Published : 01 Dec 2021 01:43 IST

Sirivennela: పాటల రచయిత కాకపోయుంటే..? అదే నా ప్రేరణ: సిరివెన్నెల

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన తొలి సినిమా ‘సిరివెన్నెల’నే  ఇంటిపేరుగా పేరుగా సుస్థిరం చేసుకున్నారు లెజండరీ రచయిత సీతారామశాస్త్రి. మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన తెలుగు సినీ పాటకు ఓ తేనె పూత. ఆబాల గోపాలాన్ని అలరించే వేలాది పాటలు రాసి.. తెలుగు పాట సాహిత్య కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన సిరివెన్నెల ఇకలేరన్న నిజాన్ని తెలుగు సినీ, సాహితీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు భాషకు పట్టం కడుతూనే తన పాటల్లో నవరస భావోద్వేగాలను పలికించే పాటల మాంత్రికుడాయన. ట్విటర్‌లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ఆస్క్‌ సిరివెన్నెల’ పేరుతో జూన్‌లో సినీ ప్రియులతో చిట్‌చాట్‌లో ఆయన తన గురించి.. తన సాహిత్యం తదితర అనేక అంశాలపై సూటిగా పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు మీకోసం.. 

అప్పట్లో ఉన్న పాటలు సినిమాలూ ఇప్పుడెందుకు రావడంలేదు?

* ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం.

త్రివిక్రమ్ మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం?

మనకు ఇష్టమైన విషయాన్ని మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను.. కాబట్టి దాన్ని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు.

లైఫ్‌ ఆఫ్‌ రామ్‌ పాట ఒక అద్భుతం. ఆ పాటలో మీకు నచ్చిన లైను గురించి చెప్పండి?

* ‘‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా// ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’’.. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్ర బిందువు

మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని ఎక్కువగా శ్రమపెట్టిన పాట ఏది?

పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటులేదు

మీకు నచ్చిన సినిమా, మీ దృష్టిలో సినిమా అంటే?

లిస్టు చాలా పెద్దది, ‘పిట్టభాష’ సరిపోదు. ఇక - కథని చెప్పడం, చూపడం - రెండు ప్రక్రియలు. చెప్పడం సులభం, చూపడం కష్టం. సినిమా ఆ పని చేస్తుంది. కావ్యేషు నాటకం రమ్యం అని అందుకే అన్నారు. రక్తమాంసాలున్న పాత్రలతో కథని చూపడం అనే పనిచేసే సినిమా అన్నది నాకు ఇష్టం.

మీకు బాగా నచ్చిన కవి ఎవరు?

వాల్మీకి

ఇన్నేళ్ల మీ సాహిత్య ప్రస్థానంలో మీరు ప్రయోగించిన, మీరు గర్వించదగిన పదం లేదా వాక్యం?

‘‘ప్రశ్న- కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటాడే ప్రశ్న’’

దైవాన్ని నిర్వచించాలంటే?

.. తనను తాను నిర్వచించుకోగలగాలి

మీ పాటల్లో మీరు గర్వించే పాట?

ప్రతీ పాట

మీరు రాసిన పాటల్లో వేటూరి సుందరామ్మూర్తి గారికి ఏ పాట ఇష్టం? ఆయన మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం?

చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.

మీరు ఎక్కువ సమయం ఏం చేస్తుంటారు?

ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను.

ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా?

మనల్ని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే!

మీరు ప్రజలకు చదవమని చెప్పే ఐదు పుస్తకాలు ఏమిటి?

నేను ప్రజలకు ఫలానా పుస్తకం చదవమని ఎప్పుడూ చెప్పలేదు. అది జీవితాన్ని తీవ్రమైన అక్కరతో బతకడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఏది చదవాలో, ఎప్పుడు ఏది కావాలో జీవితమే తెచ్చి ఇస్తుంది. 
‘ఊరికే పేజీలు తిరగేసే బ్రెయిన్ లైబ్రరీలో బీరువాలాంటిది’

నిరంతరాయంగా మిమ్మల్ని, మీ కలాన్ని నడిపిస్తున్న స్ఫూర్తి ఏంటి?

అత్యంత తీవ్రతతో ఉన్న క్షణాన్నీ గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం.. అదే నా ప్రేరణ.

ఏకాగ్రతకు మీ నిర్వచనం?

నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం.నేను తప్ప ఇంకే అనిపించకపోవడం.

మీరు మెచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌?

ఒక వ్యక్తి ఉండరు, వ్యక్తీకరణ ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి గొప్పగానే చేస్తారు. ఒక్క మ్యూజిక్‌ విషయంలోనే కాదు.. ఏ ప్రతిభా వ్యక్తీకరణకైనా ఇదే వర్తిస్తుంది. 

చెంచాడు భవసాగరాన్ని ఈదడానికి ఆవశ్యమైన సాధనాలేంటి ?

ఆ మాట అన్నది అమృతం సీరియల్ రూపకర్త గుణ్ణం గంగరాజు. మీ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే - ‘భవసాగరాన్ని ఒక చెంచాడే అనుకోగలగడం’

రచయితకు ఉండాల్సిన మొదటి లక్షణం?

తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం.

దేవులపల్లి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత?

‘‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా "తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు" -  వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది.

మీరు రచించని పాటల్లో మీరు ఎంతగానో మెచ్చిన పాట ఏది?

చాలా! ప్రతీ ఒక్కరూ ఏదోఒక గొప్ప పాట రాసే ఉంటారు.

మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతారు?

నేనున్నాను గనుక!

మీకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన రెండు పాటలు?

"నా పాట పంచామృతం.. నా గానాన గీర్వాణి స్నానాలు శాయంగ"

"సృష్టి కావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని"

లిరిక్స్‌ రాయడానికి ఏదైనా ఫేవరేట్‌ స్థలం మీకు ఉంటుందా?

నా బుర్రలో అలజడి!

యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం? నిజమా?

తప్పే! మృగాలను అవమానించకూడదు

ప్రేమ పాటల్ని అద్భుతంగా రాసే మీకు కావాల్సిన ప్రేరణ, స్ఫూర్తి ఎవరిని నుంచి కలుగుతుంది?

బతుకంతా ప్రేమే! ప్రేమ నుంచే ప్రేమ వస్తుంది!

పాటలో నిరాశానిస్పృహల్ని వ్యక్తపరిచే  సందర్భంలో కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ని దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?

కాలం గాయాన్ని మాన్పుతుంది అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం.

‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా// ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా’’

యూత్‌కి ఇచ్చే సందేశం?

యూత్‌ అనేది ఏజ్‌ కాదు.. అదొక ఫేజ్‌. అదొక స్టేజ్‌. అది తెలుసుకుంటే యూత్‌ ఇట్‌సెల్ఫ్‌ ఈజ్‌ ఏ మెసేజ్‌.

మీరు పాటల రచయిత కాకపోయి ఉంటే?

జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది.

తెలుగుభాష గొప్పతనం ఏంటి?

ఏ భాష ప్రత్యేకత ఆ భాషదే. అసలు సమస్య ఏమిటంటే.. మనుషులందరినీ కలపాల్సిన భాష... ‘లు’ తగిలించుకొని ఇన్నిగా ఎందుకుండాలి?

మీకు బాగా నచ్చిన పుస్తకాలు?

నా స్వల్ప అనుభవానికి సంబంధించి ఇష్టమైనవి రెండు పుస్తకాలు. ఒకటి భగవద్గీత, రెండోది ఖలీల్‌ జిబ్రాన్‌ రాసిన ద ప్రాఫెట్‌.

కాళీపట్నం రామారావు (కా.రా.) మాస్టారు గురించి..
*కథా యజ్ఞానికి ప్రధాన రుత్విజుడు కాళీపట్నం రామారావు మాస్టారు. జీవితం అంతటినీ కథ అనే సాహితీ ప్రక్రియకు అంకితం చేసిన మహా వ్యక్తి. కథని పదికాలాల పాటు పచ్చగా ఉంచడానికి పెంచడానికి తన యాగఫలాన్ని ధారపోసి వెళ్లారు.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్