నిజమేనా..: ‘ఇక సినిమాలు చేయను.. రాజకీయాల్లోనే ఉంటా’: ఉదయనిధి స్టాలిన్‌..

ఇకపై తాను సినిమాలు చేయనని, పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని కోలీవుడ్‌ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ప్రకటించారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘నెంజుకు...

Updated : 15 May 2022 17:53 IST

చెన్నై: ఇకపై తాను సినిమాలు చేయనని, పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని కోలీవుడ్‌ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘నెంజుకు నిధి’ వేసవి కానుకగా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘ఆర్టికల్‌ 15’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. తన కెరీర్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉంది. ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. అయితే, సినిమాల్లో కూడా భాగం కావడం వల్ల  ప్రజాసేవపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నా. అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. నా తదుపరి చిత్రం ‘మామన్నన్‌’ తర్వాత సినిమాల్లో నటించను’’ అని ఉదయనిధి అన్నారట. ‘ఓకే ఓకే’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఉదయనిధి.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల్ని అలరించారు. గతేడాది తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన తండ్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కలిసి ప్రజలకు మరింత సేవ చేయాలని ఉందని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్‌ ఏ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. కానీ, సోషల్‌ మీడియాలో ఉదయనిధి వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని