Tollywood: అడివి శేష్‌ భావోద్వేగం.. విడుదల ఖరారైన ‘సీతారామం’.. ‘విక్రాంత్‌ రోణ’ గీతం

యువ నటుడు అడివి శేష్‌ భావోద్వేగానికి గురయ్యాడు. దుల్కర్‌ సల్మాన్‌ తన కొత్త చిత్రం విడుదల తేదీ ఖరారు చేశాడు. కిచ్చా సుదీప్‌ తన సినిమాలోని ఓ పాటను అభిమానులతో పంచుకున్నాడు. ఆ సినిమాల వివరాలివీ.. 

Updated : 25 May 2022 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు అడివి శేష్‌ భావోద్వేగానికి గురయ్యాడు. దుల్కర్‌ సల్మాన్‌ తన కొత్త చిత్రం విడుదల తేదీ ఖరారు చేశాడు. కిచ్చా సుదీప్‌ తన సినిమాలోని ఓ పాటను అభిమానులతో పంచుకున్నాడు. ఆ సినిమాల వివరాలివీ.. 


భారత్‌ మాతాకీ జై

26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో శశి కిరణ్‌ తిక్కా ఈ చిత్రాన్ని రూపొందించారు.  విడుదలకు ముందే ఈ చిత్రాన్ని కొన్ని నగరాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్‌ షో పుణెలో తొలిసారి మంగళవారం ప్రదర్శితమైంది. ఈ స్క్రీనింగ్‌లో చోటుచేసుకున్న ఉద్విగ్న దృశ్యాల్ని శేష్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశాడు. ఈ సినిమా తనకు నచ్చడంతో కమాండో శివ్‌రాజ్‌ శేష్‌కు థ్యాంక్స్‌ చెప్పగా అక్కడున్న వారంతా ‘భారత్‌ మాతాకీ జై’ నినాదంతో హోరెత్తించారు. కమాండ్‌ను హగ్‌ చేసుకుని శేష్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది.

సీతారామం ఆగమనం ఆరోజే

దుల్కర్‌ సల్మాన్, మృణాళిని ఠాకూర్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. అశ్వినీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌, సీత పాత్రలో మృణాళిని, అఫ్రీన్‌గా రష్మిక కనిపించనున్నారు. 

విక్రాంత్‌ రోణ స్పెషల్‌ సాంగ్‌

కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన త్రీడీ సినిమా ‘విక్రాంత్‌ రోణ’. అనుప్‌ భండారి దర్శకుడు. జాక్‌ మంజునాథ్‌, శాలిని మంజునాథ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘రా రా రక్కమ్మ’ అంటూ సాగే ఈ హుషారైన గీతాన్ని సుదీప్‌, జాక్వెలిన్‌పై చిత్రీకరించారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను మంగ్లీ, నకాశ్‌ అజీజ్‌ ఆలపించారు. బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని