
Unstoppable: మహేశ్‌తో బాలకృష్ణ.. నవ్వులు పంచడమే కాదు.. గుండెలూ పిండేశారు!
హైదరాబాద్: బాలకృష్ణ (balakrishna) వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ (Unstoppable). తెలుగు సినీ స్టార్లతో బాలకృష్ణ చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు (Mahesh babu) వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమోను ‘ఆహా’ విడుదల చేసింది. బాలకృష్ణ-మహేశ్ మధ్య సరదా సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటు వైపు వెళ్లలేదని మహేశ్ ఆనాడు జరిగిన సంఘటనను పంచుకున్నారు.
ఇక ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించడం వెనుక కారణాన్ని ఈ సందర్భంగా మహేశ్చెప్పి గుండెలు పిండేశారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కేవలం అరచేయి అంత ఉన్నాడని, తనకు డబ్బు ఉండటం వల్ల వైద్యం చేయించుకున్నామని, లేని వాళ్ల పరిస్థితి ఏంటనిపించిందని అన్నారు. అందుకే చిన్నారుల హార్ట్ ఆపరేషన్ కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో కూడిన ఈ ఎపిసోడ్ చూడాలంటే ఫిబ్రవరి 4వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే!