హిందీకి వెళ్తున్న మరో తమిళ బ్లాక్‌బస్టర్‌.. తెలుగులో ఆ ప్రాజెక్టు ఇక లేనట్లేనా?

శింబు, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ‘మానాడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

Updated : 07 Apr 2023 09:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ హీరోలు, దర్శకులు దక్షిణాది సినిమాలపై ఎప్పటి నుంచో మనసు పారేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ విజయవంతమైన సినిమాలను అక్కడ రీమేక్‌ చేస్తూ హిట్లు కొడుతున్నారు. మొన్న ‘విక్రమ్‌ వేద’, నిన్న ‘భూలా’. ఇప్పుడు మరో తమిళ సూపర్‌హిట్‌ అక్కడ రీమేక్‌ కాబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు కథానాయకుడిగా నటించిన ‘మానాడు’. తెలుగులో ‘ది లూప్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎందుకో విడుదల సందర్భంగా పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. ఓటీటీలో మాత్రం విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో ఇద్దరు స్టార్‌ హీరోలతో ఈ సినిమా రీమేక్‌ చేసేందుకు హక్కులు కొన్నారని ఆ తర్వాత తెలిసింది. కొద్దిరోజుల పాటు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇద్దరు ముగ్గురు దర్శకులతో మార్పులు చేయించారు. అయినా కూడా సినిమా పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో ఈ సినిమాను ఇక హిందీకి తీసుకెళ్లిపోతున్నట్లు సమాచారం.

‘మానాడు’ హిందీలో ఓ క్రేజీ కాంబినేషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌ ధావన్‌, రవితేజ కీలక పాత్రల్లో ఇందులో నటిస్తారట. రానా, ఏషియన్‌ సునీల్‌ నిర్మాతలుగా వ్యవహరించన్నట్లు సమాచారం. అలాగే ధర్మ ప్రొడక్షన్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. శింబు పాత్రను వరుణ్‌ధావన్‌, ఎస్‌.జె.సూర్య పాత్రను రవితేజ పోషించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. వరుణ్ ధావన్‌ భేదియా (తోడేలు) తెలుగులో విడుదలైంది. మరోవైపు రవితేజకు హిందీ కొత్తేమీ కాదు. దీంతో ఈ కాంబినేషన్‌ మంచి హిట్టవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులతో ఇక ముందుకు వెళ్లడమే. ప్రస్తుతం రవితేజ నటించిన ‘రావణాసుర’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత ‘ఈగల్‌’, ‘టైగర్‌నాగేశ్వరరావు’ చిత్రాలు చేస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ హిందీలో ఓ చిత్రం చేస్తున్నారు. మరోవైపు వరుణ్‌తేజ్‌తో ప్రవీణ్‌ సత్తారు తీసే సినిమా కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే ‘మానాడు’ హిందీ రీమేక్‌ పట్టాలెక్కుతుంది.

అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ రవితేజ వద్దకు...

‘మానాడు’లో ఎస్‌.జె.సూర్య పోషించిన డీసీపీ ధనుష్కోటి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆయన నటన, డిక్షన్‌ విమర్శకులను సైతం మెప్పించింది. అసలు తొలుత ఈ పాత్ర కోసం రవితేజను అనుకున్నారట. అయితే, తమిళంలో కన్నా కూడా తెలుగులో ఈ సినిమా రీమేక్‌ చేస్తే తాను నటిస్తానని అన్నారట. తెలుగు రీమేక్‌పై చాలా కాలం పాటు తర్జనభర్జనలు జరిగాయి. ధనుష్కోటి పాత్రకు రవితేజ ఫిక్స్‌ కాగా, శింబు పోషించిన పాత్ర ఎవరితో చేయించాలన్న సందిగ్ధతతో చాలా కాలం ఆ ప్రాజెక్టు ముందుకు, వెనక్కీ నడిచింది. ఇప్పుడు హిందీలో రీమేక్‌ అవుతుండటం, రెండు పాత్రలు దాదాపు ఖరారు కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నీ కుదిరితే తెలుగు ప్రేక్షకుల కోసం కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ ‘ది లూప్‌’ కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని