Upasana: అమెరికాలో డెలివరీ అంటూ రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన ఉపాసన

తన డెలివరీ ఎక్కడన్న దానిపై హీరో రామ్‌చరణ్‌ భార్య, అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన స్పష్టత ఇచ్చారు.

Published : 01 Mar 2023 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి, అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana) డెలివరీ ఎక్కడ? అనే దానిపై పలువురు నెటిజన్లు కొన్నిరోజులుగా ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశంలో డెలివరీకి ప్లాన్‌ చేస్తున్నారంటూ ఊహాగానాలు సృష్టించారు. వాటిపై ఉపాసన స్పందించారు. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోషియేషన్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్‌చరణ్‌ ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రముఖ అమెరికన్‌ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు.

ఆ కార్యక్రమ మెడికల్‌ కరెస్పాండెంట్‌ అయిన గైనకాలజిస్ట్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌.. చరణ్‌ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఆ సందర్భంగా.. ‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. ఆ సమయానికి మీరు అందుబాటులో ఉంటే బాగుంటుంది’ అని చరణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి జెన్నిఫర్‌ స్పందిస్తూ.. చరణ్‌, ఉపాసనల ఫస్ట్‌ బేబీని డెలివరీ చేయనుండడం తనకు గౌరవమని, దాని కోసం ఎక్కడ అందుబాటులో ఉండమన్నా తాను సిద్ధం’’ అని తెలిపారు. దాంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం సాగింది.

‘‘డాక్టర్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ మీరు చాలా స్వీట్‌. మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దయచేసి మీరు మా అపోలో హాస్పిటల్స్‌ కుటుంబంలో భాగమవ్వండి. ఇక్కడి వైద్యులు సుమన మనోహర్‌, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’’ అంటూ ఉపాసన ఓ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చరణ్, ఉపాసన తాము పేరెంట్స్‌ కాబోతున్నట్టు గతేడాది డిసెంబరులో అభిమానులకు శుభవార్త వినిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని