Trivikram: ఆరోజు సెట్‌ నుంచి పారిపోయా: త్రివిక్రమ్‌

‘భీమ్లానాయక్‌’ సక్సెస్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు...

Published : 27 Feb 2022 02:00 IST

హైదరాబాద్‌: ‘భీమ్లానాయక్‌’ సక్సెస్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు శనివారం జరిగిన ‘భీమ్లానాయక్‌’ సక్సెస్‌ మీట్‌లో ఆయన పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

‘‘ముందుగా మీడియాకు థ్యాంక్స్‌. నేను ఈ సినిమా తీస్తే.. మీడియా దాన్ని భుజాల మీద వేసుకుని జనాల వద్దకు తీసుకువెళ్లింది. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ పాదాభివందనం. ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ను తెలుగులోకి తెరకెక్కించాలని మొదట అనుకున్నప్పుడు.. మాకు కనిపించిన పెద్ద సమస్య ఏమిటంటే.. మాతృకలో మొత్తం కథ కోషియం (తెలుగులో డేనియల్‌ శేఖర్‌) వైపు నుంచే ఉంటుంది. కానీ దాన్ని తెలుగువారికి అనుగుణంగా ‘భీమ్లానాయక్‌’ వైపు నుంచి ఎలా చెప్పాలి? ఇద్దరి పాత్రలను  బ్యాలెన్స్‌డ్‌గా ఎలా చూపాలి? అనే దానిపై ఎన్నోసార్లు చర్చించుకున్నాం. అప్పుడు మాకు తట్టిన ఆలోచన.. అడవికి సెల్యూట్‌ చేయడం నుంచి ప్రారంభించి.. ‘భీమ్లానాయక్‌’ క్యారెక్టర్‌కు దగ్గరగా కథను తీసుకువెళ్తే.. న్యాయం చేయగలమనిపించింది. పవన్‌ ఇమేజ్‌ని.. అభిమానులు ఏం కోరుకుంటారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సీన్‌ని సహజంగా ఉండేలా క్రియేట్‌ చేశాం. ఈ సినిమా కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి చూస్తుంటే.. 1980 కాలం నాటి నటీనటులతో పోల్చితే ఇండియన్‌ న్యూ జనరేషన్‌ నటీనటులు ఎంతో టాలెంట్‌ ఉన్న వ్యక్తులు అని అర్థమవుతోంది. ఈ స్టేట్‌మెంట్‌తో ఎవరైనా బాధపడితే క్షమించండి. కానీ ఇప్పటితరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతివిషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. గణేశ్‌ మాస్టర్‌ స్టెప్పులు బాగా కంపోజ్‌ చేశారు. సుమారు 600 మందితో సాంగ్‌ షూట్‌ చేయడం సాధారణ విషయం కాదు. ఆ సాంగ్‌ షూట్‌ జరుగుతున్న సమయంలో సెట్‌లోకి వెళ్లగానే అక్కడ అంతమంది జనాన్ని చూసి నేను పారిపోయా. ఆయన 3 రోజుల్లోనే సాంగ్‌ చేశారు’’

‘‘సాగర్‌..ఈ కథని ఎంతగానో అర్థం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఆయన వెంటే మేమున్నాం. ఆయనకు వచ్చిన ఐడియా ప్రకారమే మొగిలయ్యతో పాట పాడించాం. ఆతర్వాత ఆయనకు పద్మశ్రీ రావడం.. మకెంతో ఆనందాన్ని ఇచ్చింది. వీళ్లతోనే వర్క్‌ చేయించాలని మేము ఎప్పుడూ అనుకోలేదు..  పరిస్థితులు అలా కుదిరాయి. అలా ఎంతోమంది కళాకారులు ఈ సినిమాలో భాగమయ్యారు. కొవిడ్‌ సమయంలో పవన్‌-రానా  ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పనిచేశారు. ఇక తమన్‌ నా కుటుంబసభ్యుడిలా పనిచేస్తాడు. నేను కథ చెప్పగానే పాటలిచ్చేస్తాడు. అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు’’ - త్రివిక్రమ్‌

‘‘సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు అతనొక మెయిన్‌ సోల్‌. ఈ ప్రాజెక్ట్‌ బ్యాక్‌బోన్‌.. త్రివిక్రమ్‌. ఒక పువ్వుల దండలో మేమంతా పువ్వులమైతే మమ్మల్ని అందర్నీ కలిపిన దారం ఆయనే. మొదటిరోజు ఆయన్ని కలిసినప్పుడు.. నిడివి గురించి మాట్లాడుకున్నాం. దీన్ని రీమేక్‌ అని మర్చిపోయి.. మన సినిమా రీమేక్స్‌ రైట్స్‌ వేరొకరు కొనేలా చేద్దామని అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో నేర్చుకున్నా’’ - సాగర్‌.కె.చంద్ర


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని