Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలు దద్దరిల్లిపోతాయంతే!

telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే

Published : 21 Mar 2022 09:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాల సందడి షురూ కానుంది. ఈ వారం థియేటర్‌లో ఒకే ఒక చిత్రం విడుదలవుతుండగా, ఓటీటీలో మాత్రం రెండు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

భారీ అంచనాలతో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

స్టార్‌ హీరో సినిమా విడుదలవుతోందంటే బాక్సాఫీస్‌ వద్ద సందడి మామూలుగా ఉండదు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు అపజయం ఎరుగని స్టార్‌ దర్శకుడు కలిసి చేసిన సినిమా అంటే ఆ అంచనాలు రెండింతలు కాదు.. కాదు.. మూడింతలు ఉంటాయి. ఆ సినిమాయే ‘RRR’. ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) హీరోలుగా రాజమౌళి(Rajamouli) తెరకెక్కిన హిస్టారికల్‌ ఫిక్షనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. అలియా భట్(Alia bhatt), ఓలివియా మోరిస్‌ కథానాయికలు. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీంలు కలిసి బ్రిటిష్‌వారిపై ఎలా పోరాటం చేశారన్న కాల్పనిక కథకు తనదైన యాక్షన్‌, భావోద్వేగాలు జోడించి తెరకెక్కించారు రాజమౌళి. యావత్‌ భారత సినీ ప్రేక్షకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ‘RRR’ను తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్‌లు ఈ వీకెండ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రీసౌండ్‌తో దద్దరిల్లిపోతాయి.


ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలివే!

‘భీమ్లానాయక్‌’ మాస్‌ జాతర

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), రానా(Rana) కీలక పాత్రల్లో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’(Bheemla nayak). ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా పవన్‌-రానాల మధ్య వచ్చే సన్నివేశాలు, త్రివిక్రమ్‌ సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ సినిమా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీలు ఆహా, డిస్నీ+హాట్‌స్టార్‌ల వేదికగా ‘భీమ్లానాయక్‌’(Bheemla nayak) మార్చి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


అజిత్‌ థ్రిల్లింగ్ రైడ్‌ కూడా వచ్చేస్తోంది

తమిళ నటుడు అజిత్‌(Ajith) కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన చిత్రం ‘వలిమై’(valimai ott release). ఫిబ్రవరి 24న విడుదలైన ఈ సినిమా కూడా ఈ వారమే ఓటీటీలో సందడి చేయనుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘వలిమై’(valimai) మార్చి 25వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాలో తెలుగు యువ కథానాయకుడు కార్తికేయ(Kartikeya)  ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ఓటీటీల్లో ‘భీమ్లా నాయక్‌’, ‘వలిమై’లతో ఈ వారం సినీ ప్రేక్షకులు డబుల్‌ ట్రీట్‌ అందుకోనున్నారు.


ఓటీటీలో విడుదలయ్యే మరికొన్ని చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌

* డ్యూన్‌ (హాలీవుడ్‌) మార్చి 25

డిస్నీ+హాట్‌ స్టార్‌

* పారలెల్స్‌ (ఒరిజినల్‌ మూవీ) మార్చి 23

నెట్‌ఫ్లిక్స్‌

* బ్రిడ్జిటన్‌ (వెబ్‌సిరీస్‌2) మార్చి 25

ఎంఎక్స్‌ ప్లేయర్‌

* రూహానియత్‌ (హిందీ) మార్చి 23

ఊట్‌

* హలో (వెబ్‌సిరిస్‌) మార్చి 23

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని