Tollywood: కొత్త కెరటాలపై కెప్టెన్ల చూపు

కొత్తతరంతోనే ఓ కొత్త కథ చెప్పాలనే ప్రయత్నమో లేక... స్టార్‌ హీరోలతో సినిమా చేసే పరిస్థితులు లేకపోవడమో... కారణాలేమైనా పలువురు సీనియర్‌ దర్శకులు ఇప్పుడు నవతరం కథానాయకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.

Updated : 07 Jul 2024 05:52 IST

కొత్తతరంతోనే ఓ కొత్త కథ చెప్పాలనే ప్రయత్నమో లేక... స్టార్‌ హీరోలతో సినిమా చేసే పరిస్థితులు లేకపోవడమో... కారణాలేమైనా పలువురు సీనియర్‌ దర్శకులు ఇప్పుడు నవతరం కథానాయకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. వై.వి.ఎస్‌.చౌదరి, తేజ, గుణశేఖర్, కృష్ణవంశీ తదితర సీనియర్‌ దర్శకులు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. వీళ్లంతా ఒకప్పుడు ఆ తరహా ప్రయత్నాలు చేసి ఫలితాల్ని అందుకున్నవాళ్లే. మరోసారి ఆ మ్యాజిక్‌ చూపించే ప్రయత్నాల్లో ఉన్నారు.

పేరున్న హీరోల చేతినిండా ఇప్పుడు స్క్రిప్టులే. వాళ్ల కోసం మరింత మంది దర్శకులు వరసలో ఉన్నారు. కరోనా తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సినిమాల రూపకల్పన, వాటి వ్యాపారం ఇదివరకటిలా చకచకా పూర్తి కావడం లేదు. దాంతో కథానాయకులు ఒకొక్క ప్రాజెక్ట్‌పై ఏళ్లకు ఏళ్లు గడపాల్సి వస్తోంది. దాంతో దర్శకులు కూడా అదే తరహాలోనే హీరోల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పరిణామాలతోనే పలువురు కెప్టెన్లు ప్రత్యామ్నాయంగా కొత్తతరంతో సినిమాలు తీయడం కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ ఏడాదే పాన్‌ ఇండియా సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న ఓ యువ దర్శకుడు... పలువురు హీరోల కోసం కథలు సిద్ధం చేసుకుని వినిపించినా, అవి ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితులు కనిపించకపోవడంతో ఓ స్టార్‌ వారసుడి పరిచయం కోసం స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. వై.వి.ఎస్‌.చౌదరి, గుణశేఖర్‌ తదితర దర్శకులు కూడా ఇప్పటికే కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించారు. 

నవతరం తారాగణంతో సినిమాలు తీయడంలోనూ... విజయాల్ని అందుకోవడంలోనూ ముందున్న దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’... ఇలా ఆయనకి మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ‘రేయ్‌’తో సాయి దుర్గా తేజ్‌నీ పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన్నుంచి మరో సినిమా రాలేదు. ఇటీవలే నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ తనయుడు ఎన్టీఆర్‌ని పరిచయం చేస్తూ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.

‘రామాయణం’తో పలువురు నటుల్ని పరిచయం చేసి తనదైన ప్రత్యేకతని ప్రదర్శించిన మరో సీనియర్‌ దర్శకుడు గుణశేఖర్‌ కూడా ‘యుఫోరియా’ పేరుతో ఓ చిత్రాన్ని తీస్తున్నట్టు ప్రకటించారు. యూత్‌ఫుల్‌ డ్రామాతో కొత్తతరం తారాగణంతో ఈ చిత్రం రూపొందనుంది.

కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ, సంచలన విజయాల్ని సొంతం చేసుకున్న మరో సీనియర్‌ దర్శకుడు తేజ. ‘చిత్రం’ మొదలుకొని మొన్నటి ‘అహింస’ వరకూ ఆయన స్కూల్‌ నుంచి వచ్చిన కథానాయకులు ఎంతోమంది. త్వరలోనే ఆయన తనయుడిని తెరకు పరిచయం చేయనున్నట్టు సమాచారం. రానా దగ్గుబాటి కథానాయకుడిగా ‘రాక్షస రాజా’ అనే సినిమాని ప్రకటించినా, అది పట్టాలెక్కడానికి సమయం పడుతుందని సమాచారం. అందుకే తేజ తన తనయుడు అమితోవ్‌ తేజని పరిచయం చేస్తూ ఓ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు  తెలుస్తోంది.

‘రంగమార్తాండ’తో ఫామ్‌లోకి వచ్చిన కృష్ణవంశీ... మూడు జంటల నేపథ్యంలో ఓ కథని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో అగ్ర కథానాయకులతోపాటు... యువ హీరోలతోనూ సినిమాలు చేసి విజయాల్ని అందుకున్న ట్రాక్‌ రికార్డ్‌ కృష్ణవంశీ సొంతం. వీళ్లంతా ఇదివరకటిలా మ్యాజిక్‌ని పునరావృతం చేస్తే, ఆయా సినిమాలతో కొత్త ప్రతిభ వెలుగులోకి రావడం ఖాయం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు