర హీరోలు బాలకృష్ణ ‘అఖండ’లోనూ రెండు రకాల గెటప్పులతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ రెండు లుక్కులూ బయటికొచ్చాయి. వెంకటేష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘నారప్ప’లోనూ రెండు రకాల వేషధారణలతో కనిపిస్తారు. ఆ మేరకు ఆయన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణని పూర్తి చేశారు.

యువతరం కూడా...

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’లోనూ ఆయన గెటప్పు ఆకట్టుకుంది. బెంగాలీ బాబుగా నాని కనిపిస్తున్న విధానమే కొత్తదనాన్ని పంచింది. దాంతోపాటు ఆయన తెరపై మరికొన్ని గెటప్పుల్లో కనిపిస్తారని తెలుస్తోంది. మరి వేషాలు ఎలా ఉంటాయో చూడాలి. ‘థ్యాంక్‌ యూ’ సినిమా కోసం నాగచైతన్య కూడా మరోసారి తన లుక్‌ని మార్చుకున్నాడు. ఆయన కూడా ఇందులో మూడు రకాలుగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.  యువకుడిగానూ, అలాగే మూడు పదుల వయసు దాటిన వ్యక్తిగానూ ఆయన తెరపై సందడి చేయనున్నారని సమాచారం. ‘పవర్‌ పేట’ అనే సినిమా కోసం నితిన్‌ కూడా కొత్త గెటప్పులు ప్రయత్నించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన మూడు పాత్రల్లో కనిపిస్తుండగా, అందులో ఆరు పదుల వయసున్న వ్యక్తి పాత్ర ఒకటి కావడం విశేషం. కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ సినిమాలో అయితే ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక దానికొకటి భిన్నమైన ఆ లుక్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని