Published : 16 Jan 2022 10:44 IST

Telugu movies: ఈ ఏడాది అలరించే సీక్వెల్స్‌ ఇవే!

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస సినిమాలతో సందడి చేయాల్సిన చిత్ర పరిశ్రమ కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే ఆశావహ దృక్పథంతో కొన్ని ఆసక్తికర ప్రాజెక్టులు ఈ ఏడాది సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఘన విజయం సాధించిన చిత్రాలకు కొనసాగింపుగా వస్తుండటం ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది.  మరి ఏయే చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయో చూసేద్దామా!

మరోసారి నవ్వించనున్న కో-బ్రదర్స్‌

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ తోడళ్లులుగా నటించి నవ్వులు కురిపించిన చిత్రం ‘ఎఫ్‌-2’. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో మరోసారి కో-బ్రదర్స్‌గా కడుపుబ్బా నవ్వించడానికి వెంకీ, వరుణ్‌ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 25న ‘ఎఫ్‌-3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఫుల్‌ టైమ్‌ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత.


ఆ ప్రశ్నకు సమాధానం ‘కేజీయఫ్‌2’లో...

టేకింగ్‌, ఎడిటింగ్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌, మ్యూజిక్‌, రీ రికార్డింగ్‌ అన్నింటిలోనూ ఒక ట్రెండ్‌ సెట్‌ చేసిన సినిమా ‘కేజీయఫ్’‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ నటుడు యశ్‌ నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ని ఊపేసింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘కేజీయఫ్‌2’ విడుదలకు సిద్ధమవుతోంది. గరుడను చంపిన రాఖీ ‘కేజీయఫ్‌’ను ఎలా కైవసం చేసుకున్నాడు? అధీరను ఎలా ఎదుర్కొన్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలకు ‘కేజీయఫ్‌2’లో సమాధానం లభించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


హిట్‌ 2

విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో నటించిన ‘హిట్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘హిట్‌2’ రానుంది. అయితే, ఈ సినిమాలో అడవి శేష్‌ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. శైలేష్‌ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నాని నిర్మిస్తున్నారు. ఇందులో అడవి శేష్‌ కృష్ణదేవ్‌ పాత్రలో కనిపించనున్నారు.


కార్తికేయ 2

యువ కథానాయకుడు నిఖిల్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒకటి. మిస్టరీ థ్రిల్లర్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కార్తికేయ2’ రాబోతోంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని నిఖిల్‌ ధీమాతో ఉన్నారు.


ఢీ డబుల్‌ డోస్‌

ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల. ఆయన కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచిన చిత్రాల్లో ‘ఢీ’ ఒకటి. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఢీ డబుల్‌ డోస్‌’ త్వరలో పట్టాలెక్కనుంది. మరోసారి మంచు విష్ణు, శ్రీనువైట్ల ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. ‘ఢీ’ మేజిక్‌ను తప్పకుండా పునరావృతం చేస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.


‘పుష్ప: ది రూల్‌’ ఈ ఏడాదే..!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కించిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రైజ్‌’. పాన్‌ ఇండియా మూవీగా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగం సినిమా కోసం రంగం సిద్ధమైంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఆ చిత్రం ‘పుష్ప: ది రూల్‌’ పేరుతో ఈ ఏడాది డిసెంబర్‌లోనే విడుదల చేయాలని చిత్ర బృందం గట్టి నిశ్చయంతో ఉందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కాస్త విరామం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రెండో భాగానికి సంబంధించిన చిత్రీకరణను మొదలు పెట్టనున్నారు.


గూఢచారి 2

అడవి శేష్‌ కీలక పాత్రలో నటించిన యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘గూఢచారి’. 2018లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి2’ రాబోతోంది. ఈ ప్రాజెక్టు గురించి ఎప్పుడో ప్రకటించినా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు అడవి శేష్‌ ‘మేజర్‌’, ‘హిట్‌2’ సినిమాలను ఒప్పుకొన్నారు. అన్నీ కుదిరితే ‘గూఢచారి2’ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చు. హిందీ నుంచీ సీక్వెల్‌ సినిమాలు వరుస కట్టనున్నాయి. ‘భూల్‌ భూలయా2’, ‘హీరో పంటి2’, ‘బదాయి దో’, ‘ఏక్‌ విలన్‌ 2’... ఇలా చాలానే ఉన్నాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని