Ott Censor: ఓటీటీ సెన్సార్‌కు యూకే ప్రభుత్వం ముసాయిదా.. అతిక్రమిస్తే రూ.2కోట్ల జరిమానా!

Ott Censor: ఓటీటీ కంటెంట్‌ను సెన్సార్‌ చేసేందుకు యూకే ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. ఇది ఆమోదం పొందితే, యూకేలో స్ట్రీమింగ్‌ అయ్యే ప్రతి కంటెంట్‌ను పర్యవేక్షిస్తారు.

Published : 29 Mar 2023 23:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినోదం పేరుతో అసభ్యపదజాలం, విచ్చలవిడి శృంగారం, మితిమీరిన హింసతో కూడిన కంటెంట్‌ను యథేచ్చగా వదిలేస్తున్నాయి ఓటీటీ వేదికలు. సృజనాత్మకత పేరుతో దర్శక-నిర్మాతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సినిమాలకు ఉన్నట్లే ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్‌షిప్‌ ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యూకే ప్రభుత్వం ఓటీటీ కంటెంట్‌ను సెన్సార్‌ చేసేందుకు ముసాయిదాను రూపొందించింది. ఇది ఆమోదం పొందితే, ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రసారమయ్యే ప్రతి కంటెంట్‌ను సెన్సార్‌ (Ott Censor) చేస్తారు. నిబంధలను అతిక్రమిస్తే 250,000 పౌండ్ల జరిమానా (మన కరెన్సీలో దాదాపు రూ.2కోట్లు) చెల్లించక తప్పదని యూకే డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ కల్చర్‌, మీడియా అండ్‌ స్పోర్ట్‌ తెలిపింది.

భారత్‌లోనూ తీసుకొస్తారా?

కరోనా తర్వాత ఓటీటీల్లో సినిమా, వెబ్‌సిరీస్‌లు చూసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 43కోట్ల మంది ఓటీటీలను చూస్తుంటే వారిలో సుమారు 12 కోట్ల మంది సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని వాటిని వీక్షిస్తున్నారు. అత్యధిక మంది యువత కావడంతో వారి లక్ష్యంగానే వెబ్‌సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అసభ్యతకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. దీనిపై గతకొంతకాలంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ (Anurag Thakur) కూడా ఘాటుగా స్పందించారు. స్వేచ్ఛ అనేది కేవలం సృజనాత్మకత కోసమేనని.. అశ్లీలతకు కాదని స్పష్టం చేశారు. అవధులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనకాడదని ముందస్తుగా హెచ్చరించారు. ఓటీటీ కంటెంట్‌ పర్యవేక్షణ, నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తోందని చెప్పారు. అయితే, ఇప్పటివరకూ ఓటీటీ కంటెంట్‌ నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. సినిమాలకు సెన్సార్‌ చేస్తున్నట్లే భారత్‌లో ఓటీటీ కంటెంట్‌ను సెన్సార్‌ చేయడానికి విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. కొన్ని ఓటీటీ సంస్థ స్వీయనియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా, అవి నామమాత్రమే.  ఓటీటీకి సెన్సార్‌షిప్‌ అమలు చేస్తే, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే కంటెంట్‌పై దీని ప్రభావం పడుతుంది. ఓటీటీ సంస్థలు, ప్రభుత్వం కలిసి కూర్చొని ఒక స్పష్టమైన అవగాహనకు వస్తే తప్ప, దీనికొక మార్గం దొరకదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు