Heart attack: జిమ్‌లోనే కుప్పకూలి ప్రముఖ టీవీ నటుడు హఠాన్మరణం

ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్‌ వీర్‌ సూర్యవంశీ(Siddhaanth Vir Surryavanshi) (46) హఠాన్మరణం చెందారు. ఫిట్‌నెస్‌పై ఎంతో ఆసక్తి కలిగిన ఆయన శుక్రవారం వ్యాయామం చేస్తూ జిమ్‌లోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

Published : 12 Nov 2022 01:58 IST

ముంబయి: ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్‌ వీర్‌ సూర్యవంశీ(Siddhaanth Vir Surryavanshi) (46) హఠాన్మరణం చెందారు. ఫిట్‌నెస్‌పై ఎంతో ఆసక్తి కలిగిన ఆయన శుక్రవారం వ్యాయామం చేస్తూ జిమ్‌లోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో మధ్యాహ్నం 12.30గంటల సమయంలో హుటాహుటిన ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

‘‘సూర్యవంశీని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నం చేశారు. జిమ్‌లో ఉన్నప్పుడే బహుశా గుండెపోటు వచ్చినట్టుంది’’ అని వైద్యులు సిద్ధాంత్‌ వీర్‌ సూర్యవంశీ కుటుంబ సభ్యులకు తెలిపినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ‘కుసుమ్, కసౌటి జిందగీ కే’, జిద్దీ దిల్‌ మానే నా’ వంటి అనేక షోలలో నటించి అభిమానుల్ని మెప్పించిన సిద్ధాంత్‌.. ఆకస్మిక మరణం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆయనకు భార్య అలేసియా రౌత్‌, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా, గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలి ఇప్పటికే పలువురు నటలు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా సిద్ధాంత్‌ ఆకస్మిక మరణం చలనచిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌, సిద్ధార్థ్‌ శుక్లా, బ్రహ్మస్వరూప్‌ మిశ్రా, దీపేశ్ భాన్‌ వంటి ప్రముఖులు తమ 40ల వయసులోనే గుండెపోటుకు గురై ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోగా.. ఇటీవల ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) గుండెపోటుతో దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని