Ghani: ‘‘గని’ మరోసారి వాయిదా

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా  రూపొందిన ‘గని’ చిత్రం మరోసారి వాయిదాపడింది. ఫిబ్రవరి 25న పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ సినిమా విడుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

Published : 22 Feb 2022 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపొందిన ‘గని’ చిత్రం మరోసారి వాయిదాపడింది. ఫిబ్రవరి 25న పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ సినిమా విడుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లానే తామూ ‘భీమ్లా నాయక్‌’ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా కొవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. పరిస్థితిని బట్టి ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని దర్శకనిర్మాతలు ఇటీవల ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే ఫిబ్రవరి 25వ తేదీని ఖరారు చేశారు. అదే రోజున ‘భీమ్లా నాయక్‌’ వస్తుండటంతో మళ్లీ వాయిదా వేశారు.

బాక్సింగ్‌ నేపథ్యంలో దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ సందడి చేయనుంది. సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని