Tollywood: ఒత్తిడికి ఒక మాత్ర.. ‘అన్‌స్టాపబుల్‌’

విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’. రజిత్‌ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated : 04 Jun 2023 14:19 IST

విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’. రజిత్‌ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు బ్రహ్మానందం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దాదాపు 50మంది నటీనటుల్ని ఒక దగ్గర చేర్చి ఇలాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందాన్నిచ్చింది. ఇందులోని నటుల్ని చూస్తుంటే 30ఏళ్ల క్రితం నేనిలాగే ఉండేవాడిని కదా అనిపిస్తోంది. వీళ్లలో ప్రతి ఒక్కరూ ఒక బ్రహ్మానందం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడికి ఒక మాత్రలా పని చేస్తుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు. జూన్‌ 10న బాలకృష్ణ పుట్టినరోజు కాబట్టి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు నటుడు సప్తగిరి. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్‌.


ఓ ముద్దుగుమ్మ.. గుట్టు విప్పవమ్మా!

చైతన్యరావు, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఇచ్చట అందమైన ఫొటోలు తీయబడును... అన్నది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ రంగినేని నిర్మాత. ‘ఓ ముద్దుగుమ్మ ముద్దొచ్చే కనులా మాటేమిటమ్మా... ఆ మూగ భాషలో దాగినా గుట్టువిప్పవా’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని కథానాయకుడు విష్వక్‌సేన్‌ విడుదల చేశారు. ప్రిన్స్‌ హెన్రీ స్వరకల్పనలోని ఈ పాటకి  శ్రేష్ఠ సాహిత్యం అందించగా, లిప్సిక, రితేశ్‌తో కలిసి హెన్రీ ఆలపించారు. విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘చైతన్య ఈ సినిమాతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు. చైతన్యతో కలిసి నేను సినిమా చేయలేదు కానీ, తను ‘ముఖచిత్రం’ సినిమా నుంచే నాకు పరిచయం. ముద్దుగుమ్మ పాట చాలా బాగుంది. విన్నప్పట్నుంచీ నేను కూడా పాడుకుంటున్నా’’ అన్నారు. చైతన్యరావు మాట్లాడుతూ ‘‘విష్వక్‌ చేతుల
మీదుగా పాట విడుదల కావడం ఆనందంగా ఉంది. ఓ మంచి
సినిమాతో ఈ వేసవిలోనే  ప్రేక్షకుల ముందుకొస్తాం’’ అన్నారు.


‘మహావీరుడు’ ముగించాడు!

హావీరుడు’గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అరుణ్‌ విశ్వ నిర్మాత. అదితి శంకర్‌ కథానాయిక. ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్యాచ్‌ వర్క్‌ సహా మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తయిందని, నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో టీజర్‌తో పాటు రెండో గీతాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు