Kalki 2898 AD: ‘కల్కి’లో ప్రభాస్‌, కమల్‌హాసన్‌ పాత్రలకు పురాణాల రిఫరెన్స్‌ అదేనా?

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా?

Updated : 24 Jun 2024 13:11 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలో ‘కల్కి’లోని కీలక పాత్రలు వేటి  పాత్రిపదికగా తీసుకుని నాగ్‌ అశ్విన్‌ డిజైన్‌ చేసుకుని ఉంటారు? వాటి వెనుక కథ బహుశా ఇదే అయి ఉండవచ్చు..!

మహాభారతం నుంచి..

శ్రీమహా విష్ణువు పదో అవతారం ‘కల్కి’గా అవతరించే ఇతివృత్తాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రంగా తీర్చిదిద్దారు. కల్కి అవతరించడానికి ముందు అంటే, 2898 ఏడీలో జరిగే పరిణామాలతో ఫిక్షనల్‌ కథగా ఈ చిత్రం (Kalki Movie) సాగుతుంది. ఈ కథకు మహాభారతంలో అశ్వత్థామ పాత్రను కలుపుతూ డిజైన్‌ చేసుకున్నారు. భారతంలో అత్యంత శక్తిమంతమైన పాత్ర అశ్వత్థామ. దీనిని బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పోషిస్తున్నారు. నుదుటున మణితో పుట్టిన ఆయనకు ఆకలి దప్పులు, మరణం లేవు. ఉత్తర గర్భాన్ని విచ్ఛిత్తి చేసిన కారణంగా కృష్ణుడి శాపం ఇవ్వడంతో శారీరక రోగాలతో బాధపడుతూ కలియుగాంతం వరకూ జీవించాల్సి వస్తుంది. అయితే, ‘కల్కి’ అవతార ఆవిర్భావానికి అశ్వత్థామ సాయం ఏంటనేది ఆసక్తిగా చూపించనున్నారు. గర్భిణి అయిన దీపిక పదుకొణె పాత్రను కాపాడటం కోసం అశ్వత్థామ పోరాటం చేస్తున్నాడన్నది ప్రచార చిత్రాల ద్వారా అర్థమవుతోంది.


శివుడి అంశ భైరవుడు

ప్రభాస్‌ (Prabhas) ఇందులో భైరవ అనే బౌంటీ హంటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను కూడా పురాణాల నుంచి తీసుకుని డిజైన్‌ చేసుకున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. భైరవుడు అంటే శివుడి అంశ. ఆయన ఆవిర్భావం కూడా విచిత్రంగా ఉంటుంది. పరమ శివుడికి ఐదు ముఖాలు (తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన) ఉంటాయి. బ్రహ్మ దేవుడికి కూడా ఒకప్పుడు ఐదు ముఖాలు ఉండేవి. శివుడి మాదిరిగానే తనకూ ఐదు తలలు ఉన్నాయని, తాను పరబ్రహ్మంతో సమానమని ఎవరినీ లెక్క చేయకుండా గర్వం తలలకెక్కి అహంకరించాడు. ఒకరోజు నిండు సభలో పరమశివుడిని తన కాళ్లకు నమస్కారం చేయమని అడిగాడు. అప్పుడు శివుడి అంశ నుంచి ఆయనలా ఉండే భైరవుడు పుట్టి, బ్రహ్మ ఐదో తలను తన చేతి వేళ్లతో గిల్లేశాడు. ఆ గిల్లేసిన తల భైరవుడి చేతికి అంటుకుంది. దానిని వదిలించుకునేందుకు లోకాలన్నీ తిరిగినా సాధ్యం కాలేదు. చివరకు శ్రీమహావిష్ణువు సూచన మేరకు కాశీకి రాగానే చేతికి అంటుకున్న తల కిందపడి ముక్కలైంది. వెంటనే ప్రత్యక్షమైన కాశీ విశ్వనాథుడు భైరవుడిని ఆ క్షేత్రానికి పాలకుడిగా చేశాడు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు, యానిమేషన్‌ సిరీస్‌ చూస్తే భైరవకు కాశీ ఆనుపానులు మొత్తం తెలుసు. కాశీలో ఉండే ప్రతి ఒక్కరికీ భైరవతో పరిచయమే అన్నట్లు ‘భైరవ అండ్‌ బుజ్జి’ యానిమేషన్‌ సిరీస్‌లోనూ చూపించారు. అశ్వత్థామలాంటి శక్తిమంతమైన వ్యక్తిని కూడా ఎదుర్కొనే బలమున్న పాత్రగా దాన్ని నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తీర్చిదిద్దారు. కాంప్లెక్స్‌కు వెళ్లడమే భైరవ లక్ష్యంగా చూపించినా, పుట్టబోయే ‘కల్కి’ని రక్షించే వ్యక్తిగానూ మారే అవకాశం ఉంది. ఎందుకంటే అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రలాంటి ఆయుధం ఆ తర్వాత భైరవ చేతిలో ఉన్నట్లు పోస్టర్స్‌లో చూపించారు. అయితే, నాగీ ప్లాన్‌ ఏంటో తెరపై చూడాల్సిందే!


కమల్‌ అలియాస్‌ సుప్రీం యాస్కిన్‌ అలియాస్‌ కలి?

‘కల్కి 2898 ఏడీ’లో ప్రతినాయకుడు సుప్రీం యాస్కిన్‌ పాత్రను కమల్‌హాసన్‌ (Kamal Haasan) పోషిస్తున్నారు. ఆయన గెటప్‌, ఆహార్యం పూర్తి డిఫరెంట్‌గా ఉన్నాయి. దీంతో ఈ పాత్ర ఎక్కడినుంచి రిఫరెన్స్‌గా తీసుకున్నారా? అన్న ఆసక్తి మొదలైంది. ‘కల్కి’ టీజర్‌ విడుదలైన సమయంలో ‘కమల్‌ హాసన్‌ ఎక్కడ’ అని ఒక విలేకరి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Director Nag Ashwin)ను ప్రశ్నించగా, ‘టీజర్‌ మొత్తంలో ఆయనే ఉన్నారు’ అని సమాధానం ఇచ్చారు. అవును, మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను తాళ్లుగా చేసుకుని వాటిని మెడకు చుట్టి ఆడిస్తూ ఉంటాడు కలి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ లోనూ ‘ఎన్ని యుగాలైనా మనిషి మారడు.. మారలేడు’ అని కమల్‌హాసన్‌ చెబుతారు. అంటే, మనిషి ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడటం ఆపనంతవరకూ కలి మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటాడు. ‘కల్కి’ మూవీ (Kalki Telugu Movie)లో భైరవకు మిలియన్‌ యూనిట్స్‌ సంపాదించి కాంప్లెక్స్‌కు వెళ్లి సుఖమయ జీవితం గడపాలన్న ఆశతో ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధపడతాడు. అంటే తనలో ఉన్న కలిని గుర్తించి, ‘కల్కి’ కోసం సుప్రీం యాస్కిన్‌తో భైరవ పోరాటం చేస్తాడేమో. ఒకవేళ అదే జరిగే ‘భైరవ’ కాశీని రక్షించడమే కాదు, పుట్టబోయే ‘కల్కి’కి కూడా రక్షకుడిగా మారతాడు.


దీపిక పదుకొణె.. సమ్‌-80

ఈ మూవీలో మరో కీలక పాత్ర పోషిస్తోంది దీపిక పదుకొణె (Deepika Padukone). గర్భిణి అయిన ఈ పాత్రను ‘సమ్‌-80’గా వ్యవహరిస్తున్నారు. ‘భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందని అంటారు. అలాంటిది మీ కడుపున ఆ భగవంతుడే ఉన్నాడు’ అని ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ పాత్ర అంటుంది. అంటే ‘కల్కి’ పుట్టిబోయేది ఆమె కడుపునే అన్నది అర్థమవుతోంది. శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు, సుమతిల కుమారుడిగా ‘కల్కి’ పుడతాడని పురాణగాథలు చెబుతున్నాయి. సుమతి పేరును షార్ట్‌ కట్‌లో ‘సమ్‌-80’ పిలుస్తున్నట్లు తెలుస్తోంది. మరి కాంప్లెక్స్‌ వాళ్లు ‘సమ్‌-80’ పేరుతో బౌంటీని ఎందుకు ఆఫర్‌ చేశారు? దాన్ని అందుకోవడానికి భైరవ ఏం చేశాడు? అన్నది ఆసక్తికరం.


మాళవిక.. ఉత్తర

మహాభారతం నుంచి రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న మరో పాత్ర మాళవిక నాయర్‌ (Malvika Nair) పోషిస్తున్న ఉత్తర. ఆమె అభిమన్యుడి భార్య. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో కౌరవుల పక్షాన నిలిచిన అశ్వత్థామ.. పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి ఉత్తర గర్భంపై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీంతో ఆమె గర్భం విచ్చిత్తి అవుతుంది. అప్పుడు కృష్ణుడు తన యోగమాయతో ఆ పిండాన్ని బతికించి, అశ్వత్థామను రోగాలతో కలియుగం చివరివరకూ జీవించమని శపిస్తాడు.

ఇవి కాకుండా ‘కల్కి’లో దిశా పటానీ రోక్సీ పాత్ర పోషిస్తోంది. కొన్నేళ్ల తర్వాత కథానాయిక శోభన ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె శంబల మహిళ మరియంగా కనిపించనున్నారు. కాంప్లెక్స్‌ను నియంత్రించే కమాండర్‌ మానస్‌గా స్వాస్థ్‌ ఛటర్జీ, శంబల రెబల్‌ ఆర్మీలో కీలక వ్యక్తులుగా పశుపతి, అనా బెన్‌ నటిస్తున్నారు. ప్రభాస్‌ ఇంటి యజమానిగా బ్రహ్మానందం సందడి చేయనున్నారు. ఇక రాజేంద్రప్రసాద్‌ పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. బుజ్జి పాత్రకు కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని టాలీవుడ్‌ టాక్‌. ‘సీతారామం’ జోడీ దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్ ఠాకూర్‌, విజయ్ దేవరకొండ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిజమో, కాదో తెలియాలంటే జూన్‌ 27వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు