Tollywood: సంక్షిప్త వార్తలు (6)

కిరణ్‌, రంజిత్‌, సజ్జన్‌, అఖిల రామ్‌, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హరికథ’. అనుదీప్‌ రెడ్డి దర్శకుడు. రంజిత్‌ కుమార్‌ గౌడ్‌, వివేకా నంద, రఘు, కవిత సంయుక్తంగా నిర్మించారు.

Updated : 30 Oct 2022 13:56 IST

నీ చేతి గాజులు మూగబోయనే..

కిరణ్‌, రంజిత్‌, సజ్జన్‌, అఖిల రామ్‌, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హరికథ’ (Harikatha). అనుదీప్‌ రెడ్డి దర్శకుడు. రంజిత్‌ కుమార్‌ గౌడ్‌, వివేకా నంద, రఘు, కవిత సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలోని ‘‘పిల్లా నీ చేతి గాజులు మూగబోయెనే’’ పాటను నటుడు ప్రియదర్శి ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు మహవీర్‌ స్వరాలు సమకూర్చగా.. పూర్ణాచారి సాహిత్యమందించారు. హన్‌మంత్‌ యాదవ్‌ ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కూర్పు: బొంతల నాగేశ్వర్‌ రెడ్డి, ఛాయాగ్రహణం: మస్తాన్‌ షరీఫ్‌.


ఒక జీవితం.. మూడు ప్రేమకథలు

శోక్‌ సెల్వన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కింది. దీన్ని తెలుగులో ‘ఆకాశం’గా.. తమిళంలో ‘నీదాం ఒరు వానమ్‌’గా నవంబరు 4న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నాని ఇటీవల విడుదల చేశారు. ఇదొక ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ డ్రామా. ట్రైలర్‌లో అశోక్‌ సెల్వన్‌ మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించారు. సినిమాలో అతని జీవితంలోని మూడు దశల్ని ఆవిష్కరించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. అతను ఒక్కో దశలో ఒక్కో యువతితో ప్రేమలో ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రేమ, మోసం సహా జీవితంలోని అన్ని భావోద్వేగాల్ని ఈ మూడు దశల్లో చూపించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే నవంబరు 4 వరకు వేచి చూడక తప్పదు. ఆర్‌.ఎ.కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రమిది. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్‌ కథానాయికలు. వయాకామ్‌ 18, రైజ్‌ ఈస్ట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. గోపీ సుందర్‌ సంగీతమందించారు.


విష్ణుకథ వినిపించేది ఆరోజే

‘వినరో భాగ్యము విష్ణుకథ’ అంటూ సినీప్రియుల్ని పలకరించనున్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని మురళి కిషోర్‌ అబ్బురు తెరకెక్కిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కశ్మీరా పరదేశీ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. అందులో ఓ రౌడీ గ్యాంగ్‌ కిరణ్‌ను రౌండప్‌ చేసి తుపాకులతో షూట్‌ చేసేందుకు సిద్ధమవ్వగా.. అతను మాత్రం స్టైలిష్‌గా చేతులు పైకెత్తి నమస్కారం చేయడం ఆసక్తిరేకెత్తిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక యాక్షన్‌ చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకి సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌, సమర్పణ: అల్లు అరవింద్‌.


యాక్షన్‌ ‘రుద్రుడు’

‘రుద్రుడు’గా అలరించేందుకు సిద్ధమయ్యారు రాఘవ లారెన్స్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కతిరేశన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. శనివారం లారెన్స్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘ఈవిల్‌ ఈజ్‌ నాట్ బోర్న్‌.. ఇట్స్‌ క్రియేటెడ్‌’’ అనే ట్యాగ్‌ లైన్‌తో వచ్చిన ఈ ప్రచార చిత్రంలో రుద్రుడుగా లారెన్స్‌ యాక్షన్‌ హంగామాను చూపించారు. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఏప్రిల్‌ 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌ స్వరాలందిస్తున్నారు.


సహజత్వం నిండిన కథతో..

అంజి బాబు, రాజవ్వ, సుధాకర్‌ రెడ్డి, కీర్తి లత ప్రధాన పాత్రల్లో రమేశ్‌ చెప్పాల తెరకెక్కించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు వేణు శ్రీరామ్‌ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ప్రేక్షకులు సహజత్వంతో నిండిన వాస్తవిక కథల్ని ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో అదే తరహా కథను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు. కథలో సహజత్వం పోకూడదని మంచి థియేటర్‌ ఆర్టిస్ట్‌లను వెతికి పట్టుకొని మరీ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల్ని రెండు గంటలు కట్టిపడేస్తుంది’’ అన్నారు. దీనికి చరణ్‌ అర్జున్‌ సంగీతమందించారు.


జాలరిపేటలో ఏం జరిగింది?

నంద్‌ రవి, హరీష్‌ ఉత్తమన్‌, శత్రు ప్రధాన పాత్రల్లో శ్రీపతి కర్రి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొరమీను’. పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్నారు. రాజా రవీంద్ర, కిషోర్‌ ధాత్రక్‌, గిరిధర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను నటి లావణ్య త్రిపాఠి సామాజిక మాధ్యమాల ద్వారా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక డ్రైవర్‌.. అతని అహంకార యజమాని.. వైజాగ్‌లో శక్తిమంతమైన పోలీసు.. ఈ మూడు పాత్రల చుట్టూ అల్లుకున్న మంచి కథతో రూపొందుతున్న చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: అనంత నారాయణన్‌, ఛాయాగ్రహణం: కార్తీక్‌ కొప్పెర.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని