Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Published : 29 May 2023 09:50 IST

Telugu movies: వేసవిలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. జూన్‌ మొదటి వారంలోనూ ఇదే పంథా కొనసాగనుంది. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి.

తేజ మార్కు కథతో దగ్గుబాటి హీరో

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’ (Ahimsa). తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, యాక్షన్‌ అంశాల మేళవింపుగా రూపొందిన చిత్రమిది. రజత్‌ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్‌ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవి ప్రసాద్‌ తదితరులు నటించారు. ఆర్పీ పట్నాయక్‌ స్వరాలు సమకూర్చారు.


థ్రిల్లింగ్‌ కథతో..

‘స్వాతిముత్యం’ సినిమాతో తొలి అడుగులోనే హీరోగా మెప్పించారు బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh). ఇప్పుడు రెండో ప్రయత్నంలో ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ (Nenu Student Sir) అంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. సతీష్‌వర్మ నిర్మాత. అవంతిక కథానాయిక. సముద్రఖని, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 2న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాని ఉత్కంఠభరితమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా మలిచినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. సంగీతం: మహతి స్వరసాగర్‌


ఆసక్తి రేకెత్తించే ‘ఐక్యూ’

సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించిన చిత్రం ‘ఐక్యూ’. పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌.. అన్నది ఉపశీర్షిక. కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. సుమన్‌, సత్య ప్రకాష్‌, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. ‘ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రం. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది ఆసక్తికరంగా చూపించాం’ అని చిత్ర బృందం చెబుతోంది.


కొత్త రకమైన కామెడీతో ‘పరేషాన్‌’

రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో తిరువీర్‌, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశ్వతేజ్‌ రాచకొండ, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మాతలు. జూన్‌ 2న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘కొన్ని సినిమాలతో మనం బాగా కనెక్ట్‌ అయ్యి, మళ్లీ మళ్లీ చూస్తుంటాం. అలాంటి చిత్రమే ఇది. కొత్త రకమైన కామెడీని పరిచయం చేద్దామనే ఆలోచనతోనే ‘పరేషాన్‌’ చేశాం’ అని చిత్ర బృందం చెబుతోంది.


అజయ్‌ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్‌ తెరకెక్కించిన చిత్రం ‘చక్రవ్యూహం’. ది ట్రాప్‌.. అనేది ఉపశీర్షిక. సహస్ర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జ్ఞానేశ్వరి, వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. ‘‘మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇందులో అజయ్‌ పోలీస్‌గా కనిపిస్తారు’’ అని చిత్ర బృందం చెబుతోంది.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • ఫేక్‌ ప్రొఫైల్‌ (వెబ్‌సిరీస్‌)  మే 31
  • ఎ బ్యూటిఫుల్‌ లైఫ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 1
  • న్యూ ఆమ్‌స్టర్‌ డామ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 1
  • ఇన్ఫినిటీ స్టోర్మ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 1
  • స్కూప్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 2
  • మ్యానిఫెస్ట్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌2

జీ 5

  • విష్వక్‌ (తెలుగు) జూన్‌ 2

డిస్నీ+ హాట్‌స్టార్‌

  • సులైకా మంజిల్‌ (మలయాళం) మే 30

బుక్‌ మై షో

  • ఈవిల్‌ డెడ్‌ రైజ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 2

జియో సినిమా

  • అసుర్‌ 2 (హిందీ సిరీస్‌) జూన్‌ 1
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని