Valentines Day: ఈ ఏడాది తెరపై కనిపించే ఆసక్తికర ‘ప్రేమ’కథలివి.. అనుష్క అలా.. సమంత ఇలా!

మీకు ప్రేమకథా చిత్రాలంటే ఇష్టమా? ఈ ఏడాది రాబోతున్న ఆసక్తికర లవ్‌స్టోరీ మూవీలేంటో చూద్దామా...

Updated : 14 Feb 2023 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ ఎవరికీ బోర్‌ కొట్టని అంశాల్లో ‘ప్రేమ’ ఒకటి. అందుకే ‘లవ్‌’స్టోరీ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు అంతటి క్రేజ్‌. ప్రతి చిత్ర పరిశ్రమలో ఓ ఏడాదిలో రూపొందే వాటిల్లో సగానికిపైగా ‘ప్యార్‌’ కహానీలే కనిపిస్తాయి. కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. మరి, ఈ ఏడాది తెలుగులో రాబోతున్న కొన్ని ఆసక్తికర ప్రాజెక్టులేంటో ‘ప్రేమికుల రోజు’ సందర్భంగా ఓ లుక్కేద్దాం..

ఫోన్‌ నంబరుతో ప్రేమ..

నంబరు నేబర్‌ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీరా పరదేశి (Kashmira Pardeshi) జంటగా నటించారు. మురళీ కిశోర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నంబరు నేబర్‌ అంటే.. ఉదాహరణకు ఓ వ్యక్తి వాడే ఫోన్‌ నంబరు 90101 50015 అనుకుందాం. తన ముందు నంబరు (90101 50014), తర్వాతి నంబరు (90101 50016) ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకుని, వారితో స్నేహం ఏర్పరచుకోవడం నంబరు నేబరు థీమ్‌. ఈ చిత్రంలోని హీరో.. హీరోయిన్‌లు అలానే పరిచయమవుతారు. తర్వాత, వారి స్నేహ బంధం ప్రేమగా మారుతుంది. మరోవైపు, ఆ కాన్సెప్ట్‌తోనే విలన్‌ ఎంట్రీ ఉంటుంది. మరి, ఫోన్‌ నంబరు ద్వారా ప్రేమించుకున్న నాయకానాయికలు ఒక్కటయ్యారా, లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ వినూత్న ప్రేమకథ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.

ధరణి, వెన్నెల.. బ్రేకప్‌?

నాని (Nani), కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రల్లో కొత్త డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తీస్తోన్న సినిమా ‘దసరా’ (Dasara). యాక్షన్‌ మోడ్‌లో రూపొందుతున్నప్పటికీ అంతర్లీనంగా మంచి ప్రేమకథ ఉందని విడుదలైన పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. చిన్ననాటి స్నేహితులైన హీరోహీరోయిన్లు ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. సోమవారం రిలీజైన ‘ఓరివారి నీది గాదురా పోరి.. ఇడిసెయ్‌ రా ఇంగ ఒడిసెను దారి’ అంటూ సాగే విరహ గీతం వింటే నాయకానాయికల మధ్య బ్రేకప్‌ అయినట్టు స్పష్టమవుతుంది. సింగరేణి బొగ్గు గనుల సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్‌ నటిస్తున్నారు. వీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మళ్లీ కలుసుకున్నారా? మార్చి 30న విడుదలకాబోతున్న సినిమానే సమాధానం.

ప్రేమకావ్యం.. శాకుంతలం

కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల- దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). టైటిల్‌ పాత్రను సమంత (Samantha Ruth Prabhu) పోషించగా దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న రానుంది.

నయా ఖుషి..

పవన్‌ కల్యాణ్‌, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ (Kushi) 2001లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అదే పేరుతో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్‌ నేపథ్యంలో విభిన్న ప్రేమకథాంశంతో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ప్రేమికుల మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం?

‘జాతి రత్నాలు’ ఫేం నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty), అగ్ర కథానాయిక అనుష్క (Anushka Shetty) జంటగా దర్శకుడు మహేశ్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారని సినీ వర్గాల టాక్‌. టైటిల్‌ ఇంకా ఖరారు కాని ఈ సినిమా ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

వార్‌ టు ప్యార్‌..

చిన్నపాటి గొడవలతో మొదలైన పరిచయాలు కూడా ప్రేమకు దారి తీస్తాయంటూ ఎన్నో చిత్రాల్లో చూపించారు. ఎప్పుడూ టామ్‌ అండ్‌ జెర్రీలా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉండే హీరోహీరోయిన్లు ప్రేమలో పడడమే ఆయా సినిమాల కాన్సెప్ట్‌. ఇదే తరహాలో రాబోతున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’ (Sridevi Shoban Babu). సంతోష్‌ శోభన్‌ (Santosh Shoban), గౌరి జి. కిషన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్‌ రామస్వామి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి

నాగశౌర్య (Naga Shaurya), మాళవిక నాయర్‌ (Malvika Nair) కలిసి నటించిన రెండో చిత్రం ‘ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). శ్రీనివాస్‌ అవసరాల దర్శకుడు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న హీరోహీరోయిన్ల మధ్య ఒకానొక సమయంలో గొడవ జరిగినట్టు ఇటీవల విడుదలైన టీజర్‌ చెబుతోంది. మరి, ఈ అబ్బాయి, అమ్మాయి ప్రేమకథ ఎలా మొదలైంది? వారి మధ్య దూరానికి కారణమేంటి? తెలియాలంటే మార్చి 17న విడుదలయ్యే సినిమా చూడాల్సిందే.    

మొదటి ప్రేమకి మరణం లేదు..

‘మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేసి ఉంటుంది’ అంటూ టీజర్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించింది ‘బేబీ’ (Baby) చిత్రబృందం. ఇద్దరు పాఠశాల విద్యార్థుల మధ్య మొదలైన ప్రేమ ఎక్కడికి దారి తీసిందనే? కథాంశంతో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ హృద్యమైన ప్రేమకథలో ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి నాయకానాయికలు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని