Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కోసం మరో యంగ్‌ డైరెక్టర్‌.. త్రివిక్రమ్‌ కథతో

పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించే బాధ్యతను యంగ్‌ డైరెక్టర్‌కు ఇవ్వనున్నారు త్రివిక్రమ్‌. ఆయన ఎవరంటే?

Published : 20 Mar 2023 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) ప్రస్తుతానికి నేరుగా సినిమా తీయకపోయినా.. పవన్‌ నటించే ఇతర చిత్రాలకు స్క్రీన్‌ప్లే, మాటలు తదితర వ్యవహారాలు చూస్తున్నారు. పవన్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ సాగర్‌ కె. చంద్ర తెరకెక్కించిన ‘భీమ్లా నాయక్‌’కు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లేతోపాటు ఓ పవర్‌ఫుల్‌ సాంగ్‌ రాసిన సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న #PKSDT (వర్కింగ్‌ టైటిల్‌)కీ ఆయన వర్క్‌ చేస్తున్నారు. మరోవైపు, పవన్‌ కోసం తాను ఓ కథను సిద్ధం చేసి.. దాన్ని తెరకెక్కించే బాధ్యతను మరో యువ దర్శకుడికి ఇవ్వనున్నారు. ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు ‘స్వామిరారా’ ఫేం సుధీర్‌ వర్మ (Sudheer Varma).

తన తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura) ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్‌ ఆ విషయాన్ని తెలిపారు. ‘‘గతంలో నేను తీసిన ‘కేశవ’ చిత్రం నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్‌కి నచ్చింది. ఓ రోజు ఫోన్‌ చేసి దాని గురించి నాతో మాట్లాడారు. కొన్నాళ్ల తర్వాత, త్రివిక్రమ్‌ తాను ఓ కథా పాయింట్‌ను నాకు చెప్పి, దానిపై సినిమా చేయాలన్నారు. పవన్‌ కల్యాణ్‌కు తాను చెప్పిన ఐడియా నచ్చిందన్నారు. సినిమా ఎప్పుడుంటుందనే సమాచారాన్ని తెలియజేస్తానని చెప్పారు’’ అని సుధీర్‌ వివరించారు.

పవన్‌ ఖాతాలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), సముద్రఖని రూపొందిస్తున్న ‘#PKSDT’ షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఆ తర్వాత ఆయన సుజీత్‌తో ‘ఓజీ’, హరీశ్‌ శంకర్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) చిత్రాల్లో నటించనున్నారు. ఇవి పూర్తయిన తర్వాత తన డైరెక్షన్‌లో పవన్‌ నటించే అవకాశం ఉండొచ్చని సుధీర్‌ అభిప్రాయపడ్డారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావణాసుర’లో రవితేజ (Ravi Teja) కథానాయకుడు. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాలతో పవన్‌- త్రివిక్రమ్‌ కాంబో మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని