Vaarasudu: నా సినీ ప్రయాణంలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు: దిల్‌రాజు

‘వారసుడు’ టీమ్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. తమిళ నటుడు విజయ్‌ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సినిమా ఇది. 

Published : 12 Jan 2023 19:28 IST

హైదరాబాద్‌: ఓ చిత్రం కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), సంగీత దర్శకుడు తమన్‌ (S Thaman) పడినంత కష్టాన్ని తన సినీ ప్రయాణంలో ఎప్పుడూ చూడలేదన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju). ఈ ముగ్గురి కాంబినేషన్‌లో విజయ్‌ (Vijay) హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ (Varisu). రష్మిక (rashmika mandanna) కథానాయిక. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. ఆ వివరాలివీ..

అన్ని సినిమాలూ విజయం సాధించాలి: దిల్‌రాజు

‘‘కంటెంట్‌పై మాకు బాగా నమ్మకం ఉంది కాబట్టి ‘వారిసు’ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసేలా విలేకర్లకు స్పెషల్‌ షో వేశాం. దానికి విశేష స్పందన వచ్చింది. వారంతా సినిమాకు కనెక్ట్‌ అయిపోయి, నిల్చొని చప్పట్లు కొట్టినప్పుడు మా బాధంతా మర్చిపోయాం. వంశీ, తమన్‌ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. నా 50 సినిమాల ప్రయాణంలో ఎప్పుడూ అలాంటి పరిస్థితి చూడలేదు. సాధారణ షోలలోనూ అదే స్థాయి ఆదరణ దక్కడంతో వంశీ, తమన్‌ ఏడ్చేశారు. ప్రేక్షకుల స్పందన మా బాధ్యత పెంచుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపిస్తే.. మేం (దిల్‌రాజు, వంశీ) తమిళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ బ్లాక్‌ బ్లస్టర్‌ కొట్టి మీ ముందుకొచ్చాం. గర్వంగా ఉంది. వ్యక్తిగతంగానూ నాకు బాగా దగ్గరైన చిత్రమిది. ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని అలరించే చిత్రాన్ని అందివ్వాలని అనుకుంటూనే ఉంటా. ఈసారి ‘వారసుడు’ వస్తున్నాడు. ఈరోజు విడుదలైన బాలకృష్ణగారి సినిమా ‘వీరసింహారెడ్డి’ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. శుక్రవారం విడుదలకాబోతున్న చిరంజీవి- రవితేజల ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయం అందుకోవాలి. తర్వాత వచ్చే మా సినిమా కూడా విజయం సాధించాలి. అన్ని చిత్రాలకూ డబ్బులు రావాలి’’ అని దిల్‌రాజు పేర్కొన్నారు.

సునీల్‌ బాబుకు సినిమా అంకితం: వంశీ

‘‘ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌ బాబుగారికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సినిమాకు పనిచేయడం ఆపేసి, విశ్రాంతి తీసుకోమని చెప్పా. ‘మీ సినిమా కోసం ప్రాణమైనా ఇస్తా. వదిలేయలేను’ అన్న భావంతో నాకు మెసేజ్‌ పంపారు. ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరం. ఈ చిత్రాన్ని ఆయనకు అంకితమిస్తున్నా. మీరు ఆస్పత్రిలో దీనస్థితిలో ఉన్నప్పుడు మీతో ఉండేది మీ కుటుంబం మాత్రమే. ఆ ఆలోచనతో మొదలైందే ఈ సినిమా కథ. విజయ్‌కు వినిపించగానే నటించేందుకు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రతి షోకు ప్రేక్షకులు నిల్చొని చప్పట్లు కొడుతున్నారనే రిపోర్ట్‌ తెలిసి చాలా సంతోషించా. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారోనన్న దానికి ఈ చిత్రం నిదర్శనంగా నిలుస్తుంది. సినిమాను గెలిపించేందుకు చూడకండి. సినిమాను ప్రేమించేందుకు చూడండి. నా ప్రతి సినిమాలో అమ్మ పాత్ర జయసుధగారికే. తమిళ ప్రేక్షకులంతా ఆమె, శరత్‌కుమార్‌గారి గురించే మాట్లాడుకుంటున్నారు. హీరో తల్లీతండ్రులుగా అంతబాగా ఒదిగిపోయారు. అమ్మ నిజం.. నాన్న నమ్మకం అనే దాన్ని మీరు సినిమాలో చూస్తారు. సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనొక చిన్న దర్శకుణ్ని అయితే చాలనుకున్నా. పెద్ద స్టార్‌ విజయ్‌ను డైరెక్ట్‌ చేసినందుకు కలిగిన అనుభూతిని ఎలా వివరించాలో తెలియట్లేదు. కెరీర్‌ ప్రారంభం నుంచి నా వెంట ఉన్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌’’ అని వంశీ చెప్పారు.

విజయ్‌తో తొలి చిత్రం: జయసుధ

‘‘వారిసు’ పెద్ద హిట్‌ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను నిర్మాత దిల్‌రాజుకు అంకితం చేశా. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం నాకు ఇచ్చారు. వంశీ దర్శకత్వంలో ఎన్ని సినిమాలు చేసినా కొత్తగానే ఉంటుంది. నటన కొంచెం ఎక్కువైనా, తక్కువైనా ఆయన ఊరుకోరు. పాత్ర పరిధిమేర ఉండాలంటారు. విజయ్‌తో కలిసి నేను నటించిన తొలి చిత్రమిదే. ఆయన అద్భుతమైన నటుడేకాదు మంచి మనసున్న వ్యక్తి’’ అని జయసుధ అన్నారు.

వాటికి ‘వారసుడు’ భిన్నం: శ్రీకాంత్‌

‘‘గతంలో నేనెన్నో ఫ్యామిలీ మూవీస్‌ చేశా. ‘వారసుడు’ సినిమా వాటికి భిన్నంగా రిచ్‌గా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. వంశీ కుటుంబాన్ని ఎంతగా గౌరవిస్తారో అది ఈ చిత్రంలో కనిపిస్తుంది. తెలుగువారంటే హీరో విజయ్‌కు చాలా గౌరవం. సెట్స్‌లో ఉండే ప్రతి ఒక్కరినీ ఆయన పలకరిస్తారు’’ అని శ్రీకాంత్‌ వివరించారు.

ఆయన వల్లే ఇదంతా: తమన్‌

‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌ బాబు మరణించడం చాలా బాధాకరం. ఆయన వేసిన సెట్‌ వల్ల దర్శకుడికి ఓ ఆలోచన వచ్చింది. భారీ సినిమాగా మారింది. ఆ సెట్‌ను చూసి రీరికార్డింగ్‌కు కనీసం 50 రోజుల సమయం పడుతుందనుకున్నా. నేను మంచి సంగీతం అందించానంటే దానికి కారణం సునీల్‌ గారే. జయసుధగారిలో మా అమ్మను చూసుకున్నా. సినిమాను చూశాక ‘ఇది చేసింది మేమేనా’ అనే ఆశ్చర్యం కలిగింది. భావోద్వేగాన్ని తట్టుకోలేక ఏడ్చేశా. నేను కంటతడిపెట్టుకుని 15 ఏళ్లయింది’’ అని తమన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని