Mahesh babu: ఉపేంద్రా? విజయ్‌ సేతుపతా? మహేశ్‌ని ఢీకొనేది ఎవరో!

అగ్రదర్శకుడు త్రివిక్రమ్ ‌(Trivikram Srinivas) సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ మహేశ్‌బాబు (Mahesh Babu) లాంటి పెద్ద హీరో కాంబినేషన్‌ అంటే అది పదింతలు అవుతుంది. మనకు బాగా తెలిసిన నటుల్నే వైవిధ్యమైన పాత్రల్లో చూపించడంలో త్రివిక్రమ్‌ దిట్ట. ఆయన గత చిత్రం...

Published : 28 Jul 2022 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రదర్శకుడు త్రివిక్రమ్ ‌(Trivikram Srinivas) సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ మహేశ్‌బాబు (Mahesh Babu) లాంటి పెద్ద హీరో కాంబినేషన్‌ అంటే అది పదింతలు అవుతుంది. మనకు బాగా తెలిసిన నటుల్ని వైవిధ్యమైన పాత్రల్లో చూపించడంలో త్రివిక్రమ్‌ దిట్ట. ఆయన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ లో టబు, జయరామ్‌, సముద్రఖని లాంటి నటులు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆ సినిమా విజయానంతరం, దాదాపు రెండేళ్ల తరువాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చిత్రానికి సంబంధించి ప్రీషూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. ఆగస్టు నెల మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవ్వనుంది.

అయితే ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పటికే కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra)ని అనుకోగా, మరో కీలకమైన పాత్ర కోసం విజయ్‌సేతుపతి (Vijay Sethupathi)ని త్రివిక్రమ్‌ రంగంలోకి దించనున్నట్లు సమాచారం. తెలుగులో కూడా విజయ్ సేతుపతికి ఫాలోయింగ్‌ బాగా పెరగడంతో, అతని కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను త్రివిక్రమ్‌ తీర్చిదిద్దనున్నారట. అసలు మహేశ్‌బాబుకి ప్రతినాయకుడిగా త్రివిక్రమ్‌ ఎవరిని చూపించబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరో వైపు కథ ప్రకారం  మహేశ్‌బాబునే ప్రతినాయక ఛాయలున్న రాజకీయ కథానాయకుడి పాత్రలో చూపించనున్నారనే వార్త సినిమాపై మరింత అంచనాలు పెంచే విధంగా ఉంది. ఏదేమైనా దాదాపు 12ఏళ్ల తరువాత రానున్న మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో అతడు(2005), ఖలేజా(2010) చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్న ‘#SSMB 28’ ప్రాజెక్టుకి టైటిల్‌ ఇంకా ఖరారు కానట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని