Tollywood: చిరంజీవి అధ్యక్షతన తెలుగు సినీ ప్రముఖుల భేటీ! ఎందుకంటే..?

తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై పరిశ్రమ పెద్దలతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.

Updated : 16 Aug 2021 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై పరిశ్రమ పెద్దలతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి అధ్యక్షతన తెలుగు సినిమా ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రితో భేటీ కానున్న నేపథ్యంలో ఆయనతో ఏం మాట్లాడాలి, ఏ అంశాలు ప్రస్తావించాలి అనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు, దిల్‌రాజు, వి.వి.వినాయక్‌, కొరటాల శివ, మెహర్‌ రమేశ్‌, ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన కొత్త జీవో విషయంలో దర్శకనిర్మాతలు విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ జీవో అమలును పునరాలోచించడంతో పాటు టికెట్‌ ధరలు, ఇతర సమస్యలను భేటీ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించనున్నారు. కరోనా వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఇండస్ట్రీని ఆదుకోవాలని కోరడంతో పాటు రాయితీలు కల్పించాలని కోరే అవకాశం ఉంది.

ఈ భేటీలో కార్యక్రమంలో ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, కె.ఎస్.రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్,  స్రవంతి రవికిశోర్, సి.కళ్యాణ్, ఎన్వీ ప్రసాద్, జెమిని కిరణ్, సుప్రియ, భోగవల్లి బాబీ, యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ తదితరులు పాల్గొన్నారు. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు కూడా ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిపై సానుకూల వాతావరణం వచ్చేలా అందరూ కలిసి చర్చించుకోవాలని ఈ సందర్భంగా తీర్మానించారు. అలాగే పరిశ్రమలోని వివిధ విభాగాల్లో ఎదుర్కొంటున్న  సమస్యల గురించి కూలంకుషంగా చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని