పాన్‌ ఇండియా... నయా బాటయా!

ఒకప్పుడు సినిమా అంటే ఒక భాషకో, ప్రాంతానికో, పక్క రాష్ట్రాల సరిహద్దులకో పరిమితమయ్యేది. కానీ, ఫిల్మ్‌ మేకింగ్‌లో

Updated : 22 Mar 2021 12:21 IST

ఒకప్పుడు సినిమా అంటే ఒక భాషకో, ప్రాంతానికో, పక్క రాష్ట్రాల సరిహద్దులకో పరిమితమయ్యేది. కానీ, ఫిల్మ్‌ మేకింగ్‌లో నానాటికీ అంది వస్తున్న సరికొత్త సాంకేతికత, వైవిధ్య కథాంశాలు, కళ్లు చెదిరే నిర్మాణ విలువలతో సినిమాలు పాన్‌ ఇండియా బాట పడుతూ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు విజువల్‌ విందులు పంచుతున్నాయి. విదేశాల్లో కూడా మన ఘనతను చాటుతున్నాయి. తెలుగు సినిమాలు ఈ ట్రెండ్‌లో ముందు వరుసలో నిలుస్తున్నాయి. పాన్‌ ఇండియా సినిమాలు నటీనటుల సరిహద్దులు చెరిపేస్తున్నాయి. ఇలా త్వరలో ప్రేక్షకులను పలకరించబోయే పాన్‌ ఇండియా సినిమాలేవో చూద్దామా!

తొలి నుంచి వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటున్న నటుడు రానా. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభుసాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో రూపొందింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏనుగుల మనుగడ కోసం ఓ వ్యక్తి చేసిన పోరాటాన్ని ఇందులో చూపించనున్నారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత రసూల్‌ పోకుట్టి సౌండ్‌ డిజైన్‌ చేశారు. తమిళ నటుడు విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కమర్షియల్‌ వాల్యూస్‌తో పాటు ఒక సామాజిక అంశం నేపథ్యంగా వస్తున్న చిత్రమిది.


కొత్తదనానికి కేరాఫ్‌గా నిలిచే అడవి శేష్‌ హీరోగా వస్తున్న చిత్రం ‘మేజర్‌’. మహేష్‌ బాబు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని అసలు సిసలైన పాన్‌ ఇండియా మూవీగా అభివర్ణిస్తూ ఆసక్తి పెంచాడు శేష్‌. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారం. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. జులై 2న స్క్రీనింగ్‌కి తేవాలని నిర్ణయించారు.


టేకింగ్‌, ఎడిటింగ్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌, మ్యూజిక్‌, రీ రికార్డింగ్‌ అన్నింటిలోనూ ఒక ట్రెండ్‌ సెట్‌ చేసిన సినిమా ‘కేజీయఫ్’‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ నటుడు యశ్‌ నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ని ఊపేసింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘కేజీయఫ్‌2’విడుదలకు సిద్ధమవుతోంది. గరుడను చంపడానికి ‘కేజీయఫ్‌’కు వెళ్లిన రాఖీ ఆ తర్వాత ఏం చేశాడు? దాన్ని ఎలా కైవసం చేసుకున్నాడు? అధీరను ఎలా ఎదుర్కొన్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలకు ‘కేజీయఫ్‌2’లో సమాధానం లభించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. జులై 16, 2021న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద కె.రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. తెలుగు, హిందీలో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఉత్తరాదిలోనూ స్టార్‌ డమ్‌ తెచ్చుకున్నాడు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. జులై 30న స్క్రీనింగ్‌కి రానుంది.


స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వైవిధ్యమైన పాత్రలో సుకుమార్‌ తెరకెక్కిస్తున్న మూవీ ‘పుష్ప’. ప్రతి సినిమాకి డిఫరెంట్‌ లుక్‌లో కనిపించే అల్లు అర్జున్‌ ఇందులో ఫుల్‌ మాస్‌ లుక్‌లో ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపిస్తున్నారు. రష్మిక మందన బన్నీకి జోడీగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రతినాయకుడిగా మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు.


ర్జున్‌ రెడ్డి సినిమాతో స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘లైగర్‌’. టైటిల్‌తోనే అందరినీ తనవైపునకు ఆకర్షించుకున్న ఈ సినిమా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ భామ అనన్య పాండే విజయ్‌కి జోడీగా నటిస్తోంది. సెప్టెంబరు 9న దీన్ని అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు.


చారిత్రక కథకు కాల్పనికత జోడించి సరికొత్త కథాంశంతో వస్తున్న మల్టీ స్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). బాహుబలితో డైరెక్టర్‌గా ఆకాశమంత ఎత్తులో నిలిచిన ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ పీరియాడిక్‌ మూవీని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు ఇందులో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌, బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ వీరికి జోడీగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ది మరో ప్రధాన పాత్ర. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు పెద్ద అంచనాలే ఉన్నాయి. జక్కన్న తప్పకుండా వాటిని అందుకుంటాడన్న నమ్మకమూ ఉంది! అక్టోబరు 13న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.


వైవిధ్య సినిమాల దర్శకుడు క్రిష్‌, పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పకులు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ బందిపోటు దొంగలా కనిపించనున్నారు. పీరియాడికల్‌ మూవీ కావడంతో భారీ సెట్స్‌తో పాటు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వచ్చే సంక్రాంతికి దీన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

-మన్నం వేణుబాబు

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని