Vamshi Paidipally: నా జీవితంలో అతిపెద్ద విజయం ఇదే: వంశీ పైడిపల్లి

తన కుటుంబంతో కలిసి తాజాగా ‘వారసుడు’ (Vaarasudu) చిత్రాన్ని వీక్షించారు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally). ఈ సినిమా చూసి తన తండ్రి భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు.

Updated : 15 Jan 2023 12:38 IST

హైదరాబాద్‌: తన జీవితంలో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నానంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally). కుటుంబంతో కలిసి ‘వారసుడు’ (Vaarasudu) వీక్షించిన ఆయన ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. ఈ సినిమా చూసి వంశీ తండ్రి భావోద్వేగానికి గురి కావడం.. పుత్రోత్సాహంతో ఆయన్ని హత్తుకోవడం వంటి భావోద్వేగ దృశ్యాలతో ఈ వీడియో సాగింది. ‘‘వారసుడు’ వీక్షించి నా తండ్రి ఎంతగానో ఆనందించారు. ఈరోజు నేను నా జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను. జీవితాంతం ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. ‘నాన్నా.. నువ్వే నా హీరో. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ వంశీ రాసుకొచ్చారు.

‘మహర్షి’ (Maharshi) వంటి క్లాస్‌ విజయం తర్వాత వంశీ తెరకెక్కించిన పూర్తిస్థాయి తమిళ చిత్రం ‘వారిసు’ (Vaarisu). విజయ్‌ (Vijay) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్‌ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రానికి కమర్షియల్‌ హంగులు జోడించి దీన్ని రూపొందించారు. రష్మిక, జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్‌, శ్రీకాంత్‌‌, శ్యామ్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్‌లో జనవరి 11న విడుదలైన ఈ చిత్రం ఆ రాష్ట్రంలో మంచి టాక్‌ అందుకుంది. ఇక, శనివారం ‘వారసుడు’ పేరుతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని