Trivikram: రూ.28తో త్రివిక్రమ్‌ చేసిన పనికి సునీల్ షాక్‌.. !

తన రచన, దర్శకత్వం శైలితో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ డైరెక్టర్‌ అయ్యారు త్రివిక్రమ్‌ (Trivikram). ఆయన రాసే ప్రతి డైలాగ్‌, తీసే ప్రతి షాట్‌ ఎప్పుడూ ప్రత్యేకమే.

Updated : 21 Jun 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన రచన, దర్శకత్వ శైలితో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ డైరెక్టర్‌ అయ్యారు త్రివిక్రమ్‌ (Trivikram). ఆయన రాసే ప్రతి డైలాగ్‌, తీసే ప్రతి షాట్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక కమెడియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, కథానాయకుడి స్థాయికి ఎదిగారు నటుడు సునీల్‌ (sunil). ఒకప్పుడు వీరిద్దరూ ఒకే రూమ్‌లో ఉంటూ సినిమా అవకాశాల కోసం కలిసి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రోజు త్రివిక్రమ్‌ చేసిన పనికి సునీల్‌ షాకయ్యారట. డబ్బు.. భయం అనే విషయాల గురించి ఓ సందర్భంలో త్రివిక్రమ్‌ చెబుతూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

‘‘సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో నేనూ సునీల్‌ లక్డీకపూల్‌లో ఒక రూమ్‌లో అద్దెకు ఉండేవాళ్లం. డబ్బుల్లేక అద్దె కట్టకపోవడంతో రూమ్‌ ఖాళీ చేసేయమని ఓనర్‌ చెప్పాడు. అప్పుడు నా జేబులో 28 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాధారణ ఎవరి దగ్గరైనా రూ.20, రూ.25, రూ.30 ఇలా ఉంటాయి. కానీ, నా దగ్గర రూ.28 మాత్రమే ఉన్నాయి. అందుకు కారణం అప్పుడు నేను సిగరెట్లు కాల్చేవాడిని. రెండు సిగరెట్లు కాలిస్తే, రూ.2 అయిపోయాయి. దీంతో మా దగ్గర ఉన్న రూ.28తో మరుసటి రోజు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఎలా తక్కువ డబ్బులతో తినాలా? అని సునీల్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. అప్పుడే మార్కెట్‌లోకి కొత్తగా కూల్‌డ్రింక్‌ టిన్స్‌లో రావటం మొదలైంది. సునీల్‌ లెక్కలు వేస్తుండగానే ఆ రూ.28 తీసుకుని నేను వెళ్లి దాన్ని కొనేశా. అది చూసి సునీల్‌ షాకైపోయాడు. ‘మొత్తం డబ్బులు పెట్టి కూల్‌డ్రింక్‌ కొనేశావేంటి? రేపు ఎలా తింటాం’ అన్నాడు. ‘డబ్బు లేదని రేపటి నుంచి ఆలోచించటం దేనికి.. ఇప్పటి నుంచి ఆలోచిద్దాం రా’ అన్నాను’’ అంటూ ఆనాడు జరిగిన సంఘటనను పంచుకున్నారు త్రివిక్రమ్‌. మనిషి భయపడుతున్నప్పుడు దారులు ఉన్నా కనిపించవని, విషమ పరిస్థితుల్లో కాస్త కంగారుపడటంలో తప్పులేదు కానీ, భయపడకూదని అన్నారు. అలా భయపడటం కన్నా ధైర్యంగా ముందడుగు వేస్తే, దేనినైనా అధిగమించవచ్చని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు సునీల్‌ గతంలో మాదిరిగా తనదైన కామెడీ పాత్రలతో అలరిస్తున్నారు. ఒకప్పుడు విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్‌ అనుకోకుండా కమెడియన్‌ అయ్యారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఉన్న ప్రతినాయకుల్లో ఒకరిగా మంగళం శ్రీను పాత్రలో అదరగొట్టారు. ‘పుష్ప2’ (Pushpa2) లో మంగళం శ్రీను పాత్ర మరింత బలంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు