Tovino Thomas: ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ఉంది: టోవినో థామస్‌

2018 సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో శనివారం వేడుకగా జరిగింది. 

Updated : 27 May 2023 16:45 IST

హైదరాబాద్‌: టోవినో థామస్‌ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘2018’ (2018 Movie). జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకుడు. కేరళ వరదలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు దీన్ని తెలుగులో శుక్రవారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో టోవినో మాట్లాడుతూ అవకాశం వస్తే తప్పకుండా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో మల్టీ స్టారర్‌ చేస్తానని చెప్పారు.

‘‘కాలేజీలో చదువుతున్న రోజుల్లో రామోజీ ఫిలింసిటీ టూర్‌ కోసం 2009లో మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. నటుడిని అయ్యాక పలు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి వచ్చాను. కాకపోతే సినిమా ప్రమోషన్‌ కోసం మొదటిసారి ఇక్కడికి రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను నటించిన సినిమాలు విడుదలైన ప్రతిసారీ తెలుగులో డబ్‌ చేయమంటూ ఎంతోమంది సందేశాలు పంపించేవారు. 2018 వరదలు మాకు పీడకల. ఆ పీడకలను డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా అనుకుని, ఎంతో కష్టపడి సినిమాని తెరకెక్కించాం. విడుదలైన ప్రతిచోటా మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నాకు అప్పటి రోజులు గుర్తుకువచ్చాయి. ఆ వరదల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది డబ్బులు, నివాసాలు కోల్పోయారు. నాటి రోజులకు సంబంధించి ప్రతి ఒక్కరి వద్ద ఒక కథ ఉంది. వాటన్నింటితో వెబ్‌ సిరీస్‌ చేస్తే మూడు సీజన్లు విడుదల చేయొచ్చు. మిగిలిన భాషా హీరోలతోనూ సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అంటే నాకెంతో ఇష్టం. వారితో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.’’ అని టోవినో పేర్కొన్నారు. అనంతరం నటి అపర్ణా బాలమురళీ, దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ మాట్లాడుతూ.. తమ చిత్రాన్ని ఆదరించిన తెలుగు సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని