Pongal Movies: సంక్రాంతి సినిమాల ట్రైలర్లు.. తెలుగులో ఆ రెండింటిదే హవా.. మీకేది నచ్చింది?

‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘తెగింపు’, ‘వారసుడు’.. ఈ నాలుగు ట్రైలర్లు ప్రేక్షకులను అలరించాయి. అత్యధిక వ్యూస్‌ దేనికి వచ్చాయి? సినిమాలు ఎప్పుడు విడుదలంటే?

Updated : 08 Jan 2023 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సాఫీసు వద్ద సంక్రాంతి సందడి అతి త్వరలోనే మొదలవ్వబోతోంది. తమిళ హీరోలు విజయ్‌, అజిత్‌ల డబ్బింగ్‌ చిత్రాలతో హంగామా ప్రారంభమై.. ఆ తర్వాత టాలీవుడ్‌ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలతో మరింత జోష్‌ పెరగనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాలపై ఆసక్తి, అంచనాలను పెంచాయి. చిరు, బాలయ్య సినిమాల ట్రైలర్లు తెలుగులో హవా కొనసాగిస్తుండగా విజయ్‌, అజిత్‌ చిత్రాల ట్రైలర్లు తమిళంలో రికార్డు స్థాయి వ్యూస్‌ దక్కించుకున్నాయి. ఏ ట్రైలర్‌ ఎన్ని వీక్షణలు సొంతం చేసుకుందంటే?

తునివు.. ఫస్ట్‌ అండ్‌ హయ్యస్ట్‌

పొంగల్‌కు రానున్న పెద్ద చిత్రాలకు సంబంధించి అజిత్‌ (Ajith) ‘తునివు’ (Thunivu) ట్రైలర్‌ ముందుగా విడుదలైంది. 2022 డిసెంబరు 31 రిలీజ్‌ అయిన ఈ తమిళ ట్రైలర్‌ను ఇప్పటి వరకూ 57 మిలియన్‌కుపైగా (5 కోట్ల 70 లక్షలకుపైగా) ప్రేక్షకులు వీక్షించారు. అయితే, ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ (తెలుగులో తెగింపు అనే టైటిల్‌) వ్యూస్‌ రాబట్టడంలో వెనకబడిపోయింది. జనవరి 2న విడుదలైన ‘తెగింపు’ (Tegimpu) ట్రైలర్‌ సుమారు 17 లక్షల వ్యూస్‌కే పరిమితమైంది. అజిత్‌ స్టైలిష్‌ లుక్‌, నేపథ్య సంగీతం, హీరోహీరోయిన్లు చేసే గన్‌ ఫైరింగ్‌ దృశ్యాలు ట్రైలర్‌లో ప్రధానాకర్షణ. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన హై ఓల్టేజ్‌యాక్షన్‌ చిత్రం జనవరి 11న విడుదలకానుంది (Thunivu trailer).


ఒకే రోజు విడుదల..

విజయ్‌ (Vijay) హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారిసు’ (Varisu). తెలుగులో ‘వారసుడు’ (Varasudu) పేరుతో రాబోతుంది. ఈ సినిమాని జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సందర్భంగా చిత్ర బృందం జనవరి 4న గంటల వ్యవధిలో రెండు ట్రైలర్‌లను (తమిళం, తెలుగు) విడుదల చేసింది. వాటిల్లో తమిళ ట్రైలర్ 39 మిలియన్లకుపైగా (3 కోట్ల 90 లక్షలకుపైగా) వీక్షణలు సొంతం చేసుకోగా తెలుగు ట్రైలర్‌ 5.9 మిలియన్‌ (59 లక్షలు) వ్యూస్‌ దక్కించుకుంది. కలర్‌ఫుల్‌ లొకేషన్స్‌, ఫ్యామిలీ ఎమోషన్‌, హీరో విజయ్‌- విలన్‌ ప్రకాశ్‌రాజ్‌ల మధ్యసాగే మాటల వార్‌ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి (Varisu Trailer).


వీరసింహారెడ్డిది ఫ్యాక్షన్‌కాదు..

‘నాది ఫ్యాక్షన్‌ కాదు.. సీమ మీది ఎఫెక్షన్‌’, ‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే నేనొక్కడిని కత్తి పట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమే కాదు ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత’ అంటూ బాలకృష్ణ (Balakrishna) చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ట్రైలర్‌ నిండిపోయింది. ఇలాంటి ఎన్నో సంభాషణలు, ఫైట్‌ సీక్వెన్స్‌, హీరో లుక్స్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పాత్ర ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. జనవరి 6న విడుదలైన ఈ ట్రైలర్‌ను ఇప్పటి వరకూ 12.3 మిలియన్లకుపైగా (కోటి ఇరవైమూడు లక్షలు) మంది చూశారు.  గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది (Veera Simha Reddy Trailer).


ఒక్క రోజు లేట్‌ అయినా..

చిరంజీవి (Chiranjeevi) హీరోగా కె. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya).. ‘వీరసింహారెడ్డి’ కంటే ఒక రోజు ఆలస్యంగా (జనవరి 13న) విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్లూ ఒక్క రోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. జనవరి 7న వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌ ఇప్పటి వరకూ 11.6 మిలియన్లకుపైగా (కోటి 16 లక్షలు) వ్యూస్‌ దక్కించుకుంది. ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు. నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయ్‌’ వంటి పంచ్‌ డైలాగ్స్‌, పోరాట దృశ్యాలు, చిరు వింటేజ్‌ లుక్‌, హీరో ఎలివేషన్‌ షాట్స్‌, ‘ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోండి’ అంటూ చిరు పాత సినిమాలోని డైలాగ్‌ను రవితేజ చెప్పడం.. ‘ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, ఇక్కడ వీరయ్య లోకల్‌’ అని రవితేజ ‘ఇడియట్‌’ డైలాగ్‌ను చిరు గుర్తు చేయడం.. ఇలా ట్రైలర్‌లోని ప్రతిదీ సినీ అభిమానులను మెప్పించింది (Waltair Veerayya Trailer). ఇంతకీ, మీకు ఏ ట్రైలర్‌ నచ్చింది?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు