చిరు.. పవన్‌.. వెంకీ.. అందరిదీ అదే దారి!

‘రీమేక్‌’ సినిమా అంటే జిరాక్స్‌ కాపీ కాదు. ఇతర భాషల్లో హిట్‌ సినిమాను అచ్చుగుద్దినట్లు తెరకెక్కిస్తే సినిమా విజయం సాధిస్తుందో లేదో తెలియదు కానీ.. డైరెక్టర్‌ ప్రతిభకు చెడ్డపేరు రావడం పక్కా. అందుకే రీమేక్‌ల విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు. రీమేక్‌ అయినప్పటికీ తమదైన వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు.

Published : 11 Jan 2021 09:53 IST

2021లో రాబోతున్న రీమేక్‌లు.. వాటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రీమేక్‌’ సినిమా అంటే జిరాక్స్‌ కాపీ కాదు. ఇతర భాషల్లో హిట్‌ కొట్టిందని ఆ సినిమాను అచ్చు గుద్దినట్లు తెరకెక్కిస్తే సినిమా విజయం సాధిస్తుందో లేదో తెలియదు కానీ.. డైరెక్టర్‌ ప్రతిభకు చెడ్డపేరు రావడం పక్కా. అందుకే రీమేక్‌ల విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు. రీమేక్‌ అయినప్పటికీ తమదైన వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. పైగా సబ్‌టైటిల్స్‌ పుణ్యమాని మన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు పరభాషా సినిమాలనూ చూస్తున్నారు. హిట్‌ సినిమా కదా అని ఉన్నది ఉన్నట్లుగా తీస్తే ప్రేక్షకులు ఆదరించరు. ఒక్కొక్కరి టేస్టు ఒక్కోలా ఉంటుంది కదా.! అందుకే.. మన డైరెక్టర్లు హిట్‌ సినిమాల రీమేక్‌లకు మెరుగులద్దే పనిలో పడ్డారు. మరి ఈ ఏడాది అలా ప్రేక్షకుల ముందుకు రానున్న రీమేక్‌లు.. అందులో చేయనున్న మార్పులేంటో తెలుసా..?

లూసిఫర్: వన్‌ మ్యాన్‌షోకు మెగాస్టార్‌ సిద్ధం

టాలీవుడ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న సినిమాల్లో మెగాస్టార్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌ ఒకటి. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ ప్రధానపాత్రలో నటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌ ఉండదు. అందులో మోహన్‌లాల్‌ది వన్‌మ్యాన్‌ షో. హీరోకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే ఆ సినిమాపై మన మెగాస్టార్‌ ఆసక్తి చూపించారు. అయితే.. రీమేక్‌లో మెగాస్టార్‌కు సోదరిగా ఎవరు నటిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ‘లూసిఫర్‌’లో అది బలమైన పాత్ర. తాజాగా ఈ పాత్రకు నయనతారను పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపించింది.. దీంతో పాటు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నాడట కాబట్టి.. మాతృక చూసి సరిపెట్టుకుందాం అనుకున్నవాళ్లు కూడా మనసు మార్చుకోవాల్సిందే మరి. అయితే.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్‌రాజ్‌ ఎలా మలుస్తారన్నది చూడాలి. ముఖ్యంగా చిరును ఎలివేట్‌ చేసే విధానం కీలకంగా మారనుంది. సినిమాలో కంటెంట్‌ దెబ్బతినకుండా మలయాళ ఫ్లేవర్‌ కనిపించకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు డైరెక్టర్‌ బాగానే స్కెచ్‌ వేస్తున్నారట.

ఈ చిత్రం పట్టాలెక్కక ముందే మెగాస్టార్‌ మరో రీమేక్‌కు పచ్చజెండా ఊపారు. తమిళంలో అజిత్‌ హీరోగా వచ్చిన ‘వేదాళం’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌ ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. ఇందులో హీరో సోదరిగా కీలకమైన పాత్ర ఉంటుంది. అందులో సాయిపల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ రెండు చిత్రాలూ ఒకే ఏడాదిలో ప్రేక్షకులను అలరించే అవకాశం లేకపోలేదు.

వకీల్‌సాబ్‌: ‘అన్నయ్య’ బాటలోనే ‘తమ్ముడు’

రీమేక్‌ల విషయంలో ‘అన్నయ్య’ బాటలోనే నడుస్తున్నాడు ‘తమ్ముడు’. ‘గోకులంలో సీత’తో మొదలు పెడితే ‘కాటమరాయుడు’ వరకు పవన్‌ కెరీర్‌లో చాలా రీమేక్‌లున్నాయి. ఇప్పుడు మరోసారి ఆయన బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌తో రానున్నారు. హిందీ మాతృకలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ న్యాయవాదిగా ప్రధానపాత్రలో కనిపించారు. ఇందులోనూ హీరోయిన్‌కు స్థానం లేదు. ‘వకీల్‌సాబ్‌’లో మాత్రం శ్రుతిహాసన్‌ పాత్రను జోడించారు. కాగా.. తెలుగులో ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు.  పవన్‌ను ఒంటరిగా చూడటం అభిమానులు ఇష్టపడరని భావించి డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారేమో. అందుకే హీరోయిన్‌ను పాత్ర సృష్టించినట్లున్నారు. మరి డైరెక్టర్‌ ఎత్తులు ఫలిస్తాయో లేదో చూడాలంటే థియేటర్‌లో ‘వకీల్‌సాబ్‌’ వాదనలు నేరుగా వినాల్సిందే. సినిమాలో కంటెంట్‌ దెబ్బతినకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు ఇంకా ఏం ప్రయోగాలు చేస్తాడో.!

ఇప్పటికే ‘వకీల్‌సాబ్’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న పవన్‌.. మరో రీమేక్‌ కోసం సిద్ధమవుతున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ త్వరలోనే పట్టాలెక్కనుంది. బిజూ మేనన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలను తెలుగులో పవన్‌కల్యాణ్‌, రానాలు పోషిస్తున్నారు. మనిషికి అహం అడ్డు వచ్చినప్పుడు విచక్షణ ఏ విధంగా కోల్పోతాడన్న ఇతివృత్తంతో ఈ కథ సాగుతుంది. తెలుగు చిత్రాన్ని సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. మరి మలయాళ చిత్రాన్ని మరిపించేలా తెలుగు చిత్రం ఉంటుందా? లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.

రెడ్‌: అక్కడ ఒక్కరు ఇక్కడ ముగ్గురు..

ఈ సంవత్సరం వస్తున్న రీమేక్‌ సినిమాల్లో అన్నింటికంటే ముందుగా థియేటర్‌లలోకి రాబోతున్నది ‘రెడ్‌’. తమిళంలో వచ్చి మంచి విజయం సాధించిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా వస్తోందీ చిత్రం. కిషోర్‌ తిరుమల తెరకెక్కించారు. ఇందులో హీరో రామ్‌ ద్విపాత్రినభినయంతో అలరించనున్నాడు. నివేదా పేతురాజ్‌, మాళవికాశర్మ, అమృతా అయ్యర్‌ కథానాయికలు. తమిళ మాతృకలో కేవలం ఒక్క హీరోయిన్‌ మాత్రమే అలరించింది. ‘రెడ్‌’లో మాత్రం ముగ్గురు భామలు కనిపించనున్నారు. దీంతో సినిమా కథలో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. పైగా ముగ్గురు హీరోయిన్లు అంటే అభిమానులకు కూడా పండగే కదా. ఈ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠి, భోజ్‌పూరి అభిమానులతో థియేటర్లలో అలరించనుంది. తమిళంలో మాత్రం ఓటీటీలో విడుదల కానుంది.

నారప్ప: మునుపటికి పూర్తి భిన్నంగా వెంకీ

వెంకటేశ్‌ నటిస్తున్న ‘నారప్ప‌’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎందుకంటే మునుపెన్నడూ వెంకీమామను ఇలాంటి మాస్‌లుక్‌లో చూసింది లేదు. ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేశ్‌.. కొంతకాలంగా రూటుమార్చి నవ్వులు పూయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరింత భిన్నంగా పూర్తి మాస్‌ అవతారం ఎత్తారు. తమిళంలో ధనుశ్‌ హీరోగా నటించిన ‘అసురన్‌’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాన్నే ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు వెంకీ. ఇప్పటికే వచ్చిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కథానాయిక. అయితే.. ధనుశ్‌ తెలుగు అభిమానులకు సుపరిచితుడే కాబట్టి చాలా మంది తెలుగు సినీ అభిమానులు తమిళ అసురన్‌ను చూసే ఉంటారు. మరి డైరెక్టర్‌ ఈ సినిమాను ఎలాంటి మార్పులు చేసి తీసుకొస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఛత్రపతి: టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు..

ఎన్నో తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్‌లుగా మారాయి.. మారుతున్నాయి. మన హీరోలు కూడా కొంతమంది బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేశారు. అయితే.. ఈసారి కొత్తగా తెలుగు సినిమాను ఓ తెలుగు హీరో బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ని బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీలో రీమేక్‌ చేయనున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ సినిమాలపై ఉత్తరాది అభిమానులకు బాగా ఆసక్తి పెరిగింది. అందుకే ప్రభాస్‌ సినిమాను హిందీలో రీమేక్‌ చేసేందుకు డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ కియారా అడ్వాణీని హీరోయిన్‌గా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాతృక ‘ఛత్రపతి’కి కొన్ని మార్పులు చేసి ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. మరి.. జక్కన్న చెక్కిన ఈ ‘ఛత్రపతి’ని హిందీ రీమేక్‌ మరిపిస్తుందా..? లేదో వేచి చూడాల్సిందే.

బెల్‌బాటమ్‌: మళ్లీ పాత సునీల్‌ కనిపించేనా..?

వీటితో పాటు మన ‘మర్యాద రామన్న’ సునీల్‌ కూడా రీమేక్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన మంచి ఎంటర్‌టైనర్‌గా టాక్‌ తెచ్చుకున్న కన్నడ చిత్రం ‘బెల్‌బాటమ్‌’ను ఆయన రీమేక్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్‌కు అతికినట్లు సరిపోయే ఈ సినిమా ఇది. ఒకవేళ ఈ సినిమా నిజంగానే పట్టాలెక్కి తెరపైకి వస్తే మాత్రం మరోసారి మునుపటి నవ్వుల సునీల్‌ కనిపించడం ఖాయం.

 

ఇవీ చదవండి!

ఏందిరా వదిలేస్తావా నన్ను..!

ఘనంగా సింగర్‌ సునీత వివాహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని