Thodelu Review: రివ్యూ: తోడేలు

వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘తోడేలు’ చిత్రం ఎలా ఉందంటే?

Updated : 25 Nov 2022 12:05 IST

Thodelu Review చిత్రం: తోడేలు; న‌టీనటులు: వ‌రుణ్ ధ‌వ‌న్‌, కృతిస‌న‌న్‌, దీప‌క్ డోబ్రియాల్‌, అభిషేక్ బెన‌ర్జీ, పాలిన్ క‌బ‌క్‌, త‌దితరులు; సంగీతం: స‌చిన్ జిగ‌ర్‌; ఛాయాగ్రహ‌ణం: జిష్ణు; కూర్పు: సంయుక్త కాజా; ర‌చ‌న‌: నీరేన్ భ‌ట్‌; నిర్మాత: దినేశ్ విజ‌న్; నిర్మాణ సంస్థ‌: మ‌ద్దోక్ ఫిలింస్‌, జియో స్టూడియోస్‌; ద‌ర్శక‌త్వం: అమ‌ర్ కౌశిక్; తెలుగులో విడుదల: గీతా ఫిలిం డిస్ట్రిబ్యూష‌న్‌; విడుద‌ల తేదీ: 25 న‌వంబ‌ర్ 2022

భాష‌ల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోయాయి. సినిమా బాగుందంటే చాలు ఎవ‌రు న‌టించారు?ఎక్కడి నుంచి వ‌చ్చింద‌నే విష‌యాల్ని ప‌ట్టించుకోకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఏ భాష నుంచి ఏ సినిమా వ‌చ్చి వ‌సూళ్లు కొల్లగొడుతుందో ఊహించ‌లేం. అందుకే సినిమా బృందాలు కూడా.. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే క‌థ అనిపించిందంటే ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి సిద్ధమ‌వుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా వాటిని విడుద‌ల చేయ‌డానికి అంతే ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తున్నాయి. ‘కాంతార‌’ త‌ర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ త‌న డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మ‌రో చిత్రమే ‘తోడేలు’. హిందీలో ‘భేదియా’గా రూపొందిన ఈ చిత్రం ఎలా  ఉందో తెలుసుకుందాం..

క‌థేమిటంటే: భాస్కర్ అలియాస్ భాస్కీ (వ‌రుణ్ ధ‌వ‌న్‌) ఓ రోడ్డు కాంట్రాక్టర్‌. అరుణాచ‌ల్ ప్రదేశ్‌లోని జిరో అనే ప్రాంతంలో ద‌ట్టమైన అడ‌వుల మ‌ధ్య ఓ రోడ్డు నిర్మించాల‌నేది అత‌డి ల‌క్ష్యం. అందుకోసం త‌న డ‌బ్బు, ఇల్లు ప‌ణంగా పెడ‌తాడు. సోద‌రులు జేడీ (అభిషేక్ బెన‌ర్జీ), జోమిన్ (పాలిన్ క‌బ‌క్‌)తో క‌లిసి వెళ‌తాడు.  అక్కడికి వెళ్లాక ఆదివాసీల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వాళ్లని ఎలాగైనా ఒప్పించి అడవిని చీల్చి రోడ్డు వేసేందుకు ప్రణాళిక‌లు ర‌చిస్తాడు. అంత‌లోనే అతడిని అడ‌విలోని తోడేలు కరుస్తుంది. అప్పట్నుంచి  రోడ్డు వేయ‌డానికి స‌హ‌క‌రిస్తున్న ఒక్కొక్కళ్లూ చ‌నిపోతుంటారు. ఆ ఊళ్లో వైర‌స్ క‌ల‌కలం మొద‌ల‌వుతుంది. భాస్కర్‌ని తోడేలు కరవడానికి, అక్కడి వారి మరణాలకు సంబంధ‌మేమిటి? డా.అనిక (కృతిస‌న‌న్‌) ఎవ‌రు? రోడ్డునిర్మాణం పూర్తైందా? లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: జాంబీ జోన‌ర్ ట‌చ్‌తో కూడిన హార‌ర్ కామెడీ చిత్రమిది. అలాగ‌ని దీన్ని కేవ‌లం న‌వ్వించి, భ‌య‌పెట్టే సినిమాల జాబితాలో చేర్చలేం. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యత గురించి, ఈశాన్య రాష్ట్రాల ప్రజ‌లను మిగ‌తా వాళ్లు చూసే తీరు గురించి చెబుతూ సునిశితంగానే గొప్ప సందేశాన్నిస్తుందీ చిత్రం. ట్రెండీగా సాగే వాణిజ్య ప్రధాన‌మైన సినిమాలు చేసిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్‌ ధావ‌న్‌తో ఈ త‌ర‌హా క‌థ చేయ‌డం, ఆయ‌న ఇందులో న‌టించడం మెచ్చుకోద‌గ్గ విష‌యం. అరుణాచ‌ల్ ప్రదేశ్ నేప‌థ్యం ఈ సినిమాకి కొత్త క‌ల‌ర్‌నిచ్చింది. ఆరంభ స‌న్నివేశాల‌తోనే ప్రేక్షకుల్ని జిరో అడ‌వుల్లోకి తీసుకెళ‌తాడు ద‌ర్శకుడు. క‌థానాయ‌కుడిని తోడేలు కరవడం నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ ప్రతి సీన్‌లో ఉంటుంది. మ‌నిషి తోడేలుగా మార‌డం అనేది సినిమాటిక్‌గా అనిపించే వ్యవ‌హారం. కానీ ఇందులో ఆ విష‌యాన్ని న‌మ్మద‌గిన‌ట్టుగా చెప్పడంలో ద‌ర్శకుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. ప్రథమార్ధం సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. కామెడీ, హార‌ర్‌, థ్రిల్‌.. ఇలా అన్నీ పండాయి. కామెడీ, హార‌ర్‌ని మేళ‌వించి ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డం అంత సుల‌భం కాదు. ద‌ర్శకుడు ఆ విష‌యంలో విజ‌య‌వంత‌మ‌య్యాడు. ద్వితీయార్ధంలోనే స‌మ‌స్యంతా. కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. తొలిభాగం స్థాయిలో ఆస‌క్తిని రేకెత్తించ‌లేక‌పోయారు. ఇక ఇలాంటి క‌థ‌ల‌కి భావోద్వేగాలు చాలా కీల‌కం. అక్కడ‌ ద‌ర్శకుడి క‌స‌ర‌త్తులు ఫ‌లించ‌క‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌. ప‌తాక స‌న్నివేశాల్లో క‌థ‌లో మ‌లుపు క‌ట్టి ప‌డేస్తుంది. కానీ ఆ నేప‌థ్యంలో భావోద్వేగాల్ని పండించ‌లేక‌పోయారు. ప‌ర్వతాలు, అడ‌వులు, తోడేళ్లతో కూడిన జిరో ప్రపంచాన్ని విజువల్‌గా తెర‌పై ఆవిష్కరంచిన తీరు అద్భుతం. త్రీడీలో ఈ సినిమా మ‌రింత అనుభూతిని పంచుతుంది. జిష్ణు కెమెరా ప‌నిత‌నం, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి హైలైట్‌. ప్రతి స‌న్నివేశాన్నీ స‌హ‌జంగా తెర‌పై ఆవిష్కరించారు. చివ‌ర్లో కొత్త  పాత్రల‌తో మ‌రింత ఉత్సాహాన్నిస్తుందీ చిత్రం.

ఎవ‌రెలా చేశారంటే: న‌వ‌త‌రం ఆలోచ‌న‌ల‌కి ప్రతినిధిగా క‌నిపించే భాస్కర్ పాత్రలో వ‌రుణ్ ధ‌వ‌న్ ఒదిగిపోయారు. తోడేలుగా మారే స‌న్నివేశాల్లో ఆయ‌న అభిన‌యం సినిమాకే హైలైట్‌. ఆ స‌న్నివేశాల్ని విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో అంతే అద్భుతంగా తీర్చిదిద్దారు. అభిషేక్ బెన‌ర్జీ, క‌బ‌క్‌, క‌థానాయిక కృతిస‌న‌న్‌తో క‌లిసి ప్రథ‌మార్ధంలో పండించిన కామెడీ కూడా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. అయితే.. కృతిస‌న‌న్ లుక్ ప‌రంగా నిరుత్సాహ‌ప‌రుస్తుంది. పాండా పాత్రలో డోబ్రియాల్ క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, ర‌చన విభాగాలు చక్కటి ప‌నితీరు క‌న‌బ‌రిచాయి. నిర్మాణం బాగుంది. ద‌ర్శకుడు అమ‌ర్ కౌశిక్ ఈ క‌థ‌, చిత్రబృందాన్ని న‌డిపించిన విధానం బాగుంది.

బలాలు..

1. క‌థా నేప‌థ్యం, 2. హాస్యం, 3. విజువ‌ల్స్‌, 4. న‌టీన‌టులు

బ‌ల‌హీన‌త‌లు..

1. సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు, 2. భావోద్వేగాలు కొర‌వ‌డ‌టం

చివ‌రిగా: ఈ ‘తోడేలు’ చెప్పిన పాఠం బాగుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని