Ranga Ranga Vaibhavanga Review: రివ్యూ: రంగ రంగ వైభవంగా

వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా ఎలా ఉందంటే..?

Updated : 02 Sep 2022 15:04 IST

Ranga Ranga Vaibhavanga Review: చిత్రం: రంగ రంగ వైభ‌వంగా; న‌టీన‌టులు: వైష్ణవ్ తేజ్‌, కేతికా శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, న‌రేశ్‌, ప్రభు, తుల‌సి, ప్రగ‌తి, సుబ్బరాజు, అలీ, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి, హ‌ర్షిణి త‌దిత‌రులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు; ఛాయాగ్రహ‌ణం: శ్యామ్‌ద‌త్ సైనుద్దీన్‌; నిర్మాత‌: బివిఎస్ఎన్ ప్రసాద్‌; క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: గిరీశాయ‌; విడుద‌ల తేదీ: 02-09-2022 

చిరంజీవి కుటుంబ వార‌స‌త్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. ‘ఉప్పెన‌’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు వైష్ణవ్ తేజ్‌. రెండో ప్రయ‌త్నంలో ‘కొండ‌పొలం’తో కాస్త నిరాశ‌ప‌రిచినా.. న‌టుడిగా విమ‌ర్శకుల ప్రశంస‌లు ద‌క్కించుకున్నారు. ఇప్పుడాయ‌న నుంచి వ‌చ్చిన మూడో చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ రీమేక్‌కు ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ గిరీశాయ‌.. ఈ సినిమాతో తెలుగు తెర‌కు దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ప్రచార చిత్రాల్లో ‘ఖుషి’ చిత్ర ఛాయాలు క‌నిపించ‌డం.. ఆ సినిమా త‌ర‌హాలోనే ఇదీ ప్రేమికుల ఇగో మ‌ధ్య న‌డిచే క‌థ కావ‌డం.. వైష్ణవ్‌, కేతిక‌ల జోడీ చూడ‌ముచ్చట‌గా ఉండ‌టంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ‌రి ఈ ప్రేమ‌క‌థ సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది? వైష్ణవ్ ఖాతాలో మ‌రో విజ‌యం చేరిందా? గిరీశాయ ద‌ర్శకుడిగా తొలి ప్రయ‌త్నంలోనే స‌త్తా చాటాడా? తెలుసుకుందాం ప‌దండి..

క‌థేంటంటే: స్నేహానికి నిలువెత్తు నిద‌ర్శనం రాముడు (ప్రభు), చంటి (న‌రేష్‌). ఇద్దరివీ ప‌క్క ప‌క్క ఇళ్లే. చంటి కొడుకు రిషి (వైష్ణవ్ తేజ్‌), రాముడు కూతురు రాధ (కేతికా శ‌ర్మ‌).. ఇద్దరూ ఒకే రోజున‌.. ఒకే ఆస్పత్రిలో జ‌న్మిస్తారు. ఈ త‌ల్లిదండ్రుల‌ మ‌ధ్య ఉన్న చ‌క్కటి స్నేహ బంధ‌మే పిల్లల మ‌ధ్య మొగ్గ తొడుగుతుంది. అయితే రిషి, రాధ‌ స్నేహం స్కూల్ డేస్‌లోనే ప్రేమ బంధంగా మారుతుంది. స్కూల్‌లో జ‌రిగిన ఓ చిన్న సంఘ‌ట‌న వీరిద్దరి మ‌ధ్య దూరం పెంచుతుంది. ఇగోతో పంతాల‌కు పోయి ఒక‌రితో మ‌రొక‌రు మాట్లాడుకోవ‌డం మానేస్తారు. ఇద్దరూ ఒకే మెడిక‌ల్ కాలేజీలో చ‌దువుతున్నా.. ఒక‌రితో ఒక‌రు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. కానీ, ఇద్దరికీ ఒక‌రంటే మ‌రొక‌రికి చ‌చ్చేంత ప్రేమ. ఈ జంట మ‌ధ్యనున్న ఇగో వార్ చ‌ల్లారి.. ఒక్కట‌య్యే స‌మ‌యంలోనే వీరి కుటుంబాల్లో మ‌రో ప్రేమ‌క‌థ అలజ‌డి రేపుతుంది. అది రిషి అన్నయ్య‌.. రాధ అక్క ప్రేమ‌క‌థ‌. వీరి వ‌ల్ల రిషి - రాధ‌ ప్రేమ ఎందుకు స‌మ‌స్యల్లో ప‌డింది? ప్రాణ స్నేహితులుగా ఉన్న కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వ‌డానికి కార‌ణ‌మేంటి? ఇందులో రాధ అన్నయ్య వంశీ (న‌వీన్ చంద్ర‌) పాత్ర ఏంటి? ఈ రెండు ప్రేమ‌క‌థ‌లు ఎలా సుఖాంత‌మ‌య్యాయి? రెండు కుటుంబాల్ని ఒక్కటి చేయ‌డానికి రిషి చేసిన సాహ‌సాలేంటి? అన్నది మిగిలిన క‌థ‌.

ఎలా ఉందంటే: స్నేహం క‌లిపిన రెండు కుటుంబాలు.. ఆ కుటుంబాల్లోని పిల్లల మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం.. చిన్నత‌నంలోనే గొడ‌వ‌లు ప‌డి ఇద్దరూ ఇగోల‌తో దూరం పెంచుకోవ‌డం.. అన్ని గొడ‌వ‌లూ స‌ద్దుమ‌ణిగి ప్రేమ‌క‌థ కంచికి చేరే స‌మ‌యానికి ఇరు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు ఏర్పడ‌టం.. ఈ త‌రహా ప్రేమ‌క‌థ‌లు తెలుగు తెర‌పై ఇప్పటికే బోలెడ‌న్ని వ‌చ్చాయి. ఇప్పుడీ జాబితాలోకి కొత్తగా ‘రంగ రంగ వైభ‌వంగా’ వ‌చ్చి చేరింది. ద‌ర్శకుడు రాసుకున్న క‌థ‌లో ఏమాత్రం కొత్తద‌నం క‌నిపించ‌దు. ప్రథమార్ధంలో సినిమా ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కు తెర‌పై వ‌చ్చే ప్రతి స‌న్నివేశం ప్రేక్షకుల ఊహ‌కు త‌గ్గట్లుగానే సాగుతుంది. రిషి, రాధల‌ ప‌రిచ‌య స‌న్నివేశాలు ‘నువ్వే కావాలి’, ‘ఖుషి’ చిత్రాల్ని గుర్తు చేస్తాయి. ఇద్దరూ స్కూల్ డేస్‌లోనే ప్రేమ‌లో ప‌డ‌టం.. రాధ కోసం రిషి తోటి విద్యార్థితో క్లాస్ రూమ్‌లోనే క‌మ‌ర్షియ‌ల్ హీరో త‌ర‌హాలో త‌ల‌ప‌డ‌టం వంటివి మ‌రీ అతిగా అనిపిస్తాయి. తెర‌పై ఎలాంటి ప్రేమ‌క‌థ చూపించినా.. ఆ క‌థ‌ను ప్రేక్షకుల‌కు క‌నెక్ట్ అయ్యేలా చెప్పగ‌ల‌గాలి. అది.. ద‌ర్శకుడు ల‌వ్ ట్రాక్‌ను బ‌లంగా తీర్చిదిద్దుకోగ‌లిగిన‌ప్పుడే సాధ్యమ‌వుతుంది. ఈ విష‌యంలో చిత్ర ద‌ర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. రిషి, రాధ‌ల ప్రేమ‌క‌థలో ఏమాత్రం ఫీల్ క‌నిపించ‌దు. అలాగే బ‌ల‌మైన సంఘ‌ర్షణ కూడా క‌నిపించ‌దు. కాలేజీ నేప‌థ్యంలో ఇద్దరి మ‌ధ్య వ‌చ్చే టామ్ అండ్ జెర్రీ త‌ర‌హా వార్ ఎపిసోడ్స్ అక్కడ‌క్కడా మెప్పిస్తాయి. మ‌ధ్యలో వ‌చ్చే న‌వీన్ చంద్ర పొలిటిక‌ల్ ట్రాక్ క‌థ‌కు స్పీడ్ బ్రేక‌ర్‌లా అడ్డు తగిలినట్లనిపిస్తుంది. విరామానికి ముందు రిషి, రాధ‌లు మౌనం వీడి మాట్లాడుకోవ‌డం.. అంతా సాఫీగా జ‌రుగుతుంద‌న్న స‌మ‌యంలోనే వారి అన్నఅక్కల ప్రేమ వ‌ల్ల రెండిళ్లలో విభేదాలు త‌లెత్తడంతో క‌థ‌ కాస్త ర‌స‌వ‌త్తరంగా మారుతుంది.

గొడ‌వ‌ల వల్ల విడిపోయిన రెండు కుటుంబాల్ని క‌ల‌ప‌డం కోసం రిషి, రాధ ఏం చేశారు? వంశీ మ‌న‌సు మార్చడం కోసం ఇద్దరూ ఎలాంటి ఎత్తుగ‌డలు వేశారు? అన్నది ద్వితీయార్ధంలో చూపించారు. ఒక‌ర‌కంగా ద్వితీయార్ధమంతా కాస్త ఎమోష‌న‌ల్ డ్రామాలా న‌డిపించే ప్రయ‌త్నం చేశారు ద‌ర్శకుడు. కానీ, ఆ ఎమోష‌న్స్ ఎక్కడా వ‌ర్కౌట్‌ అవ్వలేదు. వైష్ణవ్‌ తేజ్‌ - స‌త్య మ‌ధ్య వ‌చ్చే అంత్యాక్షరి ట్రాక్, న‌వీన్ చంద్ర - సుబ్బరాజు మధ్య వచ్చే పొలిటిక‌ల్ ఎపిసోడ్స్‌ మ‌రీ సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ మ‌రీ మెలోడ్రామాలా అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: రిషి పాత్రలో వైష్ణవ్ స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకునేలా క‌నిపించారు. కొన్ని స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న‌, ప‌లికించిన హావ‌భావాలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గుర్తు చేస్తాయి. అయితే క‌థ‌లోనే స‌రైన బ‌లం లేక‌పోవ‌డంతో న‌ట‌న ప‌రంగా ఆయ‌న కొత్తగా చేయడానికి అవ‌కాశం దొర‌క‌లేదు. వైష్ణవ్‌కు జోడీగా కేతిక అంద‌చందాల‌తో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేసింది. ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్కగా కుదిరింది. న‌వీన్ చంద్ర‌, ప్రభు, న‌రేశ్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేరకు నటించారు. ద‌ర్శకుడు క‌థ రాసుకున్న విధానం.. దాన్ని తెర‌పై ఆవిష్కరించిన తీరు ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించ‌దు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి కాస్త బ‌లాన్నిచ్చింది. మూడు పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. శ్యామ్ ద‌త్ ఛాయాగ్రహ‌ణం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు:
+ వైష్ణవ్‌, కేతికల‌ కెమిస్ట్రీ
+ దేవిశ్రీ సంగీతం
+ విరామ స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు:
-
కొత్తద‌నం లేని క‌థ‌
సాగ‌తీత స‌న్నివేశాలు
- ద్వితీయార్ధం, ముగింపు

చివ‌ర‌గా: రంగ‌.. రంగ‌.. నీర‌సంగా

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని