celebrity deaths: తీవ్ర విషాదం నింపిన 2022.. ఒకరి తర్వాత ఒకరు వెళ్లిన దిగ్గజ నటులు

2022లో మరణించిన సినీ ప్రముఖుల వివరాలు. టాలీవుడ్‌ దిగ్గజ నటులు ఒకరి తర్వాత ఒకరు లోకాన్ని విడిచి వెళ్లడం అభిమానులకు తీరని లోటు.

Updated : 29 Dec 2022 13:50 IST

ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఒకరి మరణ వార్తను జీర్ణించుకునేలోపే మరొకరు చనిపోవడం సినీ అభిమానుల్ని కలచివేసింది. దశాబ్దాలపాటు రాణించిన దిగ్గజ నటులు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ తదితరులు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు.. ఇలా ఎందరో తమ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేశారు. వారిని ఓసారి గుర్తు చేసుకుందామా..

రమేశ్‌బాబు

ప్రముఖ నటుడు కృష్ణ తనయుడు, మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు (Ramesh Babu) (56). ‘నా ఇల్లే నా స్వర్గం’, ‘అన్నా చెల్లెలు’, ‘పచ్చతోరణం’, ‘ముగ్గురు కొడుకులు’, ‘సామ్రాట్‌’, ‘చిన్ని కృష్ణుడు’, ‘కృష్ణగారి అబ్బాయి’ తదితర చిత్రాల్లో నటించిన రమేశ్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు (జనవరి 8).


మన్నవ బాలయ్య

సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య (92) యూసఫ్‌గూడలోని తన నివాసంలో ఏప్రిల్‌ 9న తుదిశ్వాస విడిచారు. పుట్టిన రోజు నాడే ఆయన (Mannava Balayya) కన్నుమూయడం విషాదకరం. ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన ‘పార్వతీకల్యాణం’, ‘ఇరుగు పొరుగు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పాండవ వనవాసం’, ‘మొనగాళ్లకు మొనగాడు’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘విక్రమార్క విజయం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘ప్రాణ స్నేహితులు’, ‘మహారాజశ్రీ మాయగాడు’ సహా 300కుపైగా చిత్రాల్లో నటించారు.


కృష్ణంరాజు

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్న దిగ్గజ నటుడు కృష్ణంరాజు (83) (Krishnam Raju) సెప్టెంబరు 11న కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు.


కృష్ణ

తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆనాటి నటుడు కృష్ణ  (79) నవంబరు 15న మరణించారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైన ఆయన్ను (Super Star Krishna) కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే కృష్ణ తుదిశ్వాస విడిచారు.


కైకాల సత్యనారాయణ

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) (87) హైదరాబాద్‌లోని తన నివాసంలో డిసెంబరు 23న మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే.


చలపతిరావు

ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చలపతిరావు (Chalapathi Rao). హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో డిసెంబరు 25న తుదిశ్వాస విడిచారు(78 వయసులో).


తాతినేని రామారావు

తెలుగు సినిమా ప్రత్యేకతను దశదిశలా చాటిచెప్పిన ప్రముఖ దర్శకుడు (Tatineni Rama Rao) తాతినేని రామారావు (83) చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్య కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 20న మరణించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు వంటిస్టార్‌ హీరోలతో వరుస సినిమాలు చేశారాయన. ‘యమగోల’,‘ఆలుమగలు’, ‘దొరబాబు’, ‘బ్రహ్మచారి’, ‘శ్రీరామరక్ష’, ‘పచ్చని కాపురం’, ‘అగ్ని కెరటాలు’, ‘జీవన తరంగాలు’ తదితర చిత్రాలు రామారావు దర్శకత్వ ప్రతిభకు ప్రతీకలు.


శరత్‌

ప్రముఖ దర్శకుడు పోలవరపు శరత్‌ (72) హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏప్రిల్‌ 1న తుదిశ్వాస విడిచారు (Sarath). మరణానికి ముందు ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు. ‘చాదస్తపు మొగుడు’, ‘వంశానికొక్కడు’, ‘పెద్దన్నయ్య’, ‘సుల్తాన్‌’,‘పెద్దింటి అల్లుడు’, ‘సూపర్‌ మొగుడు’, ‘బంధువులొస్తున్నారు జాగ్రత్త’.. ఇలా 15 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 35 చిత్రాలు తెరకెక్కించారు. 


పీసీ రెడ్డి

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ప్రముఖ సీనియర్‌ దర్శకుడు పీసీ రెడ్డి (86) జనవరి 3న మరణించారు. ‘అత్తలూ కోడళ్లు’, ‘బండిపంతులు’, ‘తాండవకృష్ణ’,‘మానవుడు దానవుడు’ తదితర చిత్రాలను ఆయన తెరకెక్కించారు (P Chandrasekhara Reddy).


ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ

ప్రముఖ టీవీ సీరియల్‌ ‘మహాభారత్‌’లో భీముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్ సోబ్తీ (Praveen Kumar Sobti). 74 ఏళ్ల ప్రవీణ్‌ ఫిబ్రవరి 7న దిల్లీ అశోక్‌విహార్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.


దీప్‌ సిద్ధూ

పంజాబ్‌ ప్రముఖ నటుడు దీప్‌ సిద్ధూ (Deep Sidhu) (37) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ నుంచి భటిండా వైపు వెళ్తుండగా హరియాణాలోని సోనిపట్‌ వద్ద ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఘటన (ఫిబ్రవరి 15)లో ఆయన మరణించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో చేరిన దీప్‌ సిద్ధూ.. గతేడాది రైతులు చేపట్టిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రైతుల ట్రాక్టర్ ర్యాలీతో  సిద్ధూ పేరు అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగింది.


బప్పి లహరి

డిస్కో పాటలతో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు బప్పి లహరి (Bappi Lahiri). హుషారైన బీట్‌లతో ఎన్నో ఏళ్లుగా కొన్ని కోట్లమంది శ్రోతల్ని అలరించిన ఈ సంగీత దిగ్గజం 69 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఫిబ్రవరి 15న మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన బప్పి చికిత్స పొందుతూనే కన్నుమూశారు.


కేకే

‘ఫీల్‌ మై లవ్‌’, ‘గుర్తుకొస్తున్నాయి’, ‘చెలియ చెలియ’ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలతో తెలుగు శ్రోతలను మెప్పించిన గాయకుడు కృష్ణకుమార్‌ కున్నథ్‌ (KK) (కేకే) మే 31 మరణించారు. ఆయన (Krishnakumar Kunnath) ఆకస్మిక మరణం (53 ఏళ్ల వయసులో) అందరినీ కలచివేసింది. కోల్‌కతాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆయన చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కానీ, దాన్ని నమ్మని పలు రాజకీయ పార్టీలు కేకే మృతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.


లతా మంగేష్కర్‌

భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిలగా పేరొందిన లతా మంగేష్కర్‌ (92) ఫిబ్రవరి 6న కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో కొవిడ్‌ బారిన పడిన ఆమె (Lata Mangeshkar) కోలుకున్నా వయసురీత్యా ఆరోగ్యం క్షీణించింది. దాంతో, మరోసారి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూనే ఫిబ్రవరిలో మరణించారు.


తెలుగు సినీ గేయ రచయిత కందికొండ (49) ఆరోగ్యం క్షీణించడంతో మార్చి 12న మృతి చెందారు. ‘మళ్లీకూయవే గువ్వ’, ‘మధురమే మధురమే’, ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ తదితర హిట్‌ గీతాలు ఈయన కలం నుంచి జాలువారినవే (Kandikonda). సంగీత దర్శకుడు ఎప్పీ ఈశ్వర్‌రావు  (63) అనారోగ్యంతో చెన్నైలో మార్చి 12న మరణించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకు సంగీత సహకారం అందించిన ఈయన ‘అంతఃపురం’, ‘శుభలేఖ’, ‘జీవితం’సహా పలు ఈటీవీ సీరియళ్లకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు (SP Eshwar Rao). ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘ఆది’, ‘ప్రేమకావాలి’సహా 40కిపైగా చిత్రాలు, 10కిపైగా ధారావాహికల్లో నటించిన కొంచాడ శ్రీనివాస్‌ (47) అనారోగ్యంతో మరణించారు ( Konchada Srinivas).


పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ కొవిడ్‌ కారణంగా 90 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 15న మరణించారు. ఎన్నో బెంగాలీ, హిందీ చిత్రాల్లో పాటలు పాడిన సంధ్యా ముఖర్జీ పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు (Sandhya Mukherjee). మలయాళీ సీనియర్‌ నటి కేపీఏసీ లలిత (73) ఫిబ్రవరి 22న గుండెపోటుతో మరణించారు. ఐదు దశబ్దాలపాటు తల్లి, సోదరి, కోడలు, కుమార్తె ఇలా పలు సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించారు (KPAC Lalitha). 70కిపైగా సినిమాల్లో నటించిన మలయాళీ నటుడు  కొట్టాయం ప్రదీప్‌ (61) గుండెపోటుతో ఫిబ్రవరి 17న కన్నుమూశారు. ‘రాజా రాణి’, ‘ఏమాయ చేశావె’ తదితర చిత్రాల్లోని పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు (Kottayam Pradheep).


టాలీవుడ్‌ రచయిత, దర్శకుడు మదన్‌ (Madan) బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే నవంబరు 19న మరణించారు. ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా తన ప్రతిభ నిరూపించుకొని.. ‘పెళ్లయిన కొత్తలో’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ‘గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’, ‘కాఫీ విత్ మై వైఫ్’, ‘గరం’, ‘గాయత్రి’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 

నిర్మాత, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణదాస్‌ నారంగ్‌ (76) తీవ్ర అస్వస్థతతో ఏప్రిల్‌ 19న తుదిశ్వాస విడిచారు (Narayan Das Narang). ఈయన శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘లవ్‌స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. సీనియర్‌ హిందీ నటుడు విక్రమ్‌ గోఖలే (77) (Vikram Gokhale) నవంబరు 26న అనారోగ్యంతో మృతి చెందారు.

* బాలీవుడ్‌ నటులు దీపేశ్‌ భాన్‌ (41), రాజు శ్రీవాత్సవ (58), సిద్దాంత్‌ వీర్‌ సూర్యవంశీ (26) గుండెపోటుతో మరణించారు.

*టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వల్లభనేని జనార్దన్‌ (63) డిసెంబర్‌ 29న కన్నుమూశారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని