Bollywood: కొత్త జోడీ... మెరుపులు రెడీ

ఒకసారి హిట్‌ అనిపించుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ ఆ జోడీని తెరపై చూడడానికి ఇష్టపడతారు సినీప్రియులు. దీంతో పాటు తెరపైకి కొత్త కాంబినేషన్‌లు వస్తున్నాయంటే కూడా అభిమానుల్లో ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది.

Updated : 16 Jun 2024 09:38 IST

ఒకసారి హిట్‌ అనిపించుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ ఆ జోడీని తెరపై చూడడానికి ఇష్టపడతారు సినీప్రియులు. దీంతో పాటు తెరపైకి కొత్త కాంబినేషన్‌లు వస్తున్నాయంటే కూడా అభిమానుల్లో ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. దర్శకనిర్మాతలు సైతం భిన్నమైన కథలు, పాత్రలను సృష్టించి.. కొత్త జోడీలను పరిచయం చేయాలనుకుంటారు. సినిమా విజయం ఎలా ఉన్నా.. ప్రేక్షకుల దృష్టి అంతా ఈ జంట చేసే సందడిపైనే. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొత్త జోడీలతో కొన్ని ప్రాజెక్టులు ముస్తాబవుతున్నాయి. మరి ఆ సినిమాల విశేషాలేంటీ..? అందులో ఈ కొత్త కలయికల మెరుపులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

నయా డాన్‌తో కియారా యాక్షన్‌..

రణ్‌వీర్‌ సింగ్, కియారా.. సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న మరో జంట ఇది. వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రం ‘డాన్‌ 3’. ఇప్పటి వరకు ‘డాన్‌’ అనే పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అమితాబ్‌ బచ్చన్, షారుక్‌. కానీ..బాలీవుడ్‌ కా నయా డాన్‌ అంటూ ఇటీవలే రణ్‌వీర్‌ సింగ్‌ను పరిచయం చేసింది చిత్రబృందం. ఈ ప్రాజెక్టును ఫర్హాన్‌ అక్తర్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రేమకథలు, కామెడీ ఎంటర్‌టైన్‌లతో ప్రేక్షకులను మెప్పించిన కియారా.. ఈసారి రణ్‌వీర్‌తో కలిసి యాక్షన్‌ రుచి చూపించేందుకు ముస్తాబవుతోంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ భారీ బడ్జెట్‌ ప్రాజెక్టులోని యాక్షన్‌ సీక్వెన్స్‌లను మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దుతుంది చిత్రబృందం. త్వరలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారు. దీంతో పాటు ‘వార్‌ 2’లోనూ తొలిసారి హృతిక్‌ రోషన్‌ సరసన నటిస్తుంది కియారా.


‘బేబీ జాన్‌’ జంట హంగామా..

ఎంచుకునే ప్రతి కథలోనూ తన ప్రత్యేకతను చూపిస్తుంటుంది అందాల భామ కీర్తి సురేశ్‌.  ఇప్పుడామె బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌తో ‘బేబీ జాన్‌’ సినిమా కోసం జతకట్టింది. మరో విశేషమేంటంటే.. ఇప్పటికే దక్షిణాదిలో తానెంటో నిరూపించుకున్న కీర్తి.. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీంతో సినీప్రియులు ఈ కొత్త జోడీ సందడి ఎలా ఉండనుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ.కాలీస్‌ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వామికా గబ్బీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది చిత్రబృందం.


విక్కీతో రష్మిక..

తమ అభిమాన నాయికా తదుపరి ఏ హీరోతో జత కట్టబోతుందోననే ఆసక్తి సినీప్రియుల్లో ఎక్కువగానే ఉంటుంది. తనదైన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న రష్మిక.. బాలీవుడ్‌ కథానాయకుడు విక్కీ కౌశల్‌తో ‘ఛావా’ అనే చిత్రం కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్టును లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ పాత్రలో విక్కీ, ఆయన భార్య ఏసుభాయిగా రష్మిక కనిపించనుంది. తొలిసారి తెరను పంచుకుంటున్న ఈ జోడీ మెరుపులు ఎలా ఉండనున్నాయో చూడాలి మరి. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణలో ఉంది రష్మిక.


అహాన్‌ శెట్టి ప్రేమలో పూజ..

దక్షిణాదితో పాటు.. ఇటు బాలీవుడ్‌లోనూ ఎంతో మంది అగ్రకథానాయకులతో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల తార పూజా హెగ్డే. ఇప్పుడామె.. బాలీవుడ్‌ కథానాయకుడు అహాన్‌ శెట్టి సరసన ‘సంకీ’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్టును అద్నాన్‌ షేక్, యాసిర్‌ ఝా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొదలు పెట్టినట్లు తెలిపింది చిత్రబృందం. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అహాన్, పూజ మధ్య కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందట. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ‘దేవా’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ కోసం షాహిద్‌ కపూర్‌తో జోడీ కట్టింది పూజ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని