ఆ హీరో అభిమానులు: ఇద్దరూ ఇద్దరే!

ప్రతి హీరోకు అభిమానులుంటారు. హీరోలాగే దుస్తులు వేసుకొని, స్టైల్‌గా తయారవుతుంటారు. నటుల పుట్టిన రోజు, సినిమా విడుదలైన రోజు అంటే వారికి పండగే. వాళ్లు ఇష్టపడే నటుల కోసం రక్తదానం వంటి సమాజ సేవ చేస్తూ మనసున్న అభిమానులు అనిపించుకుంటారు. మరికొన్ని

Updated : 04 Dec 2020 15:28 IST


(photo:Movie World Matinee Now youtube screenshot)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి హీరోకు అభిమానులుంటారు. హీరోలాగే దుస్తులు వేసుకొని, స్టైల్‌గా తయారవుతుంటారు. నటుల పుట్టిన రోజు, సినిమా విడుదలైన నాడు వారికి పండగే. వాళ్లు ఇష్టపడే నటుల కోసం రక్తదానం వంటి సమాజ సేవ చేస్తూ మనసున్న అభిమానులు అనిపించుకుంటారు. మరికొన్ని చోట్ల ఏకంగా తమ ఆరాధ్య నటులకు ఆలయాలు నిర్మించిన ఘటనలూ ఉన్నాయి. మలయాళంలోనూ గత తరం ఒక హీరోకు చాలా మంది అభిమానులున్నారు. కానీ, వారిలో ఇద్దరు అభిమానులు మాత్రం ఎంతో భిన్నం. ఆ నటుడి కోసం ఒకరు మ్యూజియం ఏర్పాటు చేయగా.. మరొకరు ఏటా ఫిల్మ్‌ఫెస్టివల్‌ నిర్వహించడం విశేషం.

కేరళకు చెందిన రాజన్‌, శిబు.. దివంగత నటుడు జయన్‌కు వీరాభిమానులు. వీరిద్దరు వేర్వేరు చోట్లలో ఉన్నా.. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు. 1970-80కాలంలో మలయాళ సినీపరిశ్రమలో జయన్‌ స్టార్ హీరో. 1939లో కేరళలోని కొల్లంలో జన్మించిన ఆయన మొదట్లో నావికాదళంలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో స్టంట్‌మెన్‌గానూ పనిచేశారు. హీరోగా మారిన తర్వాత జయన్‌ కండలవీరుడిగా, యాక్షన్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 150కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన 1980 నవంబర్‌లో ఓ ప్రమాదంలో మృతి చెందారు. అప్పుడు రాజన్‌, శిబు పదో తరగతి చదువుతున్నారు. ఆయన మృతి వారిని తీవ్రంగా కలిచివేసింది. జయన్‌ లోకం విడిచి వెళ్లినా వారి మనసులో గూడు కట్టుకున్నారు. కాలం మారినా వారికి అతడిపై ఉన్న అభిమానం పోలేదు. 

రాజన్‌.. మ్యూజియం

కొట్టాయం జిల్లాలోని అనిక్కడ్‌కు చెందిన రాజన్‌ ఒకప్పుడు రైల్వేలో పనిచేశాడు. అనంతరం ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. ఈ స్కూల్‌లోనే తన అభిమాన నటుడు జయన్‌ కోసం మ్యూజియం ఏర్పాటు చేశాడు. చిన్నతనం నుంచి సేకరించిన జయన్‌ ఫొటోలు, పోస్టర్లు, సినిమాల్లో వివిధ వేషధారణతో ఉన్న జయన్‌ విగ్రహాలను ఏర్పాటు చేశాడు. అంతేకాదు, మ్యూజియంలో జయన్‌కు సంబంధించిన అరుదైన చిత్రాలు దర్శనమిస్తాయి. ఆయనపై పత్రికల్లో వచ్చిన వార్తలు, కథనాలు లభిస్తాయి. రాజన్‌ స్వతహాగా చిత్రకళాకారుడు కావడంతో జీవితకాలంలో ఆయన వేసిన జయన్‌ పెయింటింగ్స్‌ ఇందులో ఉన్నాయి. ఏటా జయన్‌ వర్థంతి రోజున మ్యూజియంలో ప్రత్యేకంగా ఏదైనా చేస్తుంటాడు. ఈ ఏడాది 14,600 ఆవ గింజలతో జయన్‌ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సంఖ్యకి విశేషముంది. ఈ ఏడాదితో ఆయన మరణించి 40ఏళ్లు పూర్తవుతాయి. 40 ఏళ్లకు 14,600 రోజులు ఉంటాయి. అందుకే అన్ని ఆవగింజలను ఉపయోగించినట్లు రాజన్‌ చెబుతున్నాడు. 

తన చిన్నప్పటి నుంచే జయన్‌కు అభిమానిగా మారానని, ఆయన ఫొటోను సేకరించడం అప్పుడే మొదలుపట్టానని రాజన్‌ చెప్పుకొచ్చాడు. ఆయన ఇల్లు, వాడిన కారును బుల్లిసైజులో రూపొందించినట్లు పేర్కొన్నారు. రైల్వేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తిరువనంతపురంలో తను సేకరించిన ఫొటోలు, వస్తువులు, తయారు చేయించిన విగ్రహాలతో రాజన్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాడట. దీనికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారని తెలిపాడు. జయన్‌ కుటుంబంతో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నాడు. 

శిబు.. ఫిల్మ్‌ ఫెస్టివల్‌

తిరువనంతపురంలోని పెరూర్కడకు చెందిన శిబు.. జయన్‌కు మరో అభిమాని. ఎంతలా అంటే.. స్థానికులు అతడిని ‘జయన్‌’ శిబు అని పిలుస్తుంటారట. జయన్‌ మృతి చెందినప్పుడు శిబు కూడా పదో తరగతే చదువున్నాడు. ఆ హీరో మరణించిన తర్వాతే ఆయన సినిమాలు ఎక్కవగా చూసి చూసి అభిమానిగా మారిపోయాడు. గత పదేళ్లుగా ఏటా తన ఊర్లో జయన్‌ పేరుతో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఒక చిన్న షెడ్డును అద్దెకు తీసుకొని అందులో జయన్ ఫొటోలు, ఆయన సినిమాలను ప్రదర్శిస్తున్నాడు. సినీతారలను కూడా ఆహ్వానిస్తుంటాడు. కొందరు ఈ ఫెస్టివల్‌కు హాజరవడం విశేషం. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా ఫెస్టివల్‌ నిర్వహించలేకపోతున్నానని శిబు బాధ పడుతున్నాడు. ఏటా జయన్‌ వర్థంతి రోజున 20 మంది దివ్యాంగులకు ఆర్థిక సాయం చేస్తున్నాడు. చిన్నతనంలో ఒకసారి జయన్‌ను కలిసే అవకాశం లభించినా కలవలేకపోయానని, ఇప్పటికీ ఆయన్ను కలవలేదన్న అసంతృప్తి ఉందని చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని