Varun Doctor: శివకార్తికేయన్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’ ఓటీటీలో ఎప్పుడంటే?

తమిళంతో పాటు, తెలుగులోనూ కాస్త గుర్తింపు ఉన్న నటుడు శివకార్తికేయన్‌. గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ

Published : 26 Oct 2021 15:13 IST

ఇంటర్నెడెస్క్‌: తమిళంతో పాటు, తెలుగులోనూ కాస్త గుర్తింపు ఉన్న నటుడు శివకార్తికేయన్‌. గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఆయన కీలక పాత్రలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబరు 4న సాయంత్రం 6.30 గంటలకు సన్‌ టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌, సన్‌నెక్ట్స్‌ ఓటీటీల వేదికగా ‘వరుణ్ డాక్టర్‌’ స్ట్రీమింగ్‌ కానుంది.

క‌థేంటంటే: వ‌రుణ్ (శివ కార్తికేయ‌న్‌) ఓ ఆర్మీ డాక్టర్‌. పెళ్లిచూపుల్లో ప‌ద్మిని (ప్రియాంక అరుళ్ మోహ‌న్‌)ని చూసి ఇష్టప‌డ‌తాడు. ఆమెతో ఏడ‌డుగులు వేయ‌డానికి సిద్ధప‌డుతున్న స‌మ‌యంలోనే.. కొన్ని కార‌ణాల‌ వ‌ల్ల ఇద్దరూ విడిపోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో అనుకోకుండా ప‌ద్మిని చెల్లెలు కిడ్నాప్ అవుతుంది. దీంతో ఆ పాపను వెతికి ప‌ట్టుకునే బాధ్యత‌ను వ‌రుణ్ త‌న భుజాల‌కు ఎత్తుకుంటాడు. ఆ పిల్ల కోసం వెతుకుతున్న క్రమంలో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి. ఆ పాప‌లాగానే గ‌త‌ నాలుగేళ్లలో 400 మంది వ‌ర‌కూ పిల్లలు కిడ్నాప్ అయ్యార‌ని తెలుస్తుంది. ఈ భారీ కిడ్నాప్ రాకెట్ వెనుకున్న ఆ అరాచ‌క శ‌క్తి ఎవ‌రు? ఆ దుర్మార్గుడ్ని వ‌రుణ్ ఎలా ప‌ట్టుకుంటాడు? ఈ క్రమంలో అత‌నికి ఎదురైన స‌వాళ్లేంటి? క‌నిపించ‌కుండా పోయిన ఆ పిల్లలంద‌రూ క్షేమంగా తిరిగొస్తారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శివ కార్తికేయన్‌ నటనతో పాటు, యోగిబాబు కామెడీ హైలైట్‌గా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని