Published : 01 Apr 2022 09:30 IST

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ ఆమె గాత్రంతోనే మొదలు..!

‘కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాలా’ పాడింది ఎవరంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: సుమారు రూ.600 కోట్ల భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ని తిరగరాస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షనల్‌ డ్రామా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌, తారక్‌ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటే నీరు (wateR)‌, నిప్పు (fiRe), యుద్ధం (waR) అని సినిమా విడుదలకు ముందు వరకూ అనుకున్నాం. కానీ, అందులో ఒక ‘R‌’కి అర్థం యుద్ధం కాదు స్టోరీ (the stoRy). రామ్‌-భీమ్‌ కలుసుకోవడానికి గల ప్రధాన కారణాన్నే ‘ది స్టోరీ’ రూపంలో సినిమా ప్రారంభంలోనే రాజమౌళి చూపించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ భాగంలో మల్లి అనే గిరిజన పాప పాడే ‘కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాలా’ అనే పాటకు సినీ ప్రియులందరూ ఫిదా అవుతున్నారు. ఆ పాట లిరికల్‌ వీడియోని విడుదల చేయమని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒరిజినల్‌గా ఆ పాట పాడిన బాల గాయని గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..!

* ప్రకృతి ఒడిలో సాగే తన బాల్యాన్ని గురించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మల్లి పాడే పాట ‘కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాలా’ను పాడింది పన్నెండేళ్ల బాల గాయని ప్రకృతి రెడ్డి.

* జులై 21, 2010 కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన ప్రకృతికి చిన్నతనం నుంచి సంగీతమంటే ఎంతో ఇష్టం. ప్రకృతి ఇష్టాన్ని గ్రహించిన ఆమె తల్లిదండ్రులు సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు.

* విద్యను అభ్యసిస్తూనే పలు సంగీత పోటీల్లోనూ ఆమె పాల్గొని తన ప్రతిభతో ఎంతోమందిని మెప్పించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీలోనూ ఆమె పాటలు పాడటం నేర్చుకుంది.

* బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే పలు రియాల్టీ షోల్లోనూ తన గాత్రాన్ని వినిపించింది. ఈటీవీలో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకృతి.. తన పాటలతో ఎస్పీ బాలుని మెప్పించింది.

* శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రసారమైన ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో పాల్గొని.. మధురమైన కీర్తనలు ఆలపించి స్వరకర్త కీరవాణి దీవెనలు పొందింది. వాణీ జయరామ్‌, సునీత, ఎస్పీశైలజ, కోటి, చంద్రబోస్‌.. ఇలా ఎంతోమంది సింగర్స్‌, సంగీత దర్శకులు, పాటల రచయితలు ఆమె పాటకు మంత్రముగ్ధులయ్యారు.

* ప్రముఖ సింగింగ్‌ రియాల్టీ షో ‘తారే జమీన్‌ పర్‌’లో పాల్గొన్న ప్రకృతి.. శంకర్‌ మహదేవన్‌ని సైతం తన టాలెంట్‌తో ఫిదా చేసింది. ఆ షోలో ఈ పాప పడిన పాటలకు శంకర్‌ మహదేవన్‌.. ఎన్నో ప్రశంసలు కురిపించారు.Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని