urvasivo rakshasivo Review: రివ్యూ: ఊర్వశివో రాక్షసివో
అల్లు శిరీశ్ - అను ఇమ్మాన్యుయేల్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ ఎలా ఉందంటే
చిత్రం: ఊర్వశివో రాక్షసివో; నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్, పృథ్వీ, ఆమని, కేదార్ శంకర్, పోసాని కృష్ణమురళి, తదితరులు; సంగీతం: అచ్చు రాజమణి; ఛాయాగ్రహణం: తన్వీర్; కూర్పు: కార్తీక శ్రీనివాస్; నిర్మాణం: ధీరజ్ మొగిలినేని, తమ్మారెడ్డి భరద్వాజ, విజయ్.ఎం; సమర్పకులు: అల్లు అరవింద్; నిర్మాణ సంస్థ: GA2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్; దర్శకుడు: రాకేష్ శశి; విడుదల తేదీ: 4-11-2022
ఈ నెల బాక్సాఫీసు దగ్గర సందడంతా చిన్న సినిమాలదే. అగ్ర తారల సినిమాల తాకిడి లేదు కాబట్టి.. కథల్లో బలం ఉంటే చిన్న చిత్రాలు సైతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అందుకే యువతరం కథానాయకుల సినిమాలు వరుస కట్టాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 బ్యానర్ నుంచి రూపొందిన సినిమా కావడం... అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ జోడీ నటించడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో విడుదలకి ముందే ఈసినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి సినిమా అందుకు తగ్గట్టుగా ఉందో లేదో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: శ్రీకుమార్ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. సింధూజ (అను ఇమ్మాన్యుయేల్) అమెరికాలో పనిచేసి భారత్‌కు తిరిగొచ్చిన అమ్మాయి. ఇద్దరూ ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. సింధూని చూసి మనసు పారేసుకుంటాడు శ్రీకుమార్. ఆధునిక భావాలున్న ఆమె కూడా తక్కువ సమయంలోనే అతడికి దగ్గరవుతుంది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యాక శ్రీ తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. ఆమె మాత్రం ప్రేమించడం లేదని చెబుతుంది. మరి మనసులో ప్రేమ లేకుండానే శ్రీకి సింధు ఎలా దగ్గరైంది? ఇద్దరూ కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేశారు? వారిద్దరికీ పెళ్లైందా? లేదా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: కొత్త పోకడలతో అడుగులు వేస్తున్న యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించే కథ ఇది. శారీరక బంధం, ప్రేమ, కలలు, లక్ష్యాలు, సహజీవనం, పెళ్లి... తదితర విషయాల్ని ఆసక్తికరంగా స్పృశించాడు దర్శకుడు. కథ కొత్తదేమీ కాకపోయినా.. తగు పాళ్లలో హాస్యం, భావోద్వేగాల్ని మేళవించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. రచనలో బలం, ప్రధాన కథాంశంలో సంఘర్షణ, సన్నివేశాల్లో హాస్యం పండటం సినిమాకి కలిసొచ్చింది. ఆరంభ సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపించినా.. నాయకానాయికల జోడీ దగ్గరయ్యాక కథ పరుగులు పెడుతుంది. ఆఫీసు వాతావరణం, ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, కుటుంబ నేపథ్యంతో ప్రథమార్ధం సరదాగా సాగిపోతుంది. ఓటీటీ, వెబ్‌సిరీస్‌తో ముడిపెడుతూ వెన్నెల కిషోర్ పండించిన కామెడీ, క్రికెట్‌తో పోలుస్తూ సునీల్ చేసే హంగామా నవతరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కథనంలో బలం లేకపోయినా, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడి ఊహకు అందినప్పటికీ సందర్భోచితంగా హాస్యం పండటంతో ఇతరత్రా లోటుపాట్లేవీ బయటికి కనిపించవు. నాయికనాయకుల మధ్య సహజీవనం మొదలయ్యాక సాగే హంగామా, ఆ నేపథ్యాన్ని కామెంట్రీ రూపంలో వెన్నల కిషోర్ - సునీల్ చెప్పిన తీరు, అక్కడ పండిన హాస్యం సినిమాకి హైలైట్. కథలో భాగంగానే అయినా.. హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సన్నివేశాలు హద్దులు దాటినట్లు అనిపిస్తాయి. బ్యాటింగ్, పెర్ఫార్మెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ అంటూ అక్కడక్కడా ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు వినిపించినప్పటికీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పతాక సన్నివేశాలు సాదాసీదాగా అనిపించినా తెరపైన ఓ కొత్త అంశాన్ని వినోదాత్మకంగా చర్చించిన అనుభూతి కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే: అల్లు శిరీష్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడిగా ఒదిగిపోయాడు. ఒకపక్క తల్లిదండ్రులకీ, మరోపక్క ప్రేమించిన అమ్మాయికీ మధ్య నలిగిపోయే కుర్రాడిగా చక్కటి అభినయం ప్రదర్శించాడు. కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. కథానాయిక అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి మంచి కెమిస్ట్రీని కూడా పండించాడు. అయితే.. భావోద్వేగాలు, హావభావాల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలనిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ సినిమాకి హైలైట్. ఆధునిక, స్వతంత్ర భావాలున్న యువతిగా ఒదిగిపోయారు. ఆమె నటన, హావభావాలు ఆకట్టుకుంటాయి. శిరీష్, అను కెరీర్‌కి కలిసొచ్చే చిత్రమిది. వెన్నెల కిషోర్, సునీల్, పోసాని తదితరుల హంగామా నవ్వించింది. ఆమని, కేదార్ శంకర్, పృథ్వీ తల్లిదండ్రులుగా పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అచ్చు - అనూప్ సంగీతం బాగుంది. పాటల చిత్రీకరణ సినిమాలోని ప్రధాన ఆకర్షణలో ఒకటి. కెమెరా, కూర్పు విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. కథ, రచనలో కొత్తదనం ఉంది. కథని ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు రాకేశ్ శశి విజయవంతమయ్యాడు. నిర్మాణం బాగుంది.
బలాలు
+హాస్యం
+ప్రథమార్ధం
+సంగీతం
బలహీనతలు
- అక్కడక్కడా సాగదీతగా సన్నివేశాలు
- ఊహకు అందేలా సాగే కథనం
చివరిగా: ఊర్వశివో రాక్షసివో... యువతరాన్ని మెప్పిస్తుంది
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!