Pawan Kalyan - Tollywood Producers: పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల భేటీ

Tollywood Producers Met Pawan Kalyan:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు.

Updated : 24 Jun 2024 17:13 IST

విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్న నిర్మాతలు.. అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి క్యాబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్‌తో సమావేశమయ్యారు.

సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్‌కు నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ సైతం ఉన్నారు. పవన్‌ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, డి.సురేశ్‌ బాబు, ఏఎం రత్నం, ఎస్‌.రాధాకృష్ణ, దిల్‌ రాజు, ఎన్వీ ప్రసాద్‌, భోగపల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య, సుప్రియ, బన్ని వాసు, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశంకర్‌, నవీన్‌ యర్నేని తదితరులు ఉన్నారు.

సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలో సీఎంతో చర్చిస్తాం: అరవింద్‌

పవన్‌తో భేటీ అనంతరం అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘డిప్యూటీ సీఎం పవన్‌ను సినీ పరిశ్రమ తరపున అభినందించాం. అందరం కలసి సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం. సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని పవన్‌ను కోరాం. అన్ని అసోసియేషన్లు కలసి వచ్చి సీఎం చంద్రబాబును  అభినందిస్తామని చెప్పాం. త్వరలోనే అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని చెప్పారు. త్వరలో సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై సీఎంతో చర్చిస్తాం. పరిశ్రమకు చాలా సమస్యలున్నాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది మాకు చాలా చిన్న విషయం. సీఎంను కలిసినపుడు  రిప్రజెంటేషన్ రూపంలో మా సమస్యలు తెలియజేస్తాం’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని