Valentine Day: ఈ ఏడాది అలరించనున్న ‘ప్రేమ’ కథలివే..!

ప్రేక్షకుల్ని ఈ సంవత్సరం అలరించనున్న ప్రేమకథా చిత్రాల జాబితా. ఎవరెవరు ఎలాంటి సినిమాతో వస్తున్నారో చూడండి...

Updated : 10 Sep 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రేమంటే ఏమిటంటే.. నిన్ను ప్రేమించినాక తెలిసే’ అని ఓ హీరో తన ప్రేమను వ్యక్తం చేశాడు. ‘ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మామా’ అని మరో కథానాయకుడు ప్రేమ మహత్యం వివరించాడు. ‘ప్రేమంటే సులువు కాదురా అది నువ్వు గెలవలేవురా’ అని హీరోయిన్‌ అంటే ‘మనసుంటే మార్గముంటది సై అంటే చేసి చూపుతా’ అని ప్రేమ గురించి ఇంకో హీరో లోకానికి చాటి చెప్పాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు ఎందరో నటులు ప్రేమ పాఠాలు వల్లించారు. ప్రేమకథల్ని చెప్పి ఆకట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఎవరెవరు లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారో ప్రేమికుల రోజు సందర్భంగా ఓ లుక్కేద్దాం...

దశాబ్దం తర్వాత..

ప్రభాస్‌ అభిమానులతోపాటు యావత్‌ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘రాధేశ్యామ్‌’. ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ తర్వాత ప్రభాస్‌ నటించిన పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమిది. లవర్‌బాయ్‌ లుక్‌లో ప్రభాస్‌ను చూసి సుమారు పదేళ్లవుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, ప్రచార చిత్రాలు ఆ అంచనాల్ని రెట్టింపు చేశాయి. హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్‌ కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే సందడి చేయనుంది. 70ల నాటి ఈ లవ్‌స్టోరీని రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్‌, గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఇప్పటికే విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి 11న ప్రేక్షకుల ముందుకురాబోతుంది.


ఫోన్‌.. పుస్తకం.. ప్రేమ

‘ఒకవేళ ఓ ఫోన్‌.. పుస్తకంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా?’ అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది ‘18 పేజీస్‌’ చిత్ర బృందం. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన సినిమా ఇది. ఈ కొత్త తరహా లవ్‌స్టోరీని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో సందడి చేయనుంది.


వైభవంగా..!

‘ఉప్పెన’తో ఆకట్టుకున్న వైష్ణవ్‌తేజ్‌ నటించిన మరో ప్రేమకథా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతిక శర్మ కథానాయిక. ఈ సినిమాతో విభిన్న ప్రేమ కథను తెరపై చూపించనున్నారు దర్శకుడు గిరీశాయ. వైష్ణవ్‌, కేతికల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌, ఓ పాటకు విశేష స్పందన లభించింది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మే 27న అంగరంగ వైభవంగా విడుదలకానుంది.


ఒకరు ఇద్దరిని.. ఇద్దరూ ఒక్కరినే

ఒకే అబ్బాయి ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తే? ఆ అబ్బాయి ఎలాంటి అవస్థలు పడతాడు? ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే? వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ కథతోనే రూపొందింది ‘కణ్మణి రాంబో ఖతీజా’ (కాతువాకుల రెండు కాదల్‌). విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో నయనతార, సమంత కథానాయికలు. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. రౌడీ పిక్చర్స్‌తో కలిసి 7 స్క్రీన్‌ స్టూడియో నిర్మించిన ఈ ముక్కోణపు ప్రేమకథ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకురానుంది.


నాగచైతన్య.. థ్యాంక్స్‌

ఇప్పటికే పలు ప్రేమకథల్లో కనిపించిన నాగచైతన్య పరిచయం చేయబోతున్న మరో స్టోరీ ‘థ్యాంక్‌ యూ’. విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. చైతన్య సరసన రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ సందడి చేయనున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.


అమ్మాయి గురించి చెప్పేందుకు..

ఒక అబ్బాయి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది? అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు? ప్రేమతోపాటు వాళ్లు అనుకున్నది ఎలా సాధించారనే కథతో రూపొందుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఆ అమ్మాయి ఎవరో కాదు ‘ఉప్పెన’తో యువ హృదయాల్ని కొల్లగొట్టిన కృతిశెట్టి. ఆ అబ్బాయి.. సుధీర్‌బాబు. ఈ చక్కటి లవ్‌స్టోరీని మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. ‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత సుధీర్‌బాబు- ఇంద్రగంటి కాంబినేషన్‌లో రూపొందుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. బెంచ్‌మార్క్‌ స్టూడియోస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.


ఆనంద్‌ దేవరకొండ.. బేబీ

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఏజ్‌ ప్రేమ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సినిమాని ఎస్‌. కె. ఎన్‌ నిర్మిస్తున్నారు.


ప్రేమతోపాటు వినోదం..

ప్రేమతోపాటు వినోదం పంచేందుకు కొందరు హీరోలు ముస్తాబవుతున్నారు. ‘అంటే సుందరానికీ!’ చిత్రంతో నాని, ‘కృష్ణ వ్రింద విహారి’తో నాగశౌర్య అలరించనున్నారు. ఇవే కాదు మరెన్నో ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటి సంబంధించిన వివరాల్ని ఆయా చిత్ర బృందాలు త్వరలోనే తెలియజేయనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని