దీపిక పదుకొణె స్థానంలో త్రిష... నిజమేనా?

₹100 కోట్ల సినిమాలో దీపిక స్థానంలో త్రిష నటించబోతోందా?

Published : 27 Nov 2020 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో హిట్‌ కొట్టిన సినిమాల్ని తెలుగులోకి తీసుకురావడం పెద్ద కొత్తేమీ కాదు. అయితే ఐదేళ్ల క్రితం నాటి హిట్‌ సినిమాను ఇప్పుడు దక్షిణాది భాషల్లో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతుండటం విశేషం.  అంతేకాదు అందులో వెటరన్‌ నాయిక త్రిష ప్రధాన పాత్రలో నటించోతోందట. అంత ఇంట్రెస్టింగ్‌ సినిమా ఏంటి అనుకుంటున్నారా... అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘పీకూ’. తండ్రీ కూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్‌లో మంచి ఆదరణ వచ్చింది. ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

‘పీకూ’ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించేందుకు ఓ ప్రముఖ సంస్థ హక్కులు తీసుకుందట. ఇందులో కథానాయిక పాత్ర కోసం త్రిషను సంప్రదించారని, అందుకు ఆమె సుముఖంగా ఉన్నారనీ తెలుస్తోంది. హిందీ మాతృకలో ఆ పాత్రను దీపిక పదుకొణె పోషించిన విషయం తెలిసిందే. అయితే సినిమా ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఇతర ప్రధాన పాత్రధారులు ఎవరు అనే విషయంలో సమాచారం లేదు. ఓ రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇర్ఫాన్‌ ఖాన్‌ మరో ప్రధాన పాత్రధారి. అమితాబ్‌, దీపిక, ఇర్ఫాన్‌ మధ్యనే ఈ సినిమా నడుస్తుంది. 

తెలుగులో ‘పీకూ’ రీమేక్‌ చేస్తారని గతంలో కూడా వార్తలొచ్చాయి. అప్పుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ పాత్రలో విజయాన్ని ఇంటి పేరుగా మలుచుకున్న ప్రముఖ కథానాయకుడు నటిస్తాడనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ సినిమా ఆలోచన పట్టాలెక్కలేదు. ఈ సారైనా సినిమా మొదలవుతుందేమో చూడాలి. కోపిష్ఠి వృద్ధుడిగా అమితాబ్‌, ఉద్యోగం చేస్తూ తండ్రిని చూసుకునే యువతిగా దీపిక పదుకొణె, వారిద్దరిని కారులో గమ్యం చేర్చే డ్రైవర్‌గా ఇర్ఫాన్‌ అదరగొట్టేశారు. మరి తెలుగు/తమిళంలో ఎవరు చేస్తారో, ఎలా చేస్తారో చూడాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని