Custody: ‘శివ’ టైటిల్‌ని నాగచైతన్య వద్దనడానికి కారణమదే: దర్శకుడు వెంకట్‌ ప్రభు

నాగచైతన్య హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన తెలుగు, తమిళ్‌ చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా త్వరలోనే విడుదలకానున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

Published : 09 May 2023 20:17 IST

హైదరాబాద్‌: ‘రాక్షసుడు’, ‘మానాడు’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు.. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu). ఈసారి అనువాదంతో కాకుండా స్ట్రయిట్‌ ఫిల్మ్‌తోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారాయన. ఆ సినిమానే ‘కస్టడీ’ (Custody). నాగచైతన్య (Naga Chaitanya), కృతిశెట్టి (Krithi Shetty) హీరోహీరోయిన్లు. ప్రియమణి, అరవిందస్వామి, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్‌ ప్రభు తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న విశేషాలివీ..

* ‘కస్టడీ’ ఎలా మొదలైయింది?

వెంకట్‌ ప్రభు: కొవిడ్‌ సమయంలో ఈ కథని రాశా. మలయాళ సినిమా ‘నాయట్టు’ దానికి స్ఫూర్తి. అయితే, ఆ చిత్రంలో కమర్షియల్‌ హంగులు ఉండవు. తెలుగు, తమిళ్‌ ఆడియన్స్‌కు ఆ అంశాలు నచ్చుతాయి కాబట్టి వాటిని జోడించా. పెద్ద ఆశయంతో జీవనం సాగించే కానిస్టేబుల్‌ కథని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నా. ‘లవ్‌స్టోరి’ సినిమాలోని ఓ పాటలో నాగచైతన్య నటన నాకు బాగా నచ్చింది. నేను రాసుకున్న కానిస్టేబుల్‌ శివ పాత్రకు ఆయనైతే బాగుంటారని అనిపించి, ఆయన్ను కలిసి కథ వినిపించా. ఆయనకు నేను చెప్పిన స్క్రిప్టు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారు.

* ఇందులో ప్రేమకథ ఉంటుందా

వెంకట్‌ ప్రభు: కానిస్టేబుల్‌ శివది చిన్న పట్టణం. తనకు కుటుంబం ఉంటుంది. ప్రేమకథా ఉంటుంది. అతడికి ఎదురైన ఓ సమస్యతో ప్రారంభమయ్యే సినిమా ప్రీ ఇంటర్వెల్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు థ్రిల్‌ పంచుతుంది. ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. అందరూ ఎంజాయ్‌ చేస్తారు.

* ఈ సినిమాకి ‘శివ’ అనే టైటిల్ పరిశీలించారా ?

వెంకట్‌ ప్రభు: నేను నాగార్జునగారు నటించిన ‘శివ’ సినిమాకి పెద్ద అభిమానిని. ఆయన తనయుడైన చైతన్యతో సినిమా చేస్తుండడం, అందులోని హీరో పాత్ర పేరు శివ కావడంతో అదే టైటిల్‌ పెట్టాలని అనుకున్నా. అయితే, ‘అది క్లాసిక్‌ సినిమా. ఆ పేరు పెడితే ఆ సినిమాతో ఈ సినిమాని పోల్చి చూస్తుంటారు’ అని చైతన్య వద్దన్నారు.

* నాగచైతన్య, కృతిశెట్టి ఎలా నటించారు?

వెంకట్‌ ప్రభు: నాగచైతన్య అద్భుతమైన నటుడు. ప్రేక్షకులు ఈ సినిమాలో కొత్త చైతన్యను చూస్తారు. హీరోలని విభిన్నంగా చూపించేందుకు నేను ఇష్టపడతా. కృతిశెట్టి.. రేవతి పాత్రలో ఒదిగిపోయింది. ఆ రోల్‌ కథలో కీలకం.

* అరవిందస్వామి ఎంపిక గురించి చెబుతారా?

వెంకట్‌ ప్రభు: హీరో కంటే మరో పవర్‌ఫుల్‌ పాత్ర కోసం ఎవరైతే బాగుంటారా? అని అన్వేషిస్తుండగా అరవిందస్వామి గుర్తొచ్చారు. ఆయన్ను సంప్రదించి విషయం చెబితే నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. శరత్‌కుమార్‌ మరో కీలక పాత్ర పోషించారు.

* సంగీతం ఎలాంటి పాత్ర పోషించింది?

వెంకట్‌ ప్రభు: ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో నేపథ్య సంగీతాన్ని మీరు వినే ఉంటారు. ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజా తమ సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ ప్రధాన బలం.

* రెండు భాషల్లో తెరకెక్కించిన అనుభవం గురించి వివరిస్తారా?

వెంకట్‌ ప్రభు: శారీరకంగా, మానసికంగా అది చాలా కష్టమైన పని. ప్రతి షాట్‌ రెండు సార్లు తీయాలి. సంభాషణలు, పాటలు, సెన్సార్‌.. ఇలా ప్రతి విషయంలో రెండు సార్లు వర్క్‌ చేయడమంటే రెండు సినిమాలు తీసినట్టే.

* మీ గత చిత్రం ‘మానాడు’లో పాలిటిక్స్‌ గురించి ప్రస్తావించారు. ‘కస్టడీ’లో ముఖ్యమంత్రి పాత్ర చూపించారు? ఇదేమైనా యూనివర్సా? 

వెంకట్‌ ప్రభు: లేదండీ. కోలీవుడ్‌లోనూ ఇదే ప్రశ్న ఎదురైంది. ‘కస్టడీ’ ప్రపంచం వేరు, ‘మానాడు’ ప్రపంచం వేరు. రెండింటికీ సంబంధం ఉండదు.

* తదుపరి చిత్రాలు?

వెంకట్‌ ప్రభు: ఓ పెద్ద ప్రాజెక్టు చేయబోతున్నా. దాని వివరాలు త్వరలో చెబుతా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని