Vaarasudu: ఓటీటీలో విజయ్‌ ‘వారసుడు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Vaarasudu OTT: విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది!

Updated : 17 Feb 2023 13:06 IST

హైదరాబాద్‌: తమిళ స్టార్‌ విజయ్‌ (Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వారిసు’. సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ కథా చిత్రంగా పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. తమిళ, తెలుగు భాషలతో పాటు, హిందీ ఆడియోను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారట. మరోవైపు ఓవర్సీస్‌ ప్రేక్షకుల కోసం ఈ మూవీ సన్‌ నెక్ట్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జనవరి 11న తమిళంలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి, బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

కథేంటంటే: మైనింగ్‌ రంగంలో తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజేంద్ర (శరత్‌ కుమార్‌)కు ముగ్గురు కుమారులు. జై (శ్రీకాంత్‌), అజయ్‌ (శ్యామ్‌), విజయ్‌ (విజయ్‌). అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రాజేంద్ర తన సంస్థకు వారసుడిని ప్రకటించాలనుకుంటాడు. అప్పుడే విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చిన విజయ్‌ని ఓ ఫంక్షన్‌లో పరిచయం చేస్తాడు. అలాగే తగిన ప్రతిభను చాటుకున్న కుమారుడినే తన వ్యాపార వారసుడిగా ప్రకటిస్తానని చెబుతాడు. అయితే ఆ రేసు ఇష్టం లేని విజయ్‌.. తండ్రి మాటలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. తల్లి సుధ (జయసుధ) అడ్డుకున్నప్పటికీ, కుటుంబం నుంచి విడిపోయి, ఏడేళ్లపాటు ఒంటరిగా ఉంటూ, ఓ స్టార్టప్‌ కంపెనీని ఆరంభిస్తాడు. ఇంతలో రాజేంద్ర, అతని సామ్రాజ్యాన్ని మట్టికరిపించడానికి ప్రతినాయకుడు జయప్రకాశ్‌ (ప్రకాశ్‌రాజ్‌) కుతంత్రాలు పన్నుతాడు.  కుటుంబంలో అనూహ్యమైన పరిణామాలు ఎదురవడంతో మళ్లీ ఇంటికొస్తాడు విజయ్‌. విజయ్‌ తిరిగి రావడానికి కారణమేంటి? రాజేంద్ర వ్యాపార సామ్రాజ్యం ఏమైంది? విజయ్‌ తీసుకున్న నిర్ణయాలేంటి అన్నదే మిగిలిన కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని