Tollywood: కథ కోరుకున్నదే చేస్తా

‘‘ఇప్పటివరకు నేను తెరపై కనిపించిన తీరుకి గుర్తింపు వచ్చింది కానీ... నా నటనకి రాలేదు. ఈ సినిమాతో నటిగానూ పేరొస్తుందని నా నమ్మకం’’ అన్నారు కథానాయిక తేజస్విని మడివాడ.

Updated : 15 Aug 2022 06:56 IST

‘‘ఇప్పటివరకు నేను తెరపై కనిపించిన తీరుకి గుర్తింపు వచ్చింది కానీ... నా నటనకి రాలేదు. ఈ సినిమాతో నటిగానూ పేరొస్తుందని నా నమ్మకం’’ అన్నారు కథానాయిక తేజస్విని మడివాడ (Tejaswini). ఆమె ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కమిట్‌మెంట్‌’ (commitment). ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తేజస్వి ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.  ‘‘వాస్తవికతతో కూడిన కథతో రూపొందిన చిత్రమిది. కథ విన్నప్పుడు నాకు ఎదురైన చాలా సంఘటనలు గుర్తుకొచ్చాయి. అందుకే వెంటనే కనెక్ట్‌ అయ్యాను. ఇందులో నాలుగు కథలుంటే అందులో నాదొక కథ. సహజమైన కథ, పాత్రలు కాబట్టి నటిగా నాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నా. కథకి ఎంత అవసరమో అంత చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. కథ రీత్యానే ఇందులో కనిపిస్తాన’’న్నారు తేజస్విని. ‘‘స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిని నేను. పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని చెప్పారు. అది ఇష్టం లేక పెళ్లి చేసుకోవడమే మానేశా’’ అన్నారు తేజస్విని.


‘గీత’ వచ్చేది ఆరోజే

హెబ్బా పటేల్‌ (Hebah Patel) ప్రధాన పాత్రలో విశ్వ తెరకెక్కించిన చిత్రం ‘గీత’ (Geetha). మ్యూట్‌ విట్నెస్‌.. అన్నది ఉపశీర్షిక. ఆర్‌.రాచయ్య నిర్మాత. సునీల్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన దర్శకుడు వినాయక్‌ ఇప్పించారు. ఆయనకు నేనెప్పటికీ రుణపడి ఉంటా. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా కనిపించనుంది’’ అన్నారు. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్‌.కె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని