Upasana: పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ఉపాసన ట్వీట్‌

తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ఉపాసన ట్వీట్‌ చేశారు. ఈ క్షణాలు తనకెంతో మధురానుభూతిని పంచుతున్నాయని అన్నారు.

Updated : 12 Jan 2023 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ట్వీట్‌ చేశారు నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన (Upasana). తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు చెప్పారు. రామ్‌చరణ్‌తో (Ram Charan) కలిసి ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌లో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. దేశం గర్వించే విజయం ఇది. ఈ ప్రయాణంలో నేనూ భాగమయ్యేలా చేసిన రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాలు భావోద్వేగంగా అనిపిస్తున్నాయి’’ అని ఉప్సీ పేర్కొన్నారు. దీనిని చూసిన మెగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

హోస్ట్‌కు ఎన్టీఆర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

విలేకర్లు, ఫొటోగ్రాఫర్లతో ఎప్పుడూ సరదాగా, సన్నిహితంగా వ్యవహరిస్తుంటారు ఎన్టీఆర్ (NTR)‌. గోల్డెన్‌ గ్లోబ్‌ వేదికగా ఆయన మరోసారి తన ఫ్రెండ్లీ నేచర్‌ను చాటుకున్నారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న తారక్‌ను రెడ్‌ కార్పెట్‌పై ఓ హాలీవుడ్‌ యాంకర్‌ ఇంటర్వ్యూ చేశాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఈ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం హోస్ట్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఆయనకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. యాంకర్‌ పట్ల ఆయన వ్యవహరించిన తీరు అభిమానుల మనసు దోచేస్తోంది.

పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ అంటే ఇదేనేమో..!

గోల్డెన్‌ గ్లోబ్‌ (Golden Globe) వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందానికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెటిజన్ల మది దోచేస్తున్నాయి. ముఖ్యంగా టీమ్ మొత్తం కలిసి దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయత చాటేలా రాజమౌళి ధోతీ - కుర్తా ధరించడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మరోవైపు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లను రెడ్‌ కార్పెట్‌పై ఇంటర్వ్యూ చేస్తోన్న సమయంలో వాళ్ల జీవిత భాగస్వాములు వెనుకనే నిల్చొని ఉన్నారు. ఈ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన పలువురు నెటిజన్లు.. ‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ తప్పక ఉంటుంది’’ అని ప్రశంసిస్తున్నారు. ఈ ఫొటోలే అందుకు నిదర్శనం అని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని