Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

ఈ వారం రానున్న సినిమాలు ఏమిటంటే...

Updated : 11 Apr 2022 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకు సంబంధించి సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్‌ అంటే వేసవి కాలమే. అందుకే ఈ సమయంలోనే చిత్రాలు అధిక సంఖ్యలో విడుదలవుతుంటాయి. ఇప్పటికే ‘రాధేశ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘గని’ తదితర సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈవారం రిలీజ్‌ అయ్యేందుకు మరికొన్ని సిద్ధమయ్యాయి. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ సందడి చేయనున్న మూవీస్‌ ఏంటో చూద్దామా..!

బీస్ట్‌.. విజయ్‌ కొత్త అవతారం

‘అరబిక్‌ కుత్తు’ పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘బీస్ట్‌’ (Beast). విజయ్‌ (Vijay) హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson DilipKumar) తెరకెక్కించిన చిత్రమిది. పూజాహెగ్డే (Pooja Hegde) కథానాయిక. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది.  ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 13న విడుదలకానుంది. ఇందులో విజయ్‌.. మాజీ రా ఏజెంట్ వీర రాఘవన్‌ పాత్ర పోషించారు. ‘ఈ సినిమాలో ఇప్పటి వరకూ చూడని కొత్త లుక్‌లో విజయ్‌ కనిపిస్తారు’ అని దర్శకుడు పలు ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఆ లుక్‌ ఎలా ఉంటుంది? విజయ్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఏంటి? ఉగ్రవాదుల చెర నుంచి అమాయకపు ప్రజలను ఎలా కాపాడాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

‘కేజీయఫ్‌ 2’లో ఏం జరిగింది?

‘కేజీయఫ్‌ 1’ (KGF)లో  గరుడ మరణానంతరం ఏం జరిగింది? అనే ప్రశ్న ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (KGF Chapter 2)పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఏప్రిల్‌ 14న ఈ ఉత్కంఠకు తెరపడనుంది. యశ్‌ (Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. పార్ట్‌ 1 దేశవ్యాప్తంగా ఘన విజయం అందుకోవడం, సంజయ్‌ దత్‌, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌లాంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి.

ఓటీటీ వేదికగా..
* ఆడవాళ్లు మీకు జోహార్లు: ఏప్రిల్‌ 14 (సోనీలివ్‌)
* దహనం: ఏప్రిల్‌ 14 (ఎంఎక్స్‌ ప్లేయర్‌)
* గాలివాన (వెబ్‌ సిరీస్‌): ఏప్రిల్‌ 14 (జీ 5)
* బ్లడీ మేరీ: ఏప్రిల్‌15 (ఆహా) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని