Updated : 29 Mar 2022 11:38 IST

Telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: గతవారం విడుదలైన పాన్‌ ఇండియా  చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’తో బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది. మరో వారం పదిరోజుల పాటు ఈ సినిమా హవానే కొనసాగనుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ మొదటి వారంలో అటు థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దామా!

దావూద్‌ను పట్టుకునేందుకు ముగ్గురు పిల్లలు

తాప్సీ ప్రధాన పాత్రలో ఆర్‌ఎస్‌జె స్వరూప్‌ తెరకెక్కించిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మార్క్‌ కె.రాబిన్‌ స్వరాలందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘‘నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో తాప్సీ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా నటించింది. ముగ్గురు పిల్లల సహాయంతో ఆమె ఓ పెద్ద మిషన్‌ను ఎలా పూర్తి చేసింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా కథాంశం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఓటీటీలో రాధేశ్యామ్‌

ప్రభాస్‌, పూజాహెగ్డే హీరో-హీరోయిన్లు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.  తెరపై ప్రభాస్‌-పూజా హెగ్డేల కెమెస్ట్రీ, పాటలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

ప్రవీన్‌ తాంబే జీవిత కథ

భారతీయులకు అత్యంత ప్రియమైన ఆటల్లో క్రికెట్‌ ఎప్పుడూ తొలి స్థానంలో ఉంటుంది. ఇప్పటికే ఈ ఆట నేపథ్యంలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద అలరించాయి. ఇప్పుడు మరో క్రికెటర్‌ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
భారత క్రికెటర్‌ ప్రవీన్‌ తాంబే జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రవీన్‌ తాంబే ఎవరు?’. శ్రేయాస్‌ తల్పడే టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. 41ఏళ్ల వయసులో ఐపీఎల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్‌ ప్రవీన్‌ తాంబే.

‘ఆహా’లో హలో జూన్‌

లాక్‌డౌన్‌లో సమయంలో ఇతర భాషా చిత్రాలు డబ్‌ అయిన వరుసగా ఓటీటీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆ ఒరవడి కాస్త తగ్గింది. అయితే, అడపా దడపా పలు చిత్రాలు ఇంకా సందడి చేస్తున్నాయి. రాజిష విజయన్‌ ప్రధాన పాత్రలో మలయాళంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘జూన్‌’. 2019లో విడుదలైన ఈ సినిమా ఫీల్‌గుడ్‌ మూవీగా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ ‘ఆహా’వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఏప్రిల్‌ 1 నుంచి ‘హలో జూన్‌’ పేరుతో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా..

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు కూడా మిశ్రమ స్పందనే లభించింది.  ఇప్పుడు సోనీలివ్‌ ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తున్నారు.

ఓటీటీలో విడుదల కానున్న మరికొన్ని చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌

* శర్మాజీ నమ్‌కీన్‌(హిందీ)మార్చి 31

డిస్నీ+హాట్‌స్టార్‌

* మూన్‌నైట్‌ (డబ్బింగ్‌) మార్చి 30

* భీష్మపర్వం(మలయాళం)

నెట్‌ ఫ్లిక్స్‌

* ది లాజ్‌ బస్‌(వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌1

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని