Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

కరోనా పరిస్థితుల నుంచి కోలుకుని థియేటర్‌లలో వరుస సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పేరున్న కథానాయకుల సినిమాలు

Published : 27 Sep 2021 09:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా పరిస్థితుల నుంచి కోలుకుని థియేటర్‌లలో వరుస సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పేరున్న కథానాయకుల సినిమాలు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన చిత్రాలు, కొత్త వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలో తళుక్కున మెరుస్తున్నాయి. మరి ఈ వారంలో అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలు ఏంటో చూసేద్దామా!

వెరీ వెరీ స్పెషల్‌ బాండ్‌ ‘నో టైమ్‌ టు డై’

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ బాండ్‌ సిరీస్‌ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా నటించిన చిత్రమిది. విలన్‌ సఫీన్‌గా రామి మాలెక్‌ నటిస్తున్నారు. కారీ జోజి దర్శకుడు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబరు 30న బాండ్‌ థియేటర్‌లలో సందడి చేయనున్నాడు. అమెరికాలో అక్టోబరు 8న ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ‘బాండ్‌’ మూవీపై అంచనాలను పెంచుతోంది.


కలెక్టర్‌గా సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’

సాయి తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవకట్టా దర్శకుడు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో సాయితేజ్‌ కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయాల కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేసేలా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో కలెక్టర్‌ పాత్రలో సాయి చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన పవన్‌కల్యాణ్‌.. ఈ సినిమా గురించి ప్రచారం చేయడంతో పాటు, ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగంతో ‘రిపబ్లిక్‌’కు మరింత క్రేజ్‌ వచ్చింది. మరి కలెక్టర్‌గా సాయితేజ్‌ ఎలా మెప్పించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


‘దేవి’లో ఆ పిల్లాడు హీరోగా ‘అసలు ఏం జరిగిందంటే’

1999లో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ‘దేవి’. అందులో మాంత్రికుడు చిన్న పిల్లాడిగా మారిపోతాడు. మాస్టర్‌ మహేంద్రన్‌ ఆ పాత్రలో తనదైన హావభావాలు పలికించాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాల నటుడిగా మహేంద్రన్‌ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ బందరి దర్శకుడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి, ఎట్టకేలకు అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


నలుగురు రైడర్స్‌ ‘ఇదే మా కథ’

శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’. నాలుగు కథల సమాహారంగా తెరకెక్కుతోందీ చిత్రం. గురు పవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్ల కథ ఇది. తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమవుతారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. మరి ఎవరి కథ ఏంటి? ఎందుకు వీరంతా ఇంటిని వదిలి వచ్చేశారు? అనుకున్న గమ్యం చేరుకున్నారా? తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ఓటీటీలో అలరించే చిత్రాలివే!

సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌ బావ-బావమరుదుల కథ

సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’తో ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి ‘ఒరేయ్‌ బామ్మర్ది’ స్ట్రీమింగ్‌ కానుంది.


నెట్‌ఫ్లిక్స్‌

* బ్రిట్నీ వర్సెస్‌ స్పియర్స్‌ - సెప్టెంబరు 28

* నో వన్‌ గెట్స్‌ అవుట్‌ ఎలైవ్‌- సెప్టెంబరు 29

* ద గల్టీ- అక్టోబరు 1

* డయానా -అక్టోబరు 1

డిస్నీ+హాట్‌స్టార్‌

* షిద్ధత్‌ -అక్టోబరు 1

* లిఫ్ట్‌- అక్టోబరు 1

అమెజాన్‌ ప్రైమ్‌

* చెహ్రే -సెప్టెంబరు 30

* బింగ్‌ హెల్‌- అక్టోబరు 1

* బ్లాక్‌ ఆజ్‌ నైట్‌- అక్టోబరు 1

సోనీ లివ్‌

* ది గుడ్‌ డాక్టర్‌- సెప్టెంబరు 28

జీ5

* బ్రేక్‌ పాయింట్‌ -అక్టోబరు 1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని